క్యూ2లో ఆదాయాలు 20% అప్‌ | India Inc set to post 18 to 20 percent revenue growth in Q2 | Sakshi
Sakshi News home page

క్యూ2లో ఆదాయాలు 20% అప్‌

Published Tue, Oct 12 2021 6:30 AM | Last Updated on Tue, Oct 12 2021 6:30 AM

India Inc set to post 18 to 20 percent revenue growth in Q2 - Sakshi

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో దేశీ కంపెనీల ఆదాయం సగటున 18–20 శాతం స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ తాజాగా అంచనా వేసింది. గతేడాది క్యూ2(జులై–సెపె్టంబర్‌)తో పోలిస్తే ప్రధానంగా అమ్మకాల పరిమాణం పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడింది. అంతేకాకుండా అధిక కమోడిటీ ధరలు సైతం మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అయితే ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా నిర్వహణ లాభ మార్జిన్లకు చెక్‌ పడనున్నట్లు తెలియజేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన కంపెనీలు కష్టకాలంలోనూ నెగ్గుకురానున్నట్లు పేర్కొంది. వేతనాల్లో కోతలు తదితర చర్యల ద్వారా వ్యయ నియంత్రణలను పాటించడంతో డిమాండ్‌ క్షీణించినప్పటికీ బిజినెస్‌లను రక్షించుకోగలగినట్లు వివరించింది.  

రంగాలవారీగా..
కోవిడ్‌–19 ప్రభావంతో గతేడాది(2020–21) క్యూ2లో పలు కంపెనీల అమ్మకాలు తిరోగమించిన సంగతి తెలిసిందే. స్థానిక లాక్‌డౌన్‌లు, నెమ్మదించిన ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంకాగా.. లోబేస్‌ రీత్యా ఈ ఏడాది క్యూ2లో వివిధ రంగాల కంపెనీలు ఆదాయాల్లో వృద్ధిని చూపగలవని క్రిసిల్‌ తెలియజేసింది. ఫైనాన్షియల్‌ సరీ్వసులు, చమురును మినహాయించి 40 రంగాలకు చెందిన 300 కంపెనీలను క్రిసిల్‌ అంచనాలకు తీసుకుంది. వీటిలో 24 కంపెనీలు 20 శాతంపైగా వృద్ధిని సాధించగలవని అంచనా వేసింది. అయితే స్టీల్‌ ప్రొడక్టులు, అల్యూమినియం తదితర కమోడిటీ సంబంధిత రంగ కంపెనీలు మాత్రం 15–17 శాతం వృద్ధిని అందుకోగలవని పేర్కొంది.

త్రైమాసికవారీగా
క్రిసిల్‌ నివేదిక ప్రకారం త్రైమాసిక ప్రాతిపదికన అంటే ఈ క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)తో పోలిస్తే క్యూ2లో ఆదాయాల్లో 8–10 శాతం పురోగతి నమోదుకానుంది. క్యూ1లో కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్‌–సెపె్టంబర్‌)లో కంపెనీల ఆదాయం 30–32% జంప్‌చేసి, మొత్తం రూ. 15.8 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా.

రంగాల వారీగా..
రంగాలవారీగా చూస్తే అత్యవసరంకాని వినియోగ వస్తువులు అత్యధిక వృద్ధిని సాధించనుండగా.. టెలికం సైతం ఇదే బాటలో నడవనుంది. కాగా.. కేవలం అల్యూమినియం తయారీ కంపెనీలు 45–50 శాతం అధిక ఆదాయాన్ని సముపార్జించే వీలుంది. ఇందుకు ప్రధానంగా దేశీయంగా ధరలు 40 శాతం జంప్‌చేయడం, అమ్మకాల పరిమాణం 5–7 శాతం చొప్పున పుంజుకోవడం కారణంకానున్నాయి. ఇదే విధంగా స్టీల్‌ తయారీ కంపెనీలు సైతం 40 శాతం పురోగతిని సాధించే అవకాశముంది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు రెండంకెల వృద్ధిని అందుకోవచ్చు. చిప్స్‌ కొరత నెలకొనడంతో ఆటో పరిశ్రమలో ఆదాయాలు 4–6 శాతానికి పరిమితకానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement