
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): చాలాకాలం తరువాత చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు లొట్టలేసుకుంటున్నారు. ఒక సమయంలో దాదాపు మూడొందల వరకు వెళ్లిన కిలో చికెన్ రేటు ఇప్పుడు సగానికి పడిపోయింది. నాన్‌వెజ్ ఐటమ్స్‌లో మటన్, ఫిష్‌తో పోలిస్తే చికెన్ రేటు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం చికెన్‌కు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు, కార్తీక మాసం కావడంతో ఇటీవల చికెన్ రేటు 170 (స్కిన్), 180 (స్కిన్‌లెస్)కి పడిపోయింది.
తాటిచెట్లపాలెంలో మాత్రం ఈ ధర 160/ 170గా ఉంది. కార్తీకమాసం కారణంగా సుమారు 40 శాతం అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా బ్రాయిలర్ కోడి పెరగగానే చికెన్ సెంటర్లకు తరలించి అమ్మకాలు చేపడుతుంటారు. అంతకుమించి పెరిగిన కోడిని ఉంచడం వల్ల వాటికి అదనపు మేత అవసరమై, కోళ్ల రైతులకు నష్టాలు వస్తాయి. ప్రస్తుతం ఇలా అందుబాటులోకి వచ్చిన కోళ్లు కూడా అధికంగా ఉండడంతో చికెన్ రేటు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment