మళ్లీ ఎగుమతులు డౌన్!
• ఆగస్టులో మైనస్ 0.3% క్షీణత
• వెనుకడుగు వీడలేదన్న సంకేతాలు
• దిగుమతులదీ క్షీణబాటే...
• 12 బిలియన్ డాలర్ల నుంచి
• 8 బిలియన్ డాలర్లకు వాణిజ్యలోటు
• 77 శాతం పడిపోయిన పసిడి దిగుమతి
న్యూఢిల్లీ: ఎగుమతులకు సంబంధించి ‘జూన్’ వృద్ధి ఆ నెలకే పరిమితమయ్యింది. జూలై తరువాత వరుసగా రెండవ నెల ఆగస్టులోనూ దేశ ఎగుమతులు పడిపోయాయి. ఆగస్టు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా -0.3% క్షీణత నమోదయ్యింది. విలువ రూపంలో చూస్తే... ఆగస్టు 2015లో ఎగుమతుల విలువ 21.58 బిలియన్లుకాగా 2016 ఆగస్టులో విలువ 21.51 బిలియన్ డాలర్లు. 2014 డిసెంబర్ నుంచీ వరుసగా 19 నెలలు 2016 మే వరకూ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా పడిపోతూ వచ్చాయి. జూన్‌లో స్వల్ప వృద్ధితో ఊరట నిచ్చాయి.
దిగుమతులు చూస్తే...
ఇక దిగుమతుల్లోనూ వృద్ధి లేదు. ఆగస్టులో -14 శాతం క్షీణించి 29.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్య లోటు 7.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యిం ది. గత ఏడాది ఆగస్టులో వాణిజ్య లోటు 12.4 బిలియన్ డాలర్లు. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
⇔ ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణతలో ఉన్న రంగాల్లో పెట్రోలియం ఉత్పత్తులు (14 శాతం), తోలు (7.82 శాతం) కెమికల్స్ (5 శాతం).
⇔ ఇక చమురు దిగుమతుల విలువ -8.47 శాతం పడిపోయి 6.74 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
⇔ ఎగుమతుల్లో సానుకూల వృద్ధి నమోదయిన రంగాల్లో ఇంజనీరింగ్, జౌళి, ఫార్మా, రత్నాలు, ఆభరణాలు, ఇనుప ఖనిజం విభాగాలు ఉన్నాయి.
⇔ ఎగుమతులు మొత్తంలో నాన్-పెట్రోలియం ఎగుమతుల విలువ 1.79 శాతం పెరిగి 19.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
పసిడి... కేంద్రానికి ఊరట
పసిడి దిగుమతుల విలువ 2015 ఆగస్టుతో పోల్చిచూస్తే ఏకంగా -77.45% పడిపోయి 2016 ఆగస్టులో 1.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆగస్టులో ఈ విలువ 4.95 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ ఈ మెటల్ దిగుమతులు పడిపోతూ వస్తున్నాయి. దేశానికి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా) మధ్య వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటుకు సంబంధించి ప్రభుత్వానికి ఇది ఎంతో సానుకూల వార్తని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఎండీ రాజేష్ కోస్లా తెలిపారు.
ఐదు నెలల్లో ఇలా...: ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ గత ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే- ఎగుమతులు 3% పడిపోయి 108.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 16% పడిపోయి 143.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు గణనీయంగా 58 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 40 శాతానికి పైగా పడిపోయి 35 బిలియన్ డాలర్లకు తగ్గింది.
సేవల ఎగుమతులూ తగ్గాయ్
కాగా గురువారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూలై నెలలో భారత సేవల ఎగుమతుల విలువను వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఎగుమతుల విలువ 4.11 శాతం క్షీణించి, 12.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ విభాగంలో దిగుమతులు సైతం 1.2 శాతం తగ్గిపోయి 7.41 బిలియన్లుగా నమోదయ్యాయి. ఐదు నెలల కాలంలో ఈ విభాగంలో ఆర్డర్ విలువ 52.47 బిలియన్ డాలర్లు.
వృద్ధికి త్రిముఖ వ్యూహం...
భారత్ ఎగుమతుల వృద్ధి క్షీణ ధోరణి పట్ల కేంద్రం వాణిజ్యశాఖ ఆందోళనతో ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వృద్ధికి త్రిముఖ వ్యూహం అవలంభించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందులో ఒకటి అత్యుత్తమ ఎక్స్ఛేంజ్ రేటు రూపకల్పన ఒకటని తెలి పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రవాణా రేట్లలో సవరణలు, వీసా వ్యవస్థ సరళీకరణ ప్రణాళికలో భాగమని వివరించారు.