తగిన వరుడు | wanted groom? | Sakshi
Sakshi News home page

తగిన వరుడు

Published Sun, Jul 19 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

తగిన వరుడు

తగిన వరుడు

కథలు చెప్పుకుందాం
పూర్వం హేలాపురి అనే గ్రామంలో విశ్వగుప్తుడు అనే వస్త్ర వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా సంపన్నుడు. బోలెడన్ని ఆస్తిపాస్తులు గడించాడు. అతని ఏకైక కుమార్తె విశ్వరూప. ఆమె గొప్ప అందగత్తె. విశ్వగుప్తుడికి మగ పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆమెను చేసుకున్నవారికే అతని ఆస్తిపాస్తులు దక్కుతాయి. దాంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది వరుస కట్టసాగారు. అయితే విశ్వగుప్తుడు సంపదకు, అంతస్తులకు విలువ ఇచ్చే మనిషి కాదు.

అందుకే తన కుమార్తెను కేవలం డబ్బున్నవాడికి కాకుండా... నిజాయితీపరుడికి, స్వయంకృషిని నమ్ముకున్నవాడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి వాడయితే తన కుమార్తెను సుఖపెట్టడమే కాక... తన వార సుడిగా తర్వాత తన వ్యాపారం అతనే చేపట్టి, మరింత బాగా అభివృద్ధి చేస్తాడన్నది విశ్వగుప్తుడి ఆలోచన.
 
ఎట్టకేలకు పెళ్లిళ్లల పేరయ్య ద్వారా అందమైన, తెలివైన ఇద్దరు యువకుల వివరాలు లభించాయి విశ్వగుప్తుడికి. వెంటనే వీరా, ధర్మ అనే ఆ ఇద్దరు యువకులకూ కబురంపాడు. ఆ ఇద్దరూ బాగా చదువుకున్నవారు. చూడటానికి కూడా ఎంతో చక్కగా ఉన్నారు. ఇద్దరినీ రకరకాల ప్రశ్నలు వేశాడు విశ్వగుప్తుడు. అన్నింటిలోనూ సమ ఉజ్జీలుగా ఉన్నారు ఆ ఇద్దరూ. అయితే వారిలో ఎక్కువ సమర్థుడు ఎవరో కనిపెడితే కానీ, విశ్వగుప్తుడు తన కుమార్తెకు పెళ్లి చేయలేడు. కాబట్టి చిట్టచివరగా ఒక పరీక్ష  పెట్టాలనుకున్నాడు.  
 
ఒకరోజు ఇద్దరినీ పిలిపించి, చెరొక పదివేల రూపాయలూ ఇచ్చి, పట్నం వెళ్లి తన కూతురికి బాగా నచ్చేవి కొనుక్కురండి అని చెప్పాడు విశ్వగుప్తుడు. ఆ డబ్బు తీసుకుని ఇద్దరూ పట్నం బయలుదేరారు. వీరా నేరుగా పట్నం వెళ్లి ఏం కొందామా అని ఆలోచించాడు. సహజంగా ఆడవారికి చీరలపై మక్కువ ఎక్కువ కాబట్టి, అవే కొందామను కున్నాడు. దాంతో పది వేలూ ఖర్చు చేసి విలువైన చీరలు కొనుక్కుని మధ్యాహ్నానికే ఊరికి తిరిగి వచ్చేశాడు. తను తెచ్చిన చీరలు విశ్వగుప్తుడికి చూపించాడు. అతడు సంతోషించాడు కానీ అంతగా తృప్తి కలగలేదు. దాంతో తర్వాత కబురు చేస్తానని చెప్పి పంపేశాడు.
 
ధర్మ ఎప్పుడో చీకటి పడ్డాక తిరిగి వచ్చాడు. పదివేల రూపాయలతో కొన్న చీరలతో పాటు మరో పదివేల రూపాయల్ని విశ్వగుప్తుడి చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపోయిన విశ్వగుప్తుడు ఆ డబ్బు ఎక్కడిదని అడిగాడు. దాంతో తాను చేసిన పని గురించి చెప్పాడు ధర్మ. అతడు  మొదట విశ్వగుప్తుడు ఇచ్చిన డబ్బుతో కొన్ని అందమైన రంగు రంగుల చీరలు కొన్నాడు. సాయంత్రం వరకూ వీధుల్లో తిరిగి వాటిని రెట్టింపు ధరకు అమ్మాడు. తర్వాత పదివేల రూపాయలతో చీరలు కొని ఊరికి తిరిగి వచ్చాడు. తనకు కాబోయే భార్యకు తన డబ్బుతోనే చీరలు కొనాలనిపించిందని, అందుకే అలా చేశానని చెప్పాడు.
 
ధర్మ తెలివి తేటలకు మురిసిపోయాడు విశ్వగుప్తుడు. అతనే తన కుమార్తెకు తగిన వరుడనీ, తన తదనంతరం తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయగల తెలివితేటలు అతనికి సమృద్ధిగా ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. అయినా, ఎందుకయినా మంచిదని కూతురితో వరుడి విషయంలో తాను పెట్టిన పరీక్షను, దానికి వారి స్పందనను వివరించాడు. తన నిర్ణయాన్ని ఆమెకు తెలియజెప్పి, ఆమె అభిప్రాయాన్ని కోరాడు.

తండ్రి ఇచ్చిన డబ్బుతో గాక తన సొంత తెలివితేటలతో తన కోసం చీరలు కొని తెచ్చిన ధర్మ ఆమెకు బాగా నచ్చాడు. దాంతో ఆమె తండ్రి నిర్ణయాన్ని మనసులోనే బాగా మెచ్చుకుంది. పైకి మాత్రం ‘‘ నాదేముంది నాన్నా! ఏమి చేసినా మీరు నా మంచి కోసమే చేస్తారు కదా, అయినా మీ ఆలోచన చాలా బాగుంది నాన్నా’’ అంటూ సిగ్గుతో తలవంచుకుంది. కూతురి మనసు కనిపెట్టిన విశ్వగుప్తుడు తన నిర్ణయం సరైనదే అయినందుకు మిక్కిలి సంతోషించాడు. వెంటనే మంచి ముహూర్తం చూసి తన కుమార్తె విశ్వరూపను అతనికిచ్చి వివాహం చేసి, వీరాను తన వద్ద సహాయకునిగా నియమించుకున్నాడు.

నీతి: ఒకరిపై ఆధారపడకుండా... తన సొంత తెలివితేటలను, కృషిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ విజయమే లభిస్తుంది.
- కృష్ణకార్తీక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement