
సన్న బియ్యం కాదు.. బిహార్ బియ్యం!
♦ పౌరసరఫరాల శాఖలో అవకతవకలపై కాంగ్రెస్ ధ్వజం
♦ అక్రమాలను అరికడుతున్నామని మంత్రి ఈటల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు సన్న బియ్యం సరఫరాలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తారు. శనివారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో వరి పండించిన రైతులకు రూ.1,800 చొప్పున కనీస మద్దతు ధరను అందించి, వారి వద్ద నుంచే మిల్లర్లు సన్నబియ్యం కోసం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, బ్రోకర్ల ద్వారా బిహార్‌నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి ఈటల జవాబిస్తూ.. బిహార్ నుంచి నల్లగొండకు బియ్యం దిగుమతి జరిగిన మాట వాస్తవమేనన్నారు.
పౌరసరఫరాల శాఖకు గతేడాది రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు (రూ.1,800 కోట్లు) తగ్గించడంతో ఆయా వర్గాలకు బియ్యాన్ని ఎలా అందించగలుగుతారని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసరఫరాల శాఖలో అవకతవకలను అరికట్టడం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పేదలకు, వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.. కాగా, స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గంలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో 13 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం రిజర్వాయరును ప్రతిపాదించిందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ల గురించి పట్టించుకోలేదని, నాడు జరిగిన తప్పులను సవరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
నిలోఫర్ ఆసుపత్రిలో వారం వ్యవధిలో ఐదుగురు మహిళలు మరణించిన మాట వాస్తవమేనని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ మరణాలపై విచారణ కోసం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించిందని, నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా తల్లుల మరణాల రేటు 164 ఉండగా, రాష్ట్రంలో 74 మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లో హుక్కా కేంద్రాలు నడుస్తున్న మాట వాస్తవమేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే జంటనగరాల్లో 548 కేసులు నమోదు చేశామని, హుక్కా పీల్చడంవల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.