కరోనా కేసులు, ఫలితాలే కీలకం | Indian shares rise on hopes of more stimulus | Sakshi
Sakshi News home page

కరోనా కేసులు, ఫలితాలే కీలకం

Published Mon, Aug 17 2020 4:23 AM | Last Updated on Mon, Aug 17 2020 9:20 AM

Indian shares rise on hopes of more stimulus - Sakshi

న్యూఢిల్లీ: వచ్చేవారంలో స్టాక్‌ మార్కెట్‌ గమనానికి కరోనా కేసుల పెరుగుదల, కంపెనీల జూన్‌ క్వార్టర్‌(క్యూ1) ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయని స్టాక్‌మార్కెట్‌ నిపుణులంటున్నారు. గతవారంలో దేశీయంగా కీలక సూక్ష్మ ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగి 6.93శాతంగా నమోదైంది. ఎగుమతులు మాత్రం 10.21శాతం క్షీణించి 23.64 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వాటిని విశ్లేషిస్తే ఆర్థిక మందగమనం కొంత రికవరి సాధించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధిక ద్రవ్బోల్బణం నెలకొంది. దీంతో సెంటిమెంట్‌ కొంత బలహీన మార్కెట్లో అస్థిరత కొనసాగవచ్చని వారంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం రెండో దఫా చర్యలకు శ్రీకారం చుట్టవచ్చని అంచనాలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల్లో నెలకొన్నాయి. అలాగే ఈ వారంలో 12కి పైగా ప్రధాన కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి ట్రేడింగ్‌ మార్కెట్‌కు కీలకం కానుంది.  

మరో విడత ప్యాకేజీపై ఆశలు...
‘ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఇది మార్కెట్‌ వర్గాలను కచ్చితంగా ఉత్సాహపరిచే అంశమే. కంపెనీల క్యూ1 ఫలితాలు కూడా మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించగలవు’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. క్యూ1 ఫలితాల విడుదల అంతిమ దశకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు తిరిగి కోవిడ్‌–19 కేసులు నమోదు, లాక్‌డౌన్‌ సడలింపులు తర్వాత ఆర్థిక వ్యవస్థ రికవరి అంశాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌పర్సన్‌ సంజీవ్‌ జర్‌బాదే తెలిపారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలతో వచ్చే వారంలో మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా కరోనా కేసుల పెరుగుదల అంశం దలాల్‌ స్ట్రీట్‌ను గమానికి కీలకం కానుంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు.

అంతర్జాతీయ అంశాలు...
కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు అమెరికా మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే అక్కడి ఆర్థికవేత్తలు అభిప్రాయపడున్నారు. అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. అలాగే క్రూడాయిల్‌ ధరలు కూడా మార్కెట్‌కు కీలకం కానున్నాయి.

విదేశీ పెట్టుబడుల జోరు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా లిక్విడిటీ పెరగడంతో పాటు ఇప్పటివరకు విడుదలైన దేశీయ కార్పోరేట్‌ కంపెనీల క్వార్టర్‌ ఫలితాలు అంచనాలకు మించి నమోదుకావడంతో మన మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్‌పీఐలు ఆసక్తిచూపుతున్నారు. ఈ ఆగస్ట్‌ ప్రథమార్ధంలో డెట్, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.28,203 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నట్లు  డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి.

దాదాపు 5నెలల అనంతరం డెట్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా మారడం విశేషం. ఎఫ్‌పీఐలు జూన్, జూలైలో వరుసగా రూ.3,301 కోట్లు, రూ.24,053 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూల కారకాల మేళవింపు ఫలితంగా భారత మార్కెట్లోకి అధిక మొత్తంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని మార్నింగ్‌స్టార్‌ ఇండియా మేనేజర్‌ రీసెర్చ్‌ హిమాంశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. కరోనా ఎఫెక్ట్‌ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు పలుదేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఉద్దీపన చర్యలు ప్రకటించడమూ దీనికి నేపథ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement