
రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టారని.. 24 రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
సాక్షి, గుంటూరు: రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టారని.. 24 రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన పోసానిని అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారని.. ఆ వయసులో పోసానిని అలా తిప్పటం కన్నా శిక్ష ఇంకేం ఉంటుంది?’’ అని అంబటి పేర్కొన్నారు.
‘‘రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి. పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. అంతమాత్రానికే కేసులు పెడతారా?. వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా?. మరి ఆయనపై ఎందుకు కేసులు ఎట్టలేదు?. అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదలేదిలేదు’’ అని అంబటి స్పష్టం చేశారు.
పోలీసుల కన్నా మా న్యాయ వాదులు డబుల్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మేము వస్తాం. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టుల్లో ఇబ్బంది పడతారు జాగ్రత్త. మా లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. శవాలు దొరకట్లేదుగానీ లేకపోతే అన్యాయంగా మర్డర్ కేసు కూడా పెట్టేవారు. నారా లోకేష్ కాల్ చేయటం వలనే పోసాని విడుదల ఆలస్యం అయింది. లేకపోతే మధ్యాహ్నానికే పోసాని బయటకు వచ్చేవారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎంతోకాలం నడవవు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.