అటవీ గ్రామాల్లో కోళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్న దృశ్యం
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. లాక్‌డౌన్ సమయంలో చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లతో ఆదరణ తగ్గిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం సైతం చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేయడంతో క్రమక్రమంగా చికెన్‌కు డిమాండ్ పెరిగింది. పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు అటవీ గ్రామాలకుసైతం విస్తరించింది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలంతా మాంసాహారం వినియోగంపై దృష్టి సారించారు. సాధారణంగా చికెన్ సెంటర్‌లో లభించే బాయిలర్‌ను మాత్రమే ఎక్కువ సంఖ్యలో వినియోగించేవారు.
కొవ్వుకు చెక్.. రుచికి బెటర్
బాయిలర్ చికెన్ కంటే నాటు కోడి తింటే మరింత మంచిదన్న ప్రచారంతో ఇటీవల కాలంలో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. బాయిలర్ కోడి మాంసం రుచి ఉండదు. ఇక మేక మాంసం తింటే కొవ్వు పెరుగుతుంది. ప్రస్తుతం చేపలు దొరకడం కష్టమే. మరి ఏమి తింటే మంచిదనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో తింటే నాటుకోడి కూరనే తినాలని ఆసక్తి పెరుగుతోంది. మిగతా మాంసాలతో పోలిస్తే నాటుకోడి కూర రుచిగా ఉండడం ఓ కారణం. ఒకప్పుడు ఇంటింటికీ కోళ్లు ఉండేవి. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా నాటుకోడి కూర వండేవారు. రానురాను పల్లెల్లో కోళ్ల పెంపకం తగ్గిపోయింది. కోళ్ల వల్ల పెంట, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లె జనం సైతం కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇదే క్రమంలో బాయిలర్ కోళ్లు రావడం ప్రతీ ఊరిలో చికెన్ సెంటర్లు వెలియడంతో జనం ఆ చికెన్ వైపే మొగ్గు చూపారు. పైగా బాయిలర్ చికెన్ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరకడంతో జనం నాటుకోడి ఊసెత్తడం మానేశారు.
మళ్లీ ఇప్పుడు..
ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై జాగ్రత్త పెరుగుతోంది. అతిగా మందులు వాడి పెంచే ఆహారం జోలికి పోవద్దన్న ఆలోచన ఎక్కువైంది. ఈ క్రమంలోనే బాయిలర్ చికెన్ తినద్దన్న ప్రచారం మొదలైంది. తింటే మటన్ తినండి తేదంటే నాటుకోడి కూర తినండి అని పలువురు ఆహార నిపుణులు సూచించడం, చేపలు మంచివే కాని అవి టైంకు దొరకకపోవడం కొందరికి నచ్చకపోవడంతో నాటు కోడి కూరవైపు మొగ్గు చూపడం ఆరంభమైంది. అయితే, బాయిలర్ కోడి సాధారణంగా కిలో రూ.100 నుంచి రూ.150 ఉంటుంది. నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంటుంది. పండుగల సమయంలో ఈ ధర మరింత ఎక్కువవుతుంది. అయినా నాటుకోళ్లపై క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. ప్రత్యేక విందులు జరిగే ప్రాంతాల్లో నాటుకోళ్లను తీసుకెళ్తున్నారు.
చికెన్ సెంటర్లలోనూ అమ్మకం..
ఒకప్పుడు నాటుకోడి మాంసం దొరకడం గగనంగా ఉండేది. ఆ కోళ్లను తెలిసిన వారి ఇళ్ల నుంచి కొనుగోలు చేసేవారు., దీనిని డ్రెసింగ్ చేయడం కష్టంగా భావించే వారు. పైగా దానిని కాల్చితేనే బాగుంటుందన్న అభిప్రాయం. ఇంత కష్టం ఎందుకని జనం దాని జోలికి పోవడం మానేశారు. కానీ ఇప్పుడు చికెన్ సెంటర్లలోనే దానిని కోసి డ్రెసింగ్ చేసి కాల్చి ఇస్తున్నారు. మటన్‌తో పోలిస్తే ధర తక్కువ పైగా రుచి, పోషకాలు కూడా ఎక్కువే. అందుకని ఈజీగా దొరుకుతున్న నాటుకోడి మాంసంపై జనం మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా నాటుకోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతోంది. పైగా మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప కీడు చేయదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు నాటుకోళ్లను దళారులు పల్లెల నుంచి పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రతీ రోజు దళారులు అటవీ గ్రామాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ నాటుకోళ్లు కొంటాం అంటూ.. కేజీ రూ.180కి కొనుగోలు చేసి వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ తదితర పట్టణప్రాంతాలకు తరలించి రూ.350 నుంచి రూ.500 వరకు చికెన్ సెంటర్ యజమానులకు విక్రయిస్తున్నారు. దీంతో పండుగల సమయంలో గ్రామాల్లో నాటుకోళ్లకు కొరత ఏర్పడుతోంది.
తింటే నాటుకోడే తినాలి..
సాధారణ చికెన్‌తో పోలిస్తే నాటుకోడి కూరే రుచిగా ఉంటుంది. ఇప్పటికి మా ఇంటికి బంధువులు వస్తే నాటుకోడి కూర వండాల్సిందే. ఇది మన తెలంగాణ సంప్రదాయం కూడా. వచ్చిన బంధువులకు నాటుకోడి కూర వండి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.– ఓలపు శంకర్‌పటేల్, కిష్టాపూర్
Comments
Please login to add a commentAdd a comment