
కొండెక్కిన చికెన్ ధరలు
పండగలు పబ్బాలు వస్తే చాలామంది చికెన్ వండుకుంటారు. వాతావరణం చల్లబడితే చాలు చికెన్ తినాలనిపిస్తుంది...
సదాశివపేట రూరల్ : పండగలు పబ్బాలు వస్తే చాలామంది చికెన్ వండుకుంటారు. వాతావరణం చల్లబడితే చాలు చికెన్ తినాలనిపిస్తుంది. కాని ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. కేజీ రూ. 200 కావడంతో కారం పొడితోనే కాలం వెల్లదీస్తున్నారు. స్కిన్‌లెస్ అయితే రూ. 220కి పెరిగింది. పోనీ గుడ్డతోనైనా సరిపెట్టుకుందామంటే అదికూడా రూ. 5లకు పెరిగింది. మాంసకృత్తులతో పాటు పప్పు దినుసుల ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.
మొన్నటి వరకు కేజీ రూ. 150 ఉన్న చికెన్ ఇప్పుడు రూ. 200లకు చేరింది. ఆషాఢ మాసంలో బోనాల పండుగ రావడంతో ఆనవాయితీగా చాలమంది సంబురాలు చేసుకుంటారు. ఈ సందర్భంగా మాంసం తినడం సాధారణం. గతంలో దేశీ కోళ్లను ఎక్కువగా పెంచుకొనేవారు. ప్రస్తుతం వాటి ఊసే లేదు. కుటుంబాలు పెరగడం పెరటితో తగినంత స్థలం లేకపోవడంతో ఈ కోళ్లను పెంచడానికి అనువుగా లేకుండాపోయింది.
దీంతో అత్యధికులు బాయిలర్ చికెన్ మీద ఆధారపడి ఉన్నారు. పౌల్ట్రీ యజమానులు చికెన్ ధరలను పెంచడంతో చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా పెరిగాయి. మార్కెట్లో వంద గుడ్లు హోల్‌సేల్‌గా రూ. 480 ఉండగా, రిటైల్‌గా వంద గుడ్లకు రూ. 500లకు అమ్ముతున్నారు.పండుగలకు కరువే... మండలంలో, పట్టణంలో ఆషాఢ మాసం బోనాల పండుగను జరుపుకుంటున్నారు. ఆషాఢ మాసంలో పోచమ్మ, ఈదమ్మ, పోలేరమ్మ, మాచమ్మ వంటి ఇడుపు దేవతలకు అత్యధికంగా కోళ్లు బలిస్తుంటారు. ఈ పండుగల్లో ఇంటికో కోడిని కోస్తుంటారు. కోళ్ల ధరలు పెరగడంతో ఈ ఏడాది మాంసం జోలికి పోవడం లేదు.
చికెన్ తినడం మానేశాం
లేబర్ పని చేసుకుని బతికే మాకు రోజంతా పనిచేస్తే రూ. 200 ఇస్తారు చికెన్ కేజీ రూ. 200లకు చేరింది. రోజు కష్టం చికెన్‌కే పోతే మిగతా ఖర్చులు ఎలా భరించాలి. రెండు నెలలుగా చికెన్‌గా మానేశాం. నీళ్ల చారు, కారం పొడితోనే కాలం వెళ్లదీస్తున్నాం.
- రాజమణి, గృహిణి
కనీసం గుడ్లు తినలేకపోతున్నాం
కూలీ పనిచేసుకొని బతికే మారు రోజంతా కష్టపడి పనిచేస్తే రూ. 200 వస్తాయి. పిల్లల చదువులకు ఫీజులు, ఇంటి అద్దె కట్టాలి. గుడ్ల రేట్లు పెరగడంతో వాటిని కూడా తినలేకపోతున్నాం..
- సక్కుబాయి, గృహిణి