
సన్నబియ్యం ధర భగ్గుమంటోంది. వర్షాభావంతో సాగు తగ్గడం.. ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని మిల్లర్లు కర్ణాటకకు ఎగుమతి చేయడం.. కృత్రిమ కొరత సృష్టించడం.. వెరసి ధరపై ప్రభావం చూపుతోంది. డిమాండ్‌ను
ఆసరాగా చేసుకుని మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంలో కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సన్నబియ్యం(సోనా మసూరి) ధర మళ్లీ ఆకాశాన్నంటుతోంది. నాలుగు నెలలతో పోలిస్తే ధర పెరుగుదలలో భారీ వ్యత్యాసం ఉంది. క్వింటాపై ఏకంగా రూ.400 నుంచి రూ.600 పెరిగింది. సాధారణ రకం బియ్యం క్వింటా ధర మార్కెట్లో రూ.3,900 నుంచి రూ.4,100 ఉండగా.. ప్రస్తుతం రూ.4,500లకు విక్రయిస్తున్నారు. కొత్త బియ్యం(ఈ ఖరీఫ్‌లో వచ్చిన దిగుబడి) క్వింటా రూ.3,600 పలుకుతోంది. అయితే కొత్త బియ్యం వంట వండితే గంజికడుతుంది. కాస్త పాతబడే వరకు తినేందుకు ఇబ్బందే. అందుకే పాతబియ్యం కొనుగోలుకే జనం మొగ్గు చూపుతారు. దీంతో గ్రేడ్–1 రకం బియ్యమైతే క్వింటా ధర రూ.4,800 వరకూ(బ్రాండ్‌ను బట్టి) ఉంటోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు భారీగా బియ్యాన్ని ఎగుమతి చేస్తుండటం, మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించడం కూడా బియ్యం పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది.
రేషన్ బియ్యం కల్తీ
కర్ణాటకలోని హోస్పేట్, బళ్లారి, రాయచూరు, బెంగళూరు, శివమొగ్గ ప్రాంతాలకు ‘అనంత’ నుంచి భారీగా సన్న బియ్యాన్ని ఎగుమతి అవుతోంది. మన జిల్లాలో బియ్యం ధర పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం. సన్న బియ్యానికి డిమాండ్ పెరగడంతో ఇదే ఆసరాగా చేసుకుని కొందరు మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు. బియ్యం ధరను పెంచేయడం, కిలో రూపాయికి లభించే రేషన్ బియ్యాన్ని మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి అధిక ధరకు విక్రయించడం ద్వారా మిల్లర్లు భారీగా లబ్ధి పొందుతున్నారు. ఖరీఫ్‌లో వచ్చిన దిగుబడితో పాటు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుల్లో భారీగా నిల్వ ఉంది. అయినప్పటికీ మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించి ధరల పెంచేశారని తెలుస్తోంది.
విజిలెన్స్ అధికారులు గోదాములు, రైస్ మిల్లులపై దాడులు నిర్వహిస్తే అక్రమ నిల్వల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 10.97లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఉన్న కుటుంబాల సంఖ్య 9.68లక్షలు. అంటే జిల్లాలోని కుటుంబాల కంటే రేషన్‌కార్డుల సంఖ్యే అధికం. దీన్నిబట్టి చూస్తే బోగస్ కార్డులు రేషన్‌డీలర్ల చేతిలో ఏ మేరకు ఉన్నాయో తెలుస్తుంది. ఈ కార్డుల ద్వారా మిగిలే బియ్యంతో పాటు కార్డులుదారులు కొనుగోలు చేయకుండా మిగిలిన బియ్యాన్ని బ్యాక్‌లాగ్ చూపించకుండా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం కల్తీకి ఉపయోగపడుతున్నాయని స్పష్టమవుతోంది.
జిల్లా వ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలపై ప్రభావం
జిల్లాలో 9.68 లక్షల కుటుంబాలు ఉండగా.. వీరిలో అధికభాగం సన్న బియ్యం కొనుగోలు చేస్తారు. పెరిగిన ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. అరకొరగా వచ్చే జీతాలతో పిల్లల ఫీజులు, నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పాలబిల్లులు లెక్కిస్తే భారీగా ఖర్చవుతుంది. ఈ క్రమంలో క్వింటాపై ఏకంగా రూ.400 నుంచి రూ.600 పెరగడమనేది కచ్చితంగా ఈ వర్గాలపై ప్రభావం చూపుతుంది.
తగ్గిన వరి దిగుబడి కారణమే: గతేడాది ఖరీఫ్‌లో 22వేలు, రబీలో 16వేల హెక్టార్లలో వరి సాగయ్యేది. అయితే గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వరి సాగు తగ్గింది. ఖరీఫ్‌లో 13వేలు, రబీలో 8వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు మాత్రమే వరి సాగు చేశారు. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌లో 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావల్సి ఉంటే, కేవలం 30వేల మెట్రిక్‌టన్నులు మాత్రమే వచ్చింది. రబీ పంట ఇంకా కోతకు రాలేదు. దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గింది. ఇది కూడా ధర పెరుగుదలపై ప్రభావం చూపింది.
Comments
Please login to add a commentAdd a comment