చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. – ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు)
చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్‌సేల్ మార్కెట్‌లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు చేరింది. రోజు రోజుకూ ఎగబాకుతూ మాంసం ప్రియులు చేతి చమురు వదిలిస్తోంది. పెరుగుతున్న ధరలతో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగర మార్కెట్‌లో మటన్ ధర నిలకడగా కొనసాగుతోంది. లైవ్ ధర సైతం రికార్డు స్థాయిలో కేజీ రూ.166 చేరింది.
పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు : కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం చికెన్ రికార్డు స్థాయి ధరలను నమోదు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చికెన్ వైపు వినియోగదారుల అంతగా మొగ్గు చూపలేదు. ఓ దశలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.80 దిగివచ్చింది. అయితే సెకండ్ వేవ్ తగ్గిన అనంతరం చికెన్ ధర పెరుగుతూ వచ్చింది. ఓ దశలో కిలో రూ.280కి చేరి ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. తరువాత ఆ రికార్డులను అధిగమించే ఏకంగా రూ.312కు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చికెన్ ధర కిలో రూ.200 మార్కును దిగకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న రూ.214 వద్ద నిలకడగా ఉన్న ధర మార్చి 1 నాటికి రూ.280కి ఎగబాకింది. అనంతరం కొద్దిపాటి తగ్గుదల నమోదవుతూ వచ్చిన మే 1వ తేదీ నుంచి ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. మే 1వ తేదీ రూ.228గా ఉన్న కిలో స్కిన్‌లెస్ ధర మే 12వ తేదీ నాటికి రూ.312కు ఎగబాకి ఆల్‌టైం రికార్డు సృష్టించింది.
రూ.320 మార్కు దాటే అవకాశముంది
కోవిడ్ రెండో దశ అనంతరం నుంచి చికెన్ ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. గతేడాది రూ.280 చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించిన ధర ఈ ఏడాది ఏకంగా రూ.300 మార్కును దాటేసింది. ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతోనే రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పౌల్ట్రీల్లో కోళ్లు పెరుగుదల సమయం ఎక్కువగా ఉంటుంది. వాటిని మార్కెట్‌కు తరలించేందుకు కావాల్సిన బరువు పెరిగేందుకు ఇతర సీజన్స్‌తో పోలిస్తే ఎక్కువ రోజులు పడుతుంది. దీంతో దాని ప్రభావం ఉత్పత్తిపై పడటంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న, ఆయిల్ తీసిన సోయ, తవుడు ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటి ప్రభావం కారణంగా కూడా చికెన్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయి.
– సుబ్బారావు, పౌల్ట్రీ, హోల్‌సేల్ చికెన్ వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment