కొచ్చి: టెక్నాలజీ మూలాన ఆన్‌లైన్ స్నేహాలు అందువల్ల మోసాలు జరుగుతున్నట్లు ఇటీవల పలు ఘటనలను చూస్తే అర్థమవుతుంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన ఆన్‌లైన్ స్నేహితుల కోసం దొంగగా మారి తన ఇంట్లోనే 750 గ్రామలు బంగారాన్ని చోరి చేసింది. ఈ విచిత్ర ఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంకు చెందిన 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది.
ఆమెకు ఒక సంవత్సరం ముందు శిబిన్ అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పరిచయమయ్యాడు. అలా వారు స్నేహితులుగా మారారు. ఇటీవల శిబిన్ ఆ బాలికతో తన కుటుంబం అర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిపాడు. స్నేహితుని కష్టాలు విని కరిగిపోయిన ఆ బాలిక అతనికి సహాయం చేయాలని తన ఇంట్లో 750 గ్రాముల బంగారం చోరీ చేసి అతడికి ఇచ్చింది. ఆ బంగారం తీసుకున్న శిబిన్ తన తల్లితో కలిసి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో తన ఇంటిని బాగు చేసుకుని మిగిలిన రూ.10 లక్షలను దాచుకున్నాడు.
ఇంట్లో ఉండాల్సిన బంగారం కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో బాలికను ప్రశ్నించగా ఆమె అసలు విషయం బయట పెట్టింది. తన స్నేహితుడు శిబిన్‌కు రూ.750 గ్రాముల బంగారం ఇచ్చినట్లు తెలిపింది. శిబిన్ అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ అమ్మాయి తనకు కేవలం 270 గ్రాముల బంగారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
దీంతో మరో సారి ఆ బాలికను గట్టిగా ప్రశ్నించగా.. పాలక్కాడ్‌కు చెందిన మరో ఇన్‌స్టాగ్రామ్ స్నేహితునికి 40 గ్రాముల బంగారం ఇచ్చినట్లు వెల్లడించింది. బంగారం తీసుకున్నప్పటి నుంచి ఆ రెండో వ్యక్తి బాలికను బ్లాక్ చేసినట్లు తెలిపింది. కాగా బాలిక చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment