వెల్ది గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీడీఓ వసుమతి
రఘునాథపల్లి: ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు మండలంలోని వెల్ది గ్రామసభలో సర్పంచ్ వినూత్న ఆఫర్‌ను ప్రకటించాడు. 30 రోజుల ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కొయ్యడ మల్లేష్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ముఖ్య అతిథిగా ఎంపీడీఓ వసుమతి పాల్గొన్నారు. ప్రణాళికలో గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేస్తే విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్‌తో అపరిశుభ్రత చోటు చేసుకుంటుందని గ్రామస్తులు వాపోయారు. ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు ఊరంతా చెల్లాచెదురుగా పడుతున్నాయని వీటిని పూర్తిగా నివారించాలని గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ సేకరించి పంచాయతీకి అప్పగిస్తే కిలోకు రెండు కిలోల సన్నబియ్యం ఇస్తామని ప్రకటించాడు. వీధుల్లో చెత్త వేస్తే రూ 500 జరిమానా, చెత్త వేసిన వారి సమాచారం ఇస్తే రూ.250 నగదు బహుమతి అందజేస్తామన్నారు. ప్రతీ నెల 15, 30 తేదీలలో ఇంటింటా శుభ్రత చేయాలని గ్రామసభలో తీర్మాణం చేయగా గ్రామస్తులంతా ఏకీభవించారు. ఎంపీడీఓ వసుమతి మాట్లాడుతూ ప్లాస్టిక్, పారిశుద్ధ్య నిర్మూలనకు చక్కటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామసభలో ఉప సర్పంచ్ తిరుమల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, వార్డుసభ్యులు పెద్దగోని రాజు, కావటి నాగేష్, గువ్వ యాదలక్ష్మి, పెండ్లి లావణ్య, నూనెముంతల ఊర్మిళ, ఎడ్ల బాలనర్సు, కొయ్యడ సుగుణ, దర్శనా రవి, మాజీ ఎంపీటీసీ పెండ్లి మల్లారెడ్డి, కోఅప్షన్ సభ్యులు రంగు యాదగిరి, బత్తిని మల్లేష్, కారోబార్ భిక్షపతి, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment