రెండు నెలలుగా దిగిరాని చికెన్‌ ధర  | Chicken Prices increased All Over | Sakshi
Sakshi News home page

రెండు నెలలుగా దిగిరాని చికెన్‌ ధర 

Published Fri, Apr 8 2022 6:17 AM | Last Updated on Fri, Apr 8 2022 7:43 AM

Chicken Prices increased All Over - Sakshi

మండపేట: రెండు నెలలుగా చికెన్‌ ధర దిగిరానంటోంది. స్కిన్‌లెస్‌ కిలో రూ.300ల నుంచి రూ.320లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్‌ నెల మొదలుకావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్‌. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్‌ వినియోగిస్తుండగా, ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి.  

వేసవి ప్రభావం 
తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, కోనసీమలోని అమలాపురం, రావులపాలెం, కాకినాడలోని తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్‌లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్‌ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్‌ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీలు వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్ది కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోడిమేత ధరలు గణనీయంగా పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది.

మొక్కజొన్న కిలో రూ. 14లు నుంచి రూ. 25లకు పెరుగ్గా, సోయా  రూ. 40లు నుంచి రూ. 90లకు పెరిగిపోయింది. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ. 35లకు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుండగా, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్‌ కిలో కోడి తయారవ్వడానికి రూ. 110లు వరకు వ్యయమవుతోందని వారంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది బ్రాయిలర్‌ కోళ్ల రైతులు బ్రాయిలర్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫామ్‌లు నిర్వహిస్తున్నారు.  

రెండు నెలలుగా అదే ధర  
స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధికశాతం పామ్‌లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.200లు వరకు ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300లకు, లైవ్‌ కిలో రూ. 100ల నుంచి 150లకు చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350లు వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్‌ ఉపవాస దీక్షలు నేపథ్యంలో ముస్లింలు చికెన్‌ వినియోగానికి ప్రాధాన్యమిస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్‌ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాల అంచనా.  

నిర్వహణ పెరిగిపోయింది   
ఎప్పుడు లేనంతగా కోడి మేత ధరలు, కోడిపిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడం వలన ధర పెరుగుతోంది. 
– బొబ్బా వెంకన్న, బ్రాయిలర్‌ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement