Q1 Results and US Fed Policy Key Role in Market Trend Says Market Experts - Sakshi
Sakshi News home page

ఫెడ్‌ నిర్ణయాలు.. క్యూ1 ఫలితాలు కీలకం

Published Mon, Jul 24 2023 5:58 AM | Last Updated on Mon, Jul 24 2023 3:28 PM

Q1 results and US Fed policy key role in market trend says market experts - Sakshi

ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఫెడ్‌ రిజర్వ్‌) పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ప్రపంచ పరిమాణాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.  

బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన, మౌలిక, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్‌ 846 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 180 పాయింట్లు ర్యాలీ చేసింది. అయితే ఐటీ షేర్లు ముఖ్యంగా ఇన్ఫోసిస్‌ భారీ క్షీణతతో శుక్రవారం సూచీలు 18 వారాల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా ఆరురోజుల రికార్డు ర్యాలీకి బ్రేక్‌ పడింది. 
 
‘‘బ్యాంకింగ్‌ షేర్లకు డిమాండ్, విదేశీ పెట్టుబడుల వెల్లువ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఇంకా సానుకులత మిగిలే ఉంది. ఇదే సమయంలో ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలు వెల్లడి, జూన్‌ క్వార్టర్‌ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కొంత స్థిరీకరణకు లోనవచ్చు. వచ్చే వారం జూలై డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్నందున కొంత ఆటుపోట్లకు గురికావచ్చు. సాంకేతికంగా నిఫ్టీ  స్వల్ప కాలం పాటు 19,524 – 19,854 స్థాయిలో కదలాడొచ్చు. మూమెంటమ్‌ కొనసాగి ఈ శ్రేణిని చేధిస్తే ఎగువున 19,992 వద్ద మరో నిరోధం ఎదురుకావచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమా తెలిపారు.

కీలక దశలో క్యూ1 ఫలితాలు
స్టాక్‌ మార్కెట్‌ ముందుగా రిలయన్స్, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది.  ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.

టాటా స్టీల్, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పేయింట్స్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, టాటా మోటర్స్, ఎల్‌అండ్‌టీ, టాటా కన్జూమర్‌ ప్రాడెక్ట్స్, బజాజ్‌ ఫైనాన్స్, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. అలాగే కొకొ–కోలా, బోయింగ్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, విసా, మెటా, మాస్టర్‌కార్డ్, ప్రాక్టర్‌–గ్యాంబెల్, హార్మేస్, ఆ్రస్టాజెనికా తదితర అంతర్జాతీ కంపెనీలు సైతం ఇదే కంపెనీలో తమ క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు కీలక దశకు చేరుకున్న తరుణంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ అధికంగా ఉండొచ్చు. ఈ అంశమూ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేసే వీలుందని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.  

ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం
అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం(జూలై 25న) ప్రారంభమవుతుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. ఫెడ్‌ రిజర్వ్‌ లక్ష్య ద్రవ్యోల్బణం రెండు శాతం కంటే అధికంగా ఉండటం, లేబర్‌ మార్కెట్‌ పటిష్టత కారణంగా కీలక వడ్డీరేట్లు 25 బేసిస్‌ పాయింట్లు(పావు శాతం) పెంపు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపుతో కొంత అమ్మకాల ఒత్తిడి నెలకొనే వీలుంది. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి
తీసుకోవచ్చు.

స్థూల ఆర్థిక గణాంకాలు
జపాన్, యూరోజోన్, అమెరికా దేశాల జూన్‌ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా సోమవారం విడుదల అవుతుంది. అమెరికా ఫెడ్‌ ద్రవ్య పరపతి నిర్ణయాలు, కొత్త ఇళ్ల అమ్మకాల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. యూరో సెంట్రల్‌ బ్యాంక్‌ ఈసీబీ వడ్డీరేట్లను గురువారం, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ నిర్ణయాలను ప్రకటించనున్నాయి. ఇక దేశీయంగా శుక్రవారం జూన్‌ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటా, జూన్‌ 18న ముగిసిన డిపాజిట్‌– బ్యాంక్‌ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు.

కొనసాగిన ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు  
భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దేశీయ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉండట, చైనాలో నెలకొన్న  ప్రతికూలత కారణంగా ఎఫ్‌ఐఐలు జూలైలో ఇప్పటివరకు రూ.45,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.43,804 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.2,623 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వరుసగా మూడో నెలా ఎఫ్‌ఐఐ నిధులు రూ.40 వేల కోట్లను అధిగమించాయి.

ముఖ్యంగా ఫైనాన్స్, ఆటోమొబైల్స్, కేపిటల్‌ గూడ్స్, రియలీ్ట, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఎఫ్‌ఐఐల ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల రికార్డు ర్యాలీకి ప్రధాన మద్దతిస్తున్నది విదేశీ పెట్టుబడిదారులే. సూచీల రికార్డు ర్యాలీతో ఇప్పటికే ఈక్విటీ మార్కెట్‌ విలువ అధిక వాల్యూయేషన్‌కు చేరుకుంది. దీనివల్ల మార్కెట్లపై ఒత్తిడి ఉంటుంది. ఈ దశలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు అవకాశం ఉండొచ్చు’’ అని మారి్నంగ్‌ స్టార్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక డిపాజిటీ గణాంకాల ప్రకారం ఎఫ్‌ఐఐలు మేలో రూ. 43,838 కోట్లు, జూన్‌లో రూ. 47,148 కోట్లను భారత ఈక్విటీల్లో ఉంచారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ.1.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement