వికారాబాద్: చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు సరైన రేట్లు లేకపోవడంతో మార్కెట్ కుదేలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలువురు రైతులు ఫారాలు మూసేశారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటాయి. స్కిన్ లెస్ చికెన్ కిలోకు రూ.320 వరకు పలుకుతోంది. బోన్ లెస్ కావాలంటే రూ.550 చెల్లించాల్సిందే. లైవ్ బర్డ్ కిలోకు రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఇవే అత్యధిక ధరలని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలికాలంలో శుభకార్యాలతో పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరిగింది.
పౌల్ట్రీ వైపు అడుగులు
జిల్లా రైతులు ఇప్పుడిప్పుడే పౌల్ట్రీ రంగం వైపు దృష్టిసారిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకం ద్వారా ఏటా 6 బ్యాచ్‌లు వచ్చే అవకాశం ఉంది. దీంతో కోళ్ల పెంపకం లాభదాయకంగా కొనసాగుతూ వచ్చింది. జిల్లాలోని బొంరాస్‌పేట్‌లో– 4, దోమ 16, యాలాల 18, వికారాబాద్ 7, పూడూరు 12, పరిగి 12, మోమిన్‌పేట్ 6, మర్పల్లి 9, కుల్కచర్ల 5, కొడంగల్, ధారూరులో ఒక్కోటి చొప్పున పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి.
ఎండల ప్రభావంతోనే..
కరోనా తర్వాత ప్రజలు మాంసాహార వాడకాన్ని పెంచారు. ఇందులోనూ చికెన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అవసరం మేర ఉత్పత్తి లేకపోవడం ప్రస్తుతం కోడిమాసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎండాకాలం కావడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఎదుగుదలకు ఎక్కువ సమయం పడుతోంది. ఎలాగైనా వీటిని బతికించుకునేందుకు రైతులు, వ్యాపారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఫారాల వద్ద కూలర్లు, రెయిన్ డ్రిప్, స్ప్రీంక్లర్లు ఏర్పాటు చేసి చల్లదనం అందిస్తున్నారు.
దాణా, మందుల ధరలు రెట్టింపు
కోళ్లకు దాణాగా ఉపయోగించే మొక్కజొన్న, సోయా, తవుడు ధరలు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్లు, మందుల ధరలు కూడా రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండల వేడిమికి నిత్యం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు.
తినడం తగ్గించాం
గతంలో వారంలో రెండు రోజులు చికెన్‌ను తినే వాళ్లం. ప్రస్తుతం పెరిగిన ధరలతో రెండు వారాలకు ఒకసారి మాత్రమే తీసుకెళ్తున్నాం. మార్కెట్‌లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చికెన్ బదులు చేపలు తెచ్చుకుంటున్నాం.
– గుడిసె బాబు, బొంపల్లి
ఆశించిన లాభాలు లేవు
గతంలో చికెన్ ధరలు పడిపోవడంతో ఆశించిన స్థా యిలో లాభాలు రాలే దు. దీంతో కొంతమంది ఫారా ల నిర్వహణ నుంచి తప్పుకొన్నారు. పదిహేను రోజు లుగా మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి బయట పడుతున్నాం.
– యాదగిరిరెడ్డి, చికెన్ సెంటర్ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment