నిందితుడు ఆనందవర్ధన్
సాక్షి, రాజేంద్రనగర్: రా ఏజెంట్‌నని నమ్మించి విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకొని బంగారు నగలను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమా ట్విస్ట్‌లను తలపించిన ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఎం.ఆనందవర్ధన్(39)కు వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం నార్సింగి ఠాణా పరిధిలోని నెక్నాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయమైంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. తాను కూడా విడాకులు తీసుకున్నట్లు నమ్మించాడు. తాను మాజీ ఆర్మీ అధికారినని.. ప్రస్తుతం రా ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు మోసం చేసి బెంగళూరు చిరునామాతో ఓ ఐడీ కార్డు సృష్టించి ఆమెకు చూపించాడు. విడాకులు తీసుకున్నట్లు నకిలీ కాపీని చూపించి ఆమెను వివాహం చేసుకున్నాడు. చదవండి: స్నానం చేస్తున్న అమ్మాయిల ఫోటోలు తీసి..
అనంతరం మహిళ వద్ద ఉన్న 50 తులాల బంగారాన్ని దొంగలించి ఓ ప్రైవేటు పైనాన్స్ కంపెనీలో రూ. 8 లక్షలు తీసుకొని జల్సాలు చేశాడు. నెలలో 20 రోజులపాటు ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్తున్నానని చెప్పి మొదటి భార్య వద్ద ఉండేవాడు. రా ఏజెంట్‌గా ఉద్యోగం చేస్తుండటంతో ఎక్కడికి వెళ్తున్నాననే వివరాలు సైతం భార్యకు చెప్పవద్దని ఉన్నతాధికారుల వద్ద ప్రమాణం చేశానని చెప్పేవాడు. అయితే, మార్చి నెలలో బీరువాలో భద్రపరిచిన 50 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సదరు మహిళ ఆనందవర్ధన్‌ను ప్రశ్నించింది. ఇంట్లో చోరీ జరిగిందని నాటకమాడాడు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని మహిళ చెప్పగా.. తాను రా ఏజెంట్‌నని, తన ఇంట్లోనే చోరీ జరిగితే దేశ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని, తన ఉన్నతాధికారులకు విషయం చెప్పి బెంగళూరులోనే కేసు నమోదు చేయిస్తానని వెళ్లాడు. అక్కడ రా అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు నకిలీ పత్రాలు తీసుకొచ్చి ఆమెను నమ్మించాడు. బంగారం రికవరీ విషయాన్ని ప్రశ్నించడంతో సెప్టెంబర్‌లో దొంగ పట్టుబడ్డాడని, అతడి నుంచి అధికారులు రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. డబ్బును ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేశారని నకిలీ చెక్కును సృష్టించాడు. చదవండి: వివాహం, విడాకులు రెండూ కష్టమే
డబ్బు చేతికి రావాలంటే సమయం పడుతుందంటూ మహిళను నమ్మించాడు. డబ్బు విషయమై రోజురోజుకూ ఒత్తిడి పెరగడంతో తానే బెంగళూరుకు వెళ్లి తీసుకొస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. గత నెలలో రా అధికారులమంటూ రెండు ఈ మెయిల్స్‌ను సృష్టించి నెక్నాంపూర్‌లోని మహిళకు సందేశాన్ని పంపాడు. కిడ్నాపర్లు రా ఏజెంట్ అయిన ఆనందవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హతమార్చారని, ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో మృతదేహాన్ని సైతం ఇవ్వలేమంటూ సమాచారం ఇచ్చాడు. హత్యను తాను నమ్మలేనని, మృతదేహాన్ని చూస్తానని ఆమె బదులిచ్చింది. తానే బెంగళూర్‌కు వస్తున్నానని మహిళ మెయిల్ చేయడంతో ఆనందవర్ధన్ రెండు రోజుల క్రితం నేరుగా నెక్నాంపూర్‌లోని ఇంటికి వచ్చేశాడు. అప్పటికే ఆనందవర్ధన్ విడాకులు ఇచ్చానని తెలిపిన మరో మహిళ చిరునామాలో సంప్రదించి విషయం తెలిపింది. తాను మోసపోయినట్లు తెలుసుకున్న మహిళ ఆనందవర్ధన్ రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాపర్లు అపహరించారని, వారి నుంచి తప్పించుకొని వచ్చానంటూ పోలీసులను, మహిళను నమ్మించి ఉడాయించేందుకు మొదట ప్రయత్నించాడు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా జరిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment