తణుకు: చికెన్ ధరలు మాంసంప్రియులకు చుక్కలను చూపుతున్నాయి. ఎండల ధాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గగా, డిమాండ్ పెరిగి ధరపై ప్రభావం చూపుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు కిలో స్కిన్‌లెస్ రూ.230, స్కిన్ చికెన్ రూ.200 ధర పలకగా ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బ్రాయిలర్ చికెన్ ధర రూ.330కు, స్కిన్‌తో రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో చికెన్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరోవైపు ఎండల ప్రభావంతో గుడ్ల ఉత్పత్తి కూడా 20 శాతానికి తగ్గింది.
ఇంకా పెరిగే అవకాశం
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో చికెన్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎండల తీవ్రతకు మాంసం ఉత్పత్తి పడిపోవడంతో కిలో రూ.330 వరకు చేరిన చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కోళ్లు తట్టుకోలేవు. ప్రస్తుతం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కోళ్లను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. నెల రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్న కోళ్లు వడగాలులకు తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. పౌల్ట్రీ రైతులు సైతం ఏప్రిల్, మే నెలల్లో వీటి ఉత్పత్తికి వెనుకంజ వేస్తూ వచ్చారు..
ఫలితంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం తద్వారా ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా వేసవిలో కోళ్లు 6 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. ఈ సారి వడగాలుల తీవ్రత తారాస్థాయికి చేరడంతో 16 శాతానికి పైగా మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. వేసవిలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. ఈ పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు నష్టాలబాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. గతంలో లైవ్ చికెన్ ధర కిలో రూ.110 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది.
కోళ్ల ఉత్పత్తి పడిపోయింది
సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధర తగ్గుముఖం పడుతుంది. ఈ సారి ఎండల తీవ్రత కారణంగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం దిగుబడి తగ్గింది. మరోవైపు కోళ్ల ఫారాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా కోళ్ల ఉత్పత్తి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధర పలుకుతోంది. దీంతో గతంతో పోల్చితే 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. – గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు
Comments
Please login to add a commentAdd a comment