వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోటి విలువ చేసే భూమిని కొట్టేయాలని పథకం రచించిన ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ డీసీపీ గిరిధర్‌తో కలిసి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ శనివారం వివరాలు వెల్లడించారు.
►బీబీనగర్‌లోని రాఘవాపూర్‌కు చెందిన దొంతి సత్తిరెడ్డి స్థానికంగా వ్యాపారి. కొన్నేళ్లుగా మాగ్జిమా రిసార్ట్స్ ఫామ్ ఫేజ్–1లోని ప్లాట్ నంబర్ 204, 221లోని 2,420 గజాల రెండు ప్లాట్లు ఖాళీగా ఉండటాన్ని గమనించాడు. యజమానుల రాకపోకలు లేకపోవటంతో దానిని స్వాహా చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో ప్లాట్లను విక్రయించడంలో సిద్ధహస్తుడైన పాత నేరస్తుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్, కీసరలోని చీర్యాలకు చెందిన దాడి ధర్మేందర్ రెడ్డిని సంప్రదించాడు.
►ఇద్దరు కలిసి సదరు భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సంపాదించారు. అనంతరం ధర్మేందర్ రెడ్డి సూచన మేరకు ఉప్పర్‌పల్లికి చెందిన సయ్యద్ నజీర్ ఉర్ రహ్మాన్ (ప్రస్తుతం మరణించాడు) నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు, నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు. వీటి సహాయంతో భూమిని ఇతరులకు విక్రయించాలని భావించారు.
►ఇందుకోసం ముందుగా భూమిని జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు ప్లాట్ల అసలు యజమానులైన కేబీ ఖురానా, అనిల్ ఖురానాల వయసుకు సరిపోయే లా వ్యక్తులను చూడాలని కోరుతూ బోరబండకు చెందిన మహ్మద్ షౌకాత్ అలీని సంప్రదించారు.
►దీంతో కేబీ ఖురానా లాగా యూసుఫ్‌గూడకు చెందిన గొర్రె రమేష్, అనిల్ ఖురానా లాగా వల్లపు రాములు నటించారు. ఆ పైన ప్లాట్లను బోరబండకు చెందిన చాకలి రాముకు జీపీఏ చేసినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు చేశారు. రసూల్‌పురకు చెందిన మహ్మద్ ఇబ్రహీం, యూసుఫ్‌గూడకు చెందిన వాలి బాలకృష్ణ సాక్షి సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్ల సహాయంతో సత్తిరెడ్డి, ధర్మేంద్రరెడ్డి ఆయా ప్లాట్లను రూ.65 లక్షలకు విక్రయించేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ డీసీపీ కూపీ లాగడంతో ముఠా లింకు బయటపడింది. ఇప్పటివరకు ఈ ముఠా 12 నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్లాట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఇబ్రహీం, బాలకృష్ణ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.7 లక్షల నగదు, 9 నకిలీ డాక్యుమెంట్లు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment