2023–24లో 5.5 శాతం తగ్గుదల
45 లక్షల యూనిట్లకు పరిమితం
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం వాహనాల ఎగుమతులు మందగించాయి. 2022–23తో పోలిస్తే 2023–24లో 5.5 శాతం తగ్గాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ ఎగుమతులు 47,61,299 యూనిట్లుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం 45,00,492 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వివిధ విదేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడమే ఎగుమతులు నెమ్మదించడానికి కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ‘మన వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులకు మంచి డిమాండ్ ఉన్న కొన్ని దేశాలు.. విదేశీ మారకం సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు స్వల్పంగా పెరిగినప్పటికీ, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర..త్రిచక్ర వాహనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి తొలి త్రైమాసికంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో రికవరీ కనిపించిందని, మిగతా ఏడాదంతా కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నట్లు అగర్వాల్ వివరించారు.
సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల వివరాలివీ..
► ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6,62,703 యూనిట్ల నుంచి 6,72,105 యూనిట్లకు పెరిగాయి. మారుతీ సుజుకీ అత్యధికంగా 2,80,712 యూనిట్లు, హ్యుందాయ్ 1,63,155, కియా మోటర్స్ 52,105, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 44,180 యూనిట్లు ఎగుమతి చేశాయి.
► ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం క్షీణించి 36,52,122 యూనిట్ల నుంచి 34,58,416 యూనిట్లకు తగ్గాయి.
► వాణిజ్య వాహనాల ఎగుమతులు 16 శాతం తగ్గి 78,645 యూనిట్ల నుంచి 65,816 వాహనాలకు పరిమితమయ్యాయి. త్రిచక్ర వాహనాలు 18 శాతం క్షీణించి 3,65,549 యూనిట్ల నుంచి 2,99,977 యూనిట్లకు నెమ్మదించాయి.
Comments
Please login to add a commentAdd a comment