ds chauhan
-
సంక్రాంతికి సన్నబియ్యం లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సాకారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఖరీఫ్ సీజన్లో సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కొత్త బియ్యాన్ని రేషన్‌కార్డుదారులకు ఇవ్వడానికి తమకేం ఇబ్బంది లేదని, సన్న బియ్యం మూడు నెలలు నిల్వ చేసిన తర్వాతే అన్నం బాగుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వంట సరిగా కాకపోతే బియ్యం బాగాలేవంటారని, అందుకే మూడు నెలల తర్వాత బియ్యం ఇస్తే మంచిదని సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. దీంతో సంక్రాంతికి సన్న బియ్యం ఇవ్వలేమని కమిషనర్ సూత్రప్రాయంగా వెల్లడించినట్టయ్యింది. ఖరీఫ్ ధాన్యం ఉగాది నుంచి 9 నెలలు సరిపోతుందిరేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదని, అందుకే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కమిషనర్ చౌహాన్ అన్నారు. అయితే సంక్రాంతి, ఉగాది ఎప్పటి నుంచి అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని 2.81 కోట్ల మందికి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయన్నారు. ఇందుకోసం సంవత్సరానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కావాలని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నామని, అందులో 35 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం వస్తుందని చెప్పారు. ఈ సన్న ధాన్యం ఉగాది నుంచి ఇస్తే 9 నెలలకు సరిపోతుందన్నారు. 13.13 ఎల్ఎంటీ ధాన్యం సేకరణరాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కమిషనర్ చౌహాన్ చెప్పారు. ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో 10.11 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం కాగా 3.02 లక్షల టన్నులు సన్న ధాన్యమన్నారు. ఇందులో 12.40 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్లకు పంపించినట్టు చెప్పారు. రూ. 3వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.1,560 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇక సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ కింద రైతులకు రూ. 9.21 కోట్లు చెల్లించామన్నారు. 362 మంది డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదని, సీఎంఆర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, ఎవరికీ బలవంతంగా ధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీని భూతంగా చూపుతున్నారన్నారు. సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీని మిల్లర్లకు తిరిగి ఇచ్చేస్తామని, ఇతర అప్పులకు వాటిని మినహాయించుకోమని స్పష్టం చేశారు. సన్న ధాన్యానికి 4వేల కేంద్రాలుసన్న ధాన్యం, దొడ్డు ధాన్యం పండించిన చోట జిల్లా కలెక్టర్లు జియోగ్రాఫికల్ సిస్టం ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. 8 వేల కేంద్రాల్లో 4వేలకు పైగా సన్న ధాన్యం కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. -
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో.. వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్‌కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి. ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పా జంక్షన్ వద్ద ఎస్ఐకి గాయాలు! రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు. -
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోటి విలువ చేసే స్థలం కొట్టేయాలని..
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోటి విలువ చేసే భూమిని కొట్టేయాలని పథకం రచించిన ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్‌తో కలిసి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ శనివారం వివరాలు వెల్లడించారు. ►బీబీనగర్‌లోని రాఘవాపూర్‌కు చెందిన దొంతి సత్తిరెడ్డి స్థానికంగా వ్యాపారి. కొన్నేళ్లుగా మాగ్జిమా రిసార్ట్స్ ఫామ్ ఫేజ్–1లోని ప్లాట్ నంబర్ 204, 221లోని 2,420 గజాల రెండు ప్లాట్లు ఖాళీగా ఉండటాన్ని గమనించాడు. యజమానుల రాకపోకలు లేకపోవటంతో దానిని స్వాహా చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో ప్లాట్లను విక్రయించడంలో సిద్ధహస్తుడైన పాత నేరస్తుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్, కీసరలోని