వైఎస్సార్ సీపీ అణచివేతే లక్ష్యంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కుట్రలకు తెరలేపింది. ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు దాడులకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ సీపీ ఆనవాళ్లు కనిపించకూడదనే ధ్యేయంతో అభివృద్ధి పనుల శిలాఫలకాలను టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయి. కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్న అరాచకాలను కట్టడి చేయాల్సిన పోలీసులు, ప్రభుత్వ అధికారులను తొలి రోజు నుంచే కీలుబొమ్మలుగా మార్చారు.
అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించొద్దు. అది ఏ పార్టీ వారైనా.. వైఎస్సార్ సీపీ శ్రేణులైనా సరే.. ఇదీ 2019లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టగానే ఐఏఎస్, ఐపీఎస్‌లకు సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశం. ప్రస్తుత సీఎం చంద్రబాబు నుంచి ఇలాంటి ఆదేశాలను ఆశించడం ప్రజల అమాయకత్వమే అవుతుంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తా అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నెల రోజులకే రాష్ట్రాన్ని సౌత్ బీహార్ చేశారనేది నూటికి నూరుశాతం నిజమని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలన్నర రోజుల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు పేట్రేగిపోయారు. జూన్ 4న ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు విధ్వంసం మొదలైంది. జిల్లాలో ఎక్కడ చూసినా భయాందోళనకర పరిస్థితి.
సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే చిత్రాలు కనిపిస్తే చాలు పూనకం వచ్చిన పోతురాజుల్లా ఊగిపోయారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడంతోపాటు పలుచోట్ల నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ విజయోత్సవాల పేరిట దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లపై రాళ్లు రువ్వడంతోపాటు ఇళ్లలోకి దూరి టపాసులు పేల్చి భయబ్రాంతులకు గురిచేశారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే మహిళలు, వృద్ధులని కూడా కర్రలతో చితకబాదారు.
అధికారులు గప్‌చుప్..
వైఎస్సార్ సీపీకి ఓటేశారన్న కసితో దళితులు, మైనారీటీలు, ఇతర సామాజికవర్గాలపై దాడులకు పాల్పడుతుండటంతో పచ్చ కండువా భుజాన వేసుకుని ఎవరైనా కనిపిస్తే భయంతో వణికిపోయే దుస్థితి. గతంలో ఎప్పుడూ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగిన దాఖలాలు లేవు. ఏకంగా అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులే రౌడీల్లా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడమే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, చిహ్నాలను ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు చేష్టలుడిగి చోద్యం చూశారు. కనీసం దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం కూడా అధికారులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చోద్యం చూసిన పోలీసులు
ప్రభుత్వ కార్యాలయాలపై టీడీపీ, జనసేన శ్రేణులు దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం ఉన్నా పోలీసులు అడ్డుకున్న దాఖలాలు లేవు. నిందితులపై సుమోటోగా కేసులు పెట్టాలని పోలీసులు భావించినా టీడీపీ ఎమ్మెల్యేల ఒత్తిడితో వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఎప్పుడైతే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారో ప్రజలు కూడా ఈ దౌర్జన్యాలను, దాడులను అడ్డుకునేందుకు సాహసించలేకపోయారు. ఒకటీ రెండు చోట్ల ఇదేంటని ప్రశ్నించిన వారి మీద కూటమి నాయకులు దాడులకు పాల్పడ్డారు. కర్రలకు మేకులు కొట్టి దారుణంగా చితకబాదారు.
ఫిర్యాదులు లేవట
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఫిర్యాదులు లేవని అధికారులు చెప్పారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు సమాచారం లేదని డీఎస్పీ కిశోర్‌బాబు తెలిపారు. ఒంగోలు నగరంలోనూ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు చెప్పారు. మార్కాపురం, కనిగిరి, దర్శి సబ్ డివిజన్ల పరిధిలో ఎక్కడా విధ్వంసకారులపై, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment