
సాక్షి, అమరావతి/గచ్చిబౌలి: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్ కుట్రకు బరితెగించింది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృతరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలించారు. గతంలో కుట్రపూరితంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. తద్వారా తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తు పన్నాగం పన్నాయి. ఆ ఫిర్యాదులపై పోసాని కృష్ణ మురళిని ఇప్పటివరకు విచారించడంగానీ ఇతరత్రా దర్యాప్తు ప్రక్రియగానీ కొనసాగలేదు. కానీ హఠాత్తుగా బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు.
పోసాని అనంతరం ఆయన సతీమణి కుసుమలత స్పందించారు. ఈ సందర్బంగా కుసుమలత మాట్లాడుతూ..‘మా ఆయనను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. రాత్రి 8:50 గంటలకు పోలీసులు వచ్చారు. రాత్రి 9:10 గంటల వరకు తీసుకెళ్లిపోయారు. ఎలాంటి సమయం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఆయన అరెస్ట్‌పై చాలా అనుమానాలున్నాయి. ఆయనను ఎటూ కదలనివ్వలేదు. నలుగురు పోలీసులు చుట్టుముట్టారు. నోటీసులు తీసుకుని నేడు వస్తామన్నా పోలీసుల వదల్లేదు. పోలీసులు పోసాని ఫోన్ లాక్కున్నారు. పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. మా ఆయన తప్పును మాత్రమే తప్పు అని చెప్పారు.. దానికే ఆయనను అరెస్ట్ చేయాలా?. ఆయన అరెస్ట్‌పై మాకు ఆందోళన, భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం, పోసాని కుమారుడు మాట్లాడుతూ.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు అని తెలిపారు.
ఫిర్యాదు ఎవరు చేశారు?
అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆయన్ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు. అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానమే ఇవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఓ నోటీసు ఇచ్చి తమతో తీసుకుపోయారు.
111, ఇతర సెక్షన్ల కింద కేసులు..
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.

నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం
పోసానిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నిర్ధారించారు. పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరు పరిచేముందు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఓబులవారిపల్లె పీఎస్, సంబేపల్లె పీఎస్‌లలో పోసానిపై కేసులు నమోదైనట్లు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment