
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ హయాంలో అడ్డగోలుగా కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఆధారాలుంటే మాత్రం పూర్తిస్థాయి విచారణ తరువాత అరెస్టులు జరిగాయి. అయినా కూడా అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం.. అక్రమ కేసులంటూ గగ్గోలు పెట్టేది. దబాయింపులకు దిగేవారు. దుష్ప్రచారానికి తెర లేపారు.
టీడీపీకి న్యాయవ్యవస్థపై ఉన్న పట్టు కూడా ఇందుకు ఉపకరించిందని విమర్శకుల అంచనా. మరి ఇప్పుడు? టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో అంతా వారి ఇష్టారాజ్యమే. గిట్టనివారిపై మరీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా తోచిన కేసులు పెట్టేస్తున్నారు. అదేమంటే.. రెడ్‌బుక్ ఎఫెక్ట్ అంటున్నారు. ఈ పైశాచికత్వం ఎంతదాకా వెళ్లిందంటే.. పోలీసు అధికారులూ బలయ్యేంత స్థాయికి!. సీనియర్ పోలీస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులును అరెస్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఆధారాలతోపాటు పట్టుకోవడమే ఈయన చేసిన తప్పు. ఆ కక్షతోనే టీడీపీ తప్పుడు కేసులో అరెస్టుకు దిగిందని విశ్లేషకుల అంచనా.
పీఎస్‌ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారికి సలహాలు ఇస్తున్నారని ఈనాడులో ఒక కథనం వచ్చిన కొంత కాలానికే ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామన్న ముసుగులో ఒక వర్గానికి కొమ్ము కాస్తుండే మీడియా, రాజకీయ పార్టీ ఏకమై పాలన చేస్తే ఎంత ప్రమాదకరమో ఇదే ఉదాహరణ. ఫలానా వారిని ఇంకా అరెస్టు ఎందుకు చేయలేదంటూ.. సీఐడీ విచారణకు హాజరైన ఒక వైఎస్సార్‌సీపీ నేతను రెండు గంటలే ప్రశ్నించారని.. ఎల్లో మీడియా వార్తలు ఇస్తోందంటే.. పాలకపక్షానికి వీరికి మధ్య ఉన్న లోపాయకారి అవగాహన ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది.
మోసాలు చేస్తుందని స్పష్టంగా తెలిసిన ఒక నటి చేసిన ఆరోపణల ఆధారంగా సీనియర్ పోలీస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట అని, ఐపీఎస్ వర్గాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అధికార వర్గాలు భావిస్తున్నా చంద్రబాబు సర్కార్ మొండిగా ముందుకు వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరు పోలీసు అధికారులు ముందస్తు బెయిల్ పొందగా ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించ లేదు. తనను అరెస్టు చేస్తారని తెలిసినా ఆయన అందుకు సిద్దపడ్డారంటేనే తాను తప్పు చేయలేదన్న విశ్వాసం అన్నమాట. తాను టీడీపీకి లొంగిపోనని, జైలుకైనా వెళతానని ఆంజనేయులు మాదిరి ధైర్యంగా నిలబడ్డ అధికారి ఇటీవలి కాలంలో ఇంకొకరు లేరు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించింది. మోసకారి నటి కేసులో ఇప్పటికే ఒకరు అరెస్టు అవ్వడం, బెయిల్‌పై బయటకు రావడం కూడా జరిగింది.
డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసిన టైమింగ్ కూడా గమనించదగినదే. ఒక వైపు అమరావతిలో 44 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న కూటమి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో విలువైన భూములను పరిశ్రమల పేరుతో రూపాయికి, అర్ధ రూపాయికి కట్టబెట్టడంపై పలు విమర్శలు ఉన్నాయి. రెండు నెలల క్రితం రిజిస్టర్ అయిన ఉర్సా అనే కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల విలువైన భూమి కేటాయించాలని తలపెట్టడం వివాదంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి రాగానే అరెస్టులు జరగడం కూడా గమనార్హం. ప్రభుత్వం పరపతి కోల్పోతున్నప్పుడు ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఒకవైపు ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రయోగం, మరోవైపు చంద్రబాబు కుట్రలతో రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే చాలు.. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆయనను సైకో అని, మరొకటనీ, నీచమైన రీతిలో విమర్శలు చేసేవారు. ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, అరెస్టులు చూస్తే నైతిక పతనం ఎన్ని విధాలుగా ఉండవచ్చో ప్రపంచానికి చాటి చెబుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలకు బాధ్యులుగా జగన్ కూడా అప్పట్లో పలువురు పోలీసు అధికారులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి పాత్రపై పలు అభియోగాలు ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను ఆయనపై కేసు పెట్టి ఉండవచ్చు కదా. కానీ, ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదు. ఇతర ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేస్తేనే చాలా పెద్ద ఘోరం జరిగినట్లు ప్రచారం చేశారు. ఆయన ఏకంగా టీడీపీ కొమ్ము కాయడమే కాకుండా, రిటైరయ్యాక కుల సభలలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై అరాచకపు పోస్టింగులు పెట్టినా టీడీపీ వారికి ఏమీ కాలేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ వారిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవచ్చు. కానీ, కేవలం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు ఎందుకు వస్తున్నాయంటే అదే రెడ్ బుక్ పాలన అని అంటున్నారు. చంద్రబాబుతో సహా కొందరు టీడీపీ ప్రముఖులపై గత ప్రభుత్వ టైమ్‌లో పై కేసులు పెట్టలేదా? అరెస్టులు చేయలేదా అని కొందరు ప్రశ్నించవచ్చు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో ఈడీ మొదట కేసు పెట్టింది. ఆ తర్వాత ఏపీ సీఐడీ కేసు తీసుకుంది. టీడీపీ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో కూడా అవినీతి డబ్బు వచ్చిందని సీఐడీ ఆధార సహితంగా ఆరోపించింది. దానికి ఇంతవరకు టీడీపీ కౌంటర్ చేయలేకపోయింది.
మరికొన్ని కేసులు అయితే సీబీఐ దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని గత ప్రభుత్వం తెలిపినా, మేనేజ్ చేశారో, లేక మరే కారణమో తెలియదు కాని కేంద్రం అందుకు సిద్దపడలేదు. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం మనోభావాల పేరుతో, మరో పేరుతో, ఒక తరహా ఫిర్యాదును అనేక పోలీస్ స్టేషన్లలో పెట్టడం, నిందితులను వందల కిలోమీటర్లు తిప్పి వారిని అనారోగ్యం పాలు చేయడం వంటి ఘటనలు గమనిస్తే ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహారించడం లేదన్న భావన కలుగుతుంది. మరో వైపు కూటమి ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక, భూదందాలు, పరిశ్రమల యజమానులను బెదిరించడం వంటి పలు సంఘటనలు జరుగుతున్నా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు.
మోసకారి నటి కేసు కారణంగా ఏపీకి వచ్చే అవకాశం ఉన్న పరిశ్రమలు కూడా రాకుండా పోతున్నాయని చెబుతున్నా, ఏమాత్రం లెక్క పెట్టకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం దురదృష్టకరం. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని ఆయనకు తెలుసు. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోతే ఎదురయ్యే పరిణామాలు తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. అయినా సర్కార్‌ను ఇంత అరాచకంగా నడుపుతున్నారంటే ప్రభుత్వం చంద్రబాబు కంట్రోల్లో లేదేమో అనిపిస్తుంది!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.