మే నెలలోనూ ఎగుమతులు డౌన్
వరుసగా 18వ నెలలోనూ క్షీణతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడంతో ఎగుమతులు మే నెలలో 0.79 శాతం క్షీణించి 2,217 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు వరుసగా 18వ నెలలో కూడా పతనమయ్యాయి. మే నెలలో ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా క్షీణించాయి. గత ఏడాది మేలో 3,275 కోట్లు డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది మేలో13 శాతం తగ్గి 2,844 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది మేలో 1,040 కోట్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈ ఏడాది మేలో 627 కోట్ల డాలర్లకు తగ్గింది.
ఎగుమతుల్లో క్షీణత తగ్గిందని ఈ గణాంకాల విడుదల సందర్భంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, ముడి చమురు ధరల పతనం కారణంగా 2014 డిసెంబర్ నుంచి ఎగుమతులు క్షీణిస్తున్నాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) ఎగుమతులు 3.7 శాతం క్షీణించి 4,273 కోట్ల డాలర్లకు, అలాగే దిగుమతులు 18 శాతం క్షీణించి 5,385 కోట్ల డాలర్లకు తగ్గాయని పేర్కొంది. ఫలితంగా ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 1,111 కోట్ల డాలర్లుగా ఉందని తెలిపింది.
పుత్తడి దిగుమతులు 39 శాతం డౌన్
బంగారం దిగుమతులు మేలో 39% తగ్గి 147 కోట్ల డాలర్లకు పడిపోయాయి. పుత్తడి దిగుమతులు తగ్గడం ఇది వరుసగా 4వ నెల. గత ఏడాది మేలో పుత్తడి దిగుమతులు 242కోట్ల డాలర్లుగా ఉన్నాయి. పుత్తడి దిగుమతుల క్షీణత కారణంగా వాణిజ్య లోటు 627 కోట్ల డాలర్లకు పరిమితమైంది. గత ఏడాది మేలో వాణిజ్య లోటు 1,040 కోట్లు.