చీర్యాలకు చెందిన దాడి ధర్మేందర్ రెడ్డిని సంప్రదించాడు. ►ఇద్దరు కలిసి సదరు భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సంపాదించారు. అనంతరం ధర్మేందర్ రెడ్డి సూచన మేరకు ఉప్పర్‌పల్లికి చెందిన సయ్యద్ నజీర్ ఉర్ రహ్మాన్ (ప్రస్తుతం మరణించాడు) నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు, నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు. వీటి సహాయంతో భూమిని ఇతరులకు విక్రయించాలని భావించారు. ►ఇందుకోసం ముందుగా భూమిని జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు ప్లాట్ల అసలు యజమానులైన కేబీ ఖురానా, అనిల్ ఖురానాల వయసుకు సరిపోయే లా వ్యక్తులను చూడాలని కోరుతూ బోరబండకు చెందిన మహ్మద్ షౌకాత్ అలీని సంప్రదించారు. ►దీంతో కేబీ ఖురానా లాగా యూసుఫ్‌గూడకు చెందిన గొర్రె రమేష్, అనిల్ ఖురానా లాగా వల్లపు రాములు నటించారు. ఆ పైన ప్లాట్లను బోరబండకు చెందిన చాకలి రాముకు జీపీఏ చేసినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు చేశారు. రసూల్‌పురకు చెందిన మహ్మద్ ఇబ్రహీం, యూసుఫ్‌గూడకు చెందిన వాలి బాలకృష్ణ సాక్షి సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్ల సహాయంతో సత్తిరెడ్డి, ధర్మేంద్రరెడ్డి ఆయా ప్లాట్లను రూ.65 లక్షలకు విక్రయించేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ కూపీ లాగడంతో ముఠా లింకు బయటపడింది. ఇప్పటివరకు ఈ ముఠా 12 నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్లాట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఇబ్రహీం, బాలకృష్ణ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.7 లక్షల నగదు, 9 నకిలీ డాక్యుమెంట్లు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: భారత నావికా దళానికి చెందిన యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ నౌకాదళ అధికారి ప్రాణాలుకోల్పోయారు. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కర్వార్ యార్డ్‌కు వచ్చేటపుడు నౌకలో మంటలు చెలరేగాయి. లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో సిబ్బంది వేగంగా స్పందించి మంటలు ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించారు. ఈ క్రమంలో గాయాలపాలైన చౌహాన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఘటనపై నేవీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
రికవరీలో సైబరాబాద్ రాష్ట్రంలో టాప్
హైదరాబాద్: చోరీ సొత్తు రికవరీలో రాష్ట్రంలో సైబరాబాద్ కమిషనరేట్ వరుసగా ఈఏడాది కూడా రాష్టంలో మొదటి స్థానంలో నిలిచింది. 74 శాతం రికవరీతో అగ్రభాగం దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2234 కేసులు అధికంగా నమోదయ్యాయి. స్నాచింగ్, చోరీలు, కిడ్నాప్,మహిళలపై అఘాయిత్యాలు ఈఏడాది పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దోపిడీ కోసం హత్యలు, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు గతేడాది కంటే అధికంగా ఈసారి 188 మిస్టరీ కేసులను చేధించి రూ. 5.82 కోట్లు సొత్తు రికవరీ చేశారు. గచ్చిబౌలిలోని పోలీసు ఆడిటోరియంలో సంయుక్త పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్, డీసీపీలు అవినాష్ మహంతి, పి.విశ్వప్రసాద్, టి.కె.రాణా, ఏ.ఆర్.శ్రీనివాస్, నవదీప్‌సింగ్ గ్రేవల్ తదితరులతో కలిసి కమిషనర్ సీవీ ఆనంద్ 2013లో జరిగిన నేరాల వివరాలను వివరించారు. ‘అభయ’ ఘటన నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో పోలీసింగ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో ఔటర్ పై పోలీసింగ్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది డ్రంకెన్ డ్రైవ్‌లో 1400 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పలు అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా పూర్తి చేసినట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది ల్యాండ్ గ్రాబింగ్ షీట్ ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో 25 మందిపై ఈ షీట్ తెరవనున్నట్లు సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఈఏడాది అత్యధికంగా ఎల్బీనగర్ ఠాణాలో 1500 ఎఫ్ఐఆర్లు నమోదు అవగా అత్యల్పంగా మంచాల ఠాణా 217 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.