మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : పత్తి కొనుగోళ్లు లేక అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రం వెలవెలబోతుంది. ఈ నెల 13వ తేదీన కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు కేవలం 1700 క్వింటాళ్ల పత్తిని మాత్రమే రైతులు విక్రయించారు. నిబంధనల పేరుతో అధికారులు వివిధరకాల కొర్రీలు పెడుతుండడంతో సీసీఐ కేంద్రానికి పత్తిని విక్రయించేందుకు రైతులు రావడం లేదు.
తుపాను కారణంగా పత్తి నల్లబారింది. దీంతో నిబంధనల మేరకు నాణ్యతప్రమాణాలు కలిగిని పత్తిని సీసీఐ కేంద్రానికి రైతులు తీసుకురాలేకపోతున్నారు. అవంతీపురం సీసీఐ కేంద్రం దామరచర్ల, నేరేడుచర్ల, త్రిపురారం, వేములపల్లి మండలాల రైతులకు అనుకూలంగా ఉంటుంది. కానీ గ్రామాలలో రైతులు ఇప్పటికే సుమారుగా 50 శాతం మంది పత్తిని విక్రయించుకున్నారు. సీసీఐ కేంద్రానికి తీసుకవస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని దళారులకు రూ.3900 నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తున్నారు. దీంతో అవంతీపురం సీసీఐ కేంద్రం వెలవెలబోతున్నది.
ఇవీ నిబంధనలు
సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయించుకోవడానికి 12శాతం తేమ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ పింజ ఉంటే క్వింటాకు 4వేల రూపాయలు, మధ్యరకం పింజ ఉంటే క్వింటాకు రూ.3700 చెల్లిస్తారు. కానీ 8 శాతం తేమ ఉంటేనే క్వింటాకు 4వేల రూపాయలు, ఆపైన తేమ శాతం ఎక్కువగా ఉంటే ఒక్కొక్క తేమ శాతానికి 40 రూపాయల చొప్పున తగ్గిస్తూ 12 శాతం వరకు ఉంటేనే కొనుగోలు చేస్తారు. 12 శాతానికి పైగా తేమ ఉంటే కొనుగోలు చేయరు. పత్తిని విక్రయించుకునే రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, సంవత్సరం లోపు పహాణీ ఇవ్వాలి. బ్యాంకులో అకౌంట్ ఉండాలి.
కౌలు రైతుల ఇక్కట్లు
కౌలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీలు ఉండకపోవడంతో సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించుకునే అవకాశం లేకుండా పోయింది. దామరచర్ల మండలంలో ఎక్కువగా కౌలు రైతులే పత్తిసాగు చేశారు. పత్తి విక్రయించుకున్న రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించనున్నందున అకౌంట్‌లు లేని రైతులు కూడా మార్కెట్‌కు పత్తిని తీసుకరాలేకపోతున్నారు.
సీసీఐ కేంద్రం.. వెలవెల
Published Thu, Dec 19 2013 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement