
గుండెపోటుతో నిద్రలోనే రామయ్య తుదిశ్వాస
కోటిన్నర మొక్కలకు పైగా నాటిన కృషీవలుడు
ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల నివాళి
నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఖమ్మం రూరల్/ ఖమ్మం మయూరి సెంటర్: వన ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి (వనజీవి) రామయ్య (88) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. రోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి తన దినచర్య ప్రారంభించే ఆయన ఉదయం 6 గంటలైనా మేల్కొనకపోవడంతో భార్య జానకమ్మ తట్టి లేపే ప్రయత్నం చేశారు.
చలనం లేకపోవడంతో కుటుంబసభ్యుల సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు కనకయ్య, కుమార్తె సైదమ్మ ఉన్నారు. మరో ఇద్దరు కొడుకులు సైదులు, సత్యనారాయణ గతంలోనే చనిపోయారు. కాగా రామయ్య అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10–30 గంటలకు పల్లెగూడెం శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
తుది శ్వాస వరకు మొక్కలు నాటుతూ..
ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1937 జూలై 1న రామయ్య జన్మించారు. ఆ తర్వాత వారు రెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. 5వ తరగతి వరకు చదువుకున్న రామయ్యకు చిన్నతనం నుంచే మొక్కల పెంపకంపై మక్కువ ఉండేది. ఉపాధ్యాయుడు జి.మల్లేశం మొక్కల పెంపకంతో కలిగే లాభాలపై బోధించిన పాఠం మనసులో నాటుకుపోయింది. అప్పటినుంచి మొక్కల ప్రేమికుడిగా మారి తుదిశ్వాస వరకు మొక్కలు నాటుతూనే ఉన్నారు.
వృత్తి రీత్యా కుండలు చేస్తూ, ప్రవృత్తిగా మొక్కలు పెంచేవారు. ఇంట్లో సగ భాగంలో మొక్కల పెంపకాన్ని చేపట్టిన ఆయన.. పిల్లలతో సమానంగా వాటిని చూసుకునేవారు. రోడ్లు, గుట్టల వెంట తిరుగుతూ వివిధ రకాల మొక్కల విత్తనాలను సేకరించి వాటిని వివిధ ప్రదేశాల్లో నాటడం నిత్య కార్యక్రమంగా మార్చుకున్నారు. ఇలా ఇప్పటి వరకు కోటిన్నరకు పైగా మొక్కలను నాటారు.
పాఠ్యపుస్తకాల్లో జీవిత విశేషాలు
మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్ధుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చి బోధిస్తుండటం ఆయనకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి విశేషాలతో పాఠం పొందుపరిచింది.
రామయ్యకు ప్రముఖుల నివాళులు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీజ.. రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా రామయ్య మృతిపై పలువురు ప్రముఖులు, మంత్రులు, నేతలు సంతాపం ప్రకటించారు.
ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని, కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించిన దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సంతాపాన్ని ప్రకటించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీలు సంతోష్‌కుమార్, మధుయాష్కీ, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.
పద్మశ్రీ.. పలు అవార్డులు
మొక్కల పెంపకంలో చేసిన కృషికి గాను వనజీవి రామయ్య 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు అందుకున్నారు. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అవార్డు ప్రదానం చేసింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అంతర్జాతీయ సంస్థ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 2017లో కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది.
సుస్థిరత కోసం గళం వినిపించారు
దరిపల్లి రామయ్య సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లు నాటడమే కాకుండా వాటి రక్షణకు ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి.. భవిష్యత్ తరాలపై బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.– ఎక్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
సమాజంపై తనదైన ముద్ర
పర్యావరణ పరిరక్షణకు, అడవుల పెంపకానికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన రామయ్య సమాజంపై తనదైన ముద్ర వేశారు. పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత స్థాయిలో తీసుకునే చర్యలు ఎంత శక్తివంతమైనవో తెలపడానికి రామయ్య జీవితం ఒక ఉదాహరణ. – రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
ప్రకృతి కోసం జీవితాన్ని అంకితం చేశారు
ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి, తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామయ్య. ఒక సామాన్య వ్యక్తిగా ఉండి, మొక్కలు నాటడం ద్వారా సమాజాన్ని స్ఫూర్తివంతం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
– సీఎం రేవంత్‌రెడ్డి
పచ్చదనానికే తీరని లోటు
‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనది. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసమాన్యమైనది. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికే తీరని లోటు. – మాజీ సీఎం కేసీఆర్
రామయ్య సేవలు స్ఫూర్తిదాయకం
ప్రకృతి ప్రేమికుడు, సామాజిక కార్యకర్త వనజీవి రామయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కోటి మొక్కలకు పైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి