
మెహతాబ్ జ్యుయెలర్స్ దుకాణంలో పరిశీలిస్తున్న కడప ఒన్‌టౌన్ సీఐ టివి సత్యనారాయణ
కడప అర్బన్: కడప నగరంలోని బి.కె.ఎం వీధిలో ఉన్న మెహతాబ్ జ్యుయెలర్స్‌లో బుధవారం పట్టపగలు దొంగతనం జరిగింది. యజమాని మస్తాన్ ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చేలోపు గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచారు. లోపలికి ప్రవేశించి మొదట సీసీ కెమెరాలను ఆఫ్ చేశారు. తరువాత తాము తెచ్చుకున్న నకిలీ తాళాలతో పెట్టెలో వున్న దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించారు.
కడప నగరంలో గత 30 సంవత్సరాలుగా బంగారు నగల దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఇలాంటి సంఘటన ఇప్పటివరకు జరగలేదని బాధితుడు మస్తాన్ వాపోయాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వచ్చేసరికి ఈ సంఘటన చోటుచేసుకుందని ఆయన తెలియజేశారు. కడప వన్‌టౌన్ సీఐ టి.వి. సత్యనారాయణ, తమ సిబ్బందితో కలిసి దుకాణాన్ని పరిశీలించారు. ఇది తెలిసిన వ్యక్తుల పనే అని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందంతో గాలింపుచర్యలు చేపట్టామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.