హైదరాబాద్ నాంపల్లిలోని ఎంజే మార్కెట్ వద్ద పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరిన వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో..
వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది.
కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి.
తాత్కాలికంగా సమ్మె విరమణ
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు.
దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్‌కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి.
ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్
ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అప్పా జంక్షన్ వద్ద ఎస్‌ఐకి గాయాలు!
రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్‌ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment