జడ్చర్ల, న్యూస్‌లైన్: శ్రమటోడ్చే రైతన్న కష్టం దళారుల పాలవుతోంది. ఆదుకుంటామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వారి నుంచి పత్తిని కొనుగోలుచేయాల్సిన భారత ప్రభుత్వ రంగసంస్థ సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జిల్లాలో జాడేలేకుండాపోయింది. ఏటా జడ్చర్ల మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటవుతుందని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా వాయిదాపడుతూ వస్తోంది. దీంతో పత్తికి గిట్టుబాటు ధరలు లభించికపోవడంతో రైతులు వచ్చిన ధరలకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లాలో షాద్‌నగర్ మినహా ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రం లేదు. 2004లో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పిన అధికారులు ఆ మాటే మరిచిపోయారు. గతేడాది జడ్చర్లలో నాఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రభు త్వ మద్దతుధరలకు కొనుగోళ్లు జరిపారు. ఈ ఏడాది కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు లేరు. ఈ ఏడాది పత్తి పంటకు వాతావరణం అనుకూలించలేదు. ముసురువర్షాలు, తెగుళ్ల బెడదతో రైతులు కుదేలయ్యారు. ఈ ఏడాది సాగువ్యయం కూడా బాగా పెరిగింది.
ఈ పరిస్థితుల్లో పత్తికి కనీసంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు కూడా దక్కకపోవడంతో రైతాంగం ఆందోళనచెందుతోంది. జిల్లాలో ఈ ఏడాది 1.84లక్షల హెక్టార్లలో పత్తిపంటను సాగుచేశారు. ఎకరా సాగుకు అన్ని ఖర్చులు కలిపి రూ.20వేల వరకు వెచ్చించారు. అయితే ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కనీసం ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసంగా క్వింటాలుకు రూ.ఐదువేలు వస్తే తప్ప రైతులకు గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు.
దళారుల రంగప్రవేశం
పత్తి కొనుగోళ్లకు సంబంధించి దళారులు గ్రామాల్లో తక్కువ ధరలకు కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పత్తికి మార్కెట్‌కు పోతే అతితక్కువ ధరలు వేస్తున్నారన్న ప్రచారం చేస్తున్నారు. మార్కెట్ కంటే తాము ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నామని నమ్మబలికి క్వింటాలుకు రూ.3000-3500 వరకు కొనుగోలు చేస్తున్నారు. అంతేగాక తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరనే తక్కువగా ఉంది. గత ఏడాదితో పోల్చితే పత్తి క్వింటాలుకు మద్దతు ధర కేవలం రూ.100 మాత్రమే పెంచింది. దీంతో గరిష్ట మద్దతు ధర రూ.4000, కనిష్టంగా రూ. 3700 ఉంది. జిల్లాలో పేరుగాంచిన బాదేపల్లి మార్కెట్‌లో గతేడాది 2.10 లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు కొనసాగగా, ఇదే మార్కెట్‌లో పరిధిలో నాఫెడ్ ద్వారా 1.50 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి.
తీవ్రంగా నష్టపోయాం..
ఈ ఏడాది పత్తి చేతికందే దశలో అకాలవర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. మార్కెట్‌లో పత్తికి సరైన మద్దతు ధరలు లభించక పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించి గిట్టుబాటు ధర కల్పించాలి.
-ప్రతాప్‌రెడ్డి, పత్తిరైతు, గోప్లాపూర్
క్వింటాలుకు రూ.6వేలు ఇవ్వాలి
పత్తికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.6వేలు చెల్లించాలి. అంతధర చెల్లిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. లేకపోతే పత్తిరైతులకు ఆత్మహత్యలే మిగిలేది. జడ్చర్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి దళారుల వ్యవస్థను నియంత్రించాలి.
-కరకల కృష్ణారెడ్డి, బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు
రైతన్న కష్టం దళారుల భోజ్యం
Published Fri, Nov 15 2013 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement