సాంబమసూరి (బీపీటీ) ధాన్యం ధర రోజు రోజుకూ పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం కనీస మద్దతు ధర కూడా పలకని బీపీటీ ధాన్యం.. ప్రస్తుతం క్వింటా రూ. 1700లకు చేరింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-న్యూస్‌లైన్, మిర్యాలగూడ
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 1,43, 917 హెక్టార్లలో వరి సాగు చేశారు. సాగు చేసిన వరిలో 90 శాతం బీపీటీ ధాన్యాన్ని రైతులు పండించారు. కాగా సుమారు 8 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా దానిలో సుమారు 6 లక్షల క్వింటాళ్లు బీపీటీ ధాన్యమే కావడం విశేషం. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోవడంతో పాటు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని రైతులు ఆశించారు. కానీ తెగుళ్ల వల్ల 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పడిపోయింది. ఒక్క నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోనే జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా సుమారు 12000 హెక్టార్లలో దోమపోటు సోకిందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కాగా పంట దిగుబడి తగ్గినా.. పెరిగిన ధరలతో రైతులకు కొంత ఊరట కలుగుతోంది.
మార్కెట్ యార్డుల్లో కూడా పెరిగిన ధరలు
జిల్లాలోని 19 మార్కెట్ యార్డుల్లో ఇంత కాలం పాటు తేమ పేరుతో ప్రభుత్వ మద్దతు ధర క్వింటా బీపీటీ ధాన్యానికి రూ. 1345 చెల్లించాల్సి ఉన్నా రూ. 1300 లోపే ఇచ్చారు. కానీ ఇటీవలనే ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ యార్డులతో పాటు మిల్లు పాయింట్ల వద్ద కూడా ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నారు. మిల్లు పాయింట్ల వద్ద క్వింటా బీపీటీని ప్రస్తుతం రూ. 1700లకు పైగానే కొనుగోలు చేస్తున్నారు.
బీపీటీ @ 1700
Published Wed, Dec 18 2013 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement