మార్కెట్‌లో కేజీ రూ.300కు చేరిన చికెన్ ధర
దాణా రేట్లు పెరగటంతో తగ్గిన కోళ్ల ఉత్పత్తి
ముట్టుకుంటే షాక్ కొట్టేలా మటన్ ధరలు
ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు. నిన్నా మొన్నటి వరకు రూ.200 పలికిన చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలకు చేరుకోవటంతో సామాన్యులు హడలిపోతున్నారు. కోళ్ల దాణా ధరలు పెరగడంతోపాటు, వేసవి తీవ్రత నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ అధికమైందని, దీని వల్లే చికెన్ ధరలు భారీగా పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దాణా ధర కేజీ 70 రూపాయలు పలుకుతుండటంతో కోళ్ల ఉత్పత్తిపై అనాసక్తి చూపుతున్నారు. పెరిగిన చికెన్ ధరతో తమకు నష్టమే జరిగిందని, విక్రయాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని కొందరు మాంసాహార ప్రియులు మాత్రం కేజీ చికెన్‌కు బదులు అర కేజీతో సర్దుకుంటున్నారు.
మటనా.. వొద్దుద్దులే..!
మాంసాహార ప్రియులకు మటన్ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 700 రూపాయలు పలికిన మటన్ ధర ఇప్పుడు రూ.800 నుంచి రూ.900 పలుకుతుండటంతో కొనుగోలుదారులకే కాదు వ్యాపారులకు సైతం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మండీ మార్కెట్ ఏజెంట్లు జీవాల రేట్లను విపరీతంగా పెంచేయటంతో మేకపోతులు, పొట్టేళ్లను అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని, అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పెరిగిన ధరలు త్వరలోనే తగ్గుముఖం పట్టాలని మాంసాహార ప్రియులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment