వండకుండానే చికెన్‌ ‘ఫ్రై’ | Poultry Industry Loss With Sunstroke West Godavari | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ ‘సన్‌’క్షోభం

Published Mon, May 25 2020 12:54 PM | Last Updated on Mon, May 25 2020 12:58 PM

Poultry Industry Loss With Sunstroke West Godavari - Sakshi

ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంటలో రెండురోజుల క్రితం ఎండ తీవ్రతకు మృతిచెందిన కోళ్లు

పశ్చిమగోదావరి, తణుకు: ఒకవైపు కరోనా ప్రభావంతో పౌల్ట్రీ  రంగం సంక్షోభంలో పడింది. దీనికితోడు మండుతున్న ఎండలు కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చిరుప్రాణులైన కోళ్లు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోపౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వేసవి కారణంగా గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత కారణంగా సాధారణంగానే కోడి పెట్టే గుడ్ల సంఖ్య 30 శాతం వరకు పడిపోతోంది. ఒకపక్క నిలకడ లేని గుడ్డు ధరతోపాటు ఏటా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో కోళ్ల పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు ధర సైతం రూ. 2.80కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా సంక్షోభం...
సాధారణంగా జిల్లాలో 1.20 కోట్ల కోళ్లు పెరుగుతుంటాయి. వీటి ద్వారా రోజుకు సుమారు కోటి గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 20 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మిగిలిన 80 శాతం గుడ్లు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్‌ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. ప్రస్తుతం పెంచే కోళ్ల సంఖ్య సగానికిపైగా పడిపోగా ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. మార్చినెలలో చికెన్, కోడిగుడ్డు అమ్మకాలపై చూపిన ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటివరకూ సుమారు 2,00,000 కోళ్లు చనిపోయినట్టు అంచనా. సుమారు రూ.50 కోట్ల నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. మరోవైపు పౌల్ట్రీ పరిశ్రమను పెరిగిన దాణా ఖర్చులు దెబ్బ తీస్తున్నాయి. కోళ్లకు దాణాగా అందజేసే మొక్క జొన్న, సోయాబీన్, నూకల ధరలు గతేడాదితో పోలిస్తే కాస్త అందుబాటులోకి వచ్చినప్పటికీ గుడ్డు ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తుపాను ప్రభావంతో..

పశ్చిమ బెంగాల్‌లో తుపాను ప్రభావంతో గుడ్డు ఎగుమతులకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇప్పటికే కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఒక పక్క ఉత్పత్తి లేకపోయినా గుడ్డు ధర మాత్రం రూ. 2.80కు దిగజారింది. ప్రస్తుతం గుడ్డు ధర తగ్గినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.4 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే గుడ్డు ఉత్పత్తికి సంబంధించి రూ.3.50 ఉంటేనే గానీ గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా నుంచి పశ్చిమబెంగాల్, అసోం, ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాలకు రోజుకు సగటున 120 లారీల గుడ్లు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం ఈ సంఖ్య యాభైలోపు పడిపోయింది. చికెన్‌ ధరలపైనా ఈ ప్రభావం పడింది. రిటైల్‌ మార్కెట్లో కోడిమాంసం ధర భారీగా పెరిగింది. వేసవిలో గుడ్ల ఉత్పత్తి పడిపోవడం, కోళ్లు మృత్యువాత పడటం, కరోనా ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది.

గడ్డు పరిస్థితుల్లో పౌల్ట్రీ
గత ఐదేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది కరోనా ప్రభావంతో పాటు వేసవి ప్రభావం పౌల్ట్రీపరిశ్రమపై పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గుడ్డు ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– పెన్మత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, కావలిపురం, ఇరగవరం మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement