
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
పరిశీలిస్తున్నామన్న మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాలలు, వసతి గృహాల్లో ఆ పథకం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో సభ్యుల సూచన మేరకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైచిలుకు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం వల్ల 29.8లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారని, వసతిగృహాల్లో మరో 6 లక్షల మంది విద్యార్థులకూ అమలు చేస్తున్నామని వివరించారు. ఈ బియ్యం కోసం కొంటున్న వడ్లకు రూ.1,800 చొప్పున ధర చెల్లిస్తున్నారని, అలాగే మిగతా రకాలకు కూడా అంతే మొత్తం చెల్లించి రైతులకు అండగా నిలవాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు.