
ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ మరింతగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత వజ్రాల ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. 2020–21 ఆఖరు నాటికి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ ఎగుమతులు తగ్గడమో లేదా అదే స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. 2018–19లో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారత్ నుంచి మొత్తం వజ్రాల ఎగుమతులు విలువపరంగా 18% తగ్గాయి. వీటిలో 40% ఎగుమతులు హాంకాంగ్‌కి జరిగాయి. అయితే, జనవరి 15 నుంచి హాంకాంగ్‌కు ఎగుమతులు నిల్చిపోయాయి.
‘ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో ఎగుమతులు మరింత తగ్గవచ్చు. ఆగ్నేయాసియా ప్రాంతంలో సెలవులు, కోవిడ్ వ్యాప్తితో మార్కెట్లు మూతబడటం మొదలైన అంశాల కారణంగా ఈ ఒక్క త్రైమాసికంలోనే దాదాపు బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని అంచనా’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సుబోధ్ రాయ్ తెలిపారు. ఇప్పటికే డిమాండ్ పడిపోయి, వసూళ్లు తగ్గిపోవడం.. హాంకాంగ్‌లో రాజకీయ సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న వజ్రాల పరిశ్రమకు కోవిడ్19 మరో కొత్త సమస్యగా పరిణమించిందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య భాగంలో గానీ పరిశ్రమ పరిస్థితి చక్కబడకపోవచ్చని చెప్పారు.