వర్మ ఇంట్లో ఖజానా!
వాల్మీకి మండలికి చెందిన రూ.8 కోట్లు,
10 కేజీల బంగారం సీజ్
బనశంకరి: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వాల్మీకి ఆదివాసీ అభివృద్ధి మండలి కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ, సిట్ అధికారులు ప్రముఖ నిందితుడు సత్యనారాయణ వర్మ ఇంట్లో 10 కేజీల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఫ్లాట్‌లో దాచిన రూ.8 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు.
సత్యనారాయణవర్మ వాల్మీకి మండలి డబ్బుతోనే బంగారు కొన్నట్లు విచారణలో చెప్పాడు. 15 కిలోల బంగారం కొన్నట్లు తెలిపాడు. దీంతో హైదరాబాద్‌లోని అతని ఫ్లాట్‌లో గాలించగా 10 కిలోల పసిడి బిస్కెట్లు లభించాయి. మిగతా 5 కిలోల బంగారం కోసం గాలిస్తున్నారు. వాల్మీకి కుంభకోణం డబ్బుతో సత్యనారాయణవర్మ మొత్తం 35 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు కనుగొన్నారు.
కుంభకోణంలో ముఖ్య పాత్ర
జూన్‌లో ఈ స్కాం వెలుగులోకి రాగానే సత్యనారాయణవర్మ అదృశ్యమయ్యాడు. అతడు రాష్ట్రంలోని కొందరు రాజకీయ ప్రముఖులకు సన్నిహితుడని, నిధులను పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ, డ్రాలో అతడు ముఖ్య పాత్ర పోషించాడని సిట్ అధికారులు తెలిపారు. అనేక రోజులు అతని ఆచూకీ లభించలేదు. స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హైదరాబాద్‌లో ఉంటాడని చెప్పారు. వెంటనే వెళ్లి పట్టుకుని బెంగళూరుకు తీసుకువచ్చి తీవ్ర విచారణ చేపట్టారు.
నెమ్మదిగా నగదు, బంగారం గురించి గుట్టువిప్పాడు. సత్యనారాయణవర్మ దొరికాడని తెలియగానే మిగతా నిందితులు నగదు, బంగారాన్ని వేర్వేరు చోట్లకు తరలించారు. కోర్టులో సెర్చ్ వారెంట్ తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లిన సిట్ అధికారులు సత్యనారాయణవర్మకు చెందిన ఫ్లాట్‌లో సోదాలుచేయగా, ఓ బ్యాగ్‌లో దాచిపెట్టిన రూ.8 కోట్లు నగదు లభించింది. మండలి నిధులతో హైదరాబాద్‌లో మియాపూర్ సహా పలు చోట్ల 11 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఇదే కేసులో మాజీ మంత్రి బి.నాగేంద్ర అరెస్టయి ఈడీ అదుపులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment