విశాఖ, విజయనగరం కంటే శ్రీకాకుళంలోనే అత్యధికం
సిండికేట్ చేతిలో చికెన్ ధరలు అమ్మలేమంటున్న రిటైల్ వ్యాపారులు
కష్టంగా మారిన హోటల్స్, హాస్టల్స్ నిర్వహణ
శ్రీకాకుళం/(పీఎన్ కాలనీ): సిండికేట్ల చేతిలో పడి చికెన్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, ఆయిల్, నిత్యావసర సరుకుల ధరలు నిర్ణయించే అధికారం కలెక్టర్, మార్కెటింగ్‌శాఖ అధికారుల చేతుల్లో ఉంటుంది. చికెన్ ధరలు మాత్రం హోల్‌సేల్ చికెన్ వ్యాపారులు, వారి సిండికేట్ వారే రేట్లు ‘ఫిక్స్’ చేస్తారు. విశాఖపట్నం, విజయనగరంలో ఒక రేటు ఉంటే శ్రీకాకుళంలో మాత్రమే ఈ రెండు జిల్లాలకంటే రూ.20 ఎక్కువ ఉంటుంది.
ఎందుకు ఎక్కువ అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఫారాలకు జిల్లాలోనే ఫీడ్ దొరుకుతుంది, కోళ్ల ఫారాలు సైతం జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాకు సరిపడా సరుకు లేకుంటే విశాఖ, అనకాపల్లి నుంచి తీసుకువస్తారు. కానీ ధరలు మాత్రం విశాఖ, విజయనగరం కంటే ఎక్కువే ఉంటున్నాయి. ఈ సిండికేట్‌లో త్రిమూర్తుల్లా ముగ్గురు వ్యక్తులు ఈ వ్యవహారమంతా నడిపిస్తోన్నట్లు చికెన్ షాపుల యజమానులు గుసగుసలాడుకుంటున్నారు.
గత నాలుగు నెలలుగా స్కిన్‌లెస్ సుమారు రూ.260కి పైగా ధర పలుకుతోంది. విశాఖపట్నం, విజయనగరంలో రూ.240కి అమ్ముతున్నారు. ఇవి పత్రికల్లో వచ్చే ధరలు. చికెన్‌షాపుల యజమానుల వారి వ్యాపారాన్ని బట్టి ధర తగ్గించి అమ్మేవారు కొందరు, మరికొంతమంది దానికంటే ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ/ప్రవేటు హాస్టల్స్, హోటల్స్, దాబాల నిర్వాహకులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా తర్వాత ఆదివారం ఇంకెంత ధర పెంచేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
ఒడిశా నుంచి కొని..
జిల్లాలోని పలువురు వ్యాపారులు ఒడిశా నుంచి కోళ్లను తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. జిల్లాలో కంటే ఒడిశాలో ధర కిలోకు రూ.40వరకు తక్కువగానే ఉంటుంది. తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో వ్యాపారులు, సిండికేటుగాళ్లు ఎక్కువ ధరకు అమ్ముతు న్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల కంటే తక్కు వ ధరకు ఇవ్వాల్సింది పోయి తిరిగి దూర ప్రాంతాల నుంచి తెస్తున్నామనే నెపంతో ధరలు అధికంగా పెంచేసి రెట్టింపు లాభాల్ని ఆర్జిస్తున్నారు. ధరల నియంత్రణపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ధరలు నియంత్రించాల్సిందే
చికెన్ ధరల నియంత్ర ణ అధికారుల చేతుల్లో ఉంటే బాగుంటుంది. హోల్‌సేల్ వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు.
– ప్రకాష్, చికెన్‌షాపు, రైతుబజారు రోడ్డు, శ్రీకాకుళం.
వ్యాపారాలు చేయలేకపోతున్నాం
చికెన్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు. చికెన్, గుడ్లు ధరలు పెంచడంతో దాబాకి వచ్చేవారికి అధిక ధరలకు ఆహారాన్ని అమ్మలేకపోతున్నాం నష్టాన్ని భరించలేకపోతున్నాం.
– ఎం.నాగభూషణ్, శ్రీలక్షి్మదుర్గా దాబా, బలగరోడ్
ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు
చికెన్, గుడ్ల ధరల నియంత్రణ మా చేతుల్లో ఉండదు. వాటి సంరక్షణ, పోషణకు సంబంధించిన ప్రోత్సాహమంతా పశు సంవర్ధక శాఖ నుంచి ఉంటుంది. ధరల నియంత్రణకు జిల్లాలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీ వేస్తే నియంత్రణ సాధ్యమ య్యే అవకాశం ఉంటుంది.
– రావిపల్లి మురళీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment