సంస్థానాధీశుల శివాలు..
రాజులు, మహారాజులంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మన తాతాతండ్రుల్ని గోచీగుడ్డలతోనైనా బతకనిచ్చారు కాబట్టి. స్వాతంత్య్రం వచ్చే నాటికి మనదేశంలో వందలకొద్దీ సంస్థానాధీశులుండేవాళ్ళు. వాళ్ళు విందులు వినోదాల్లో మునిగితేలుతూ ఎప్పుడైనా బ్రేక్‌టైంలో ప్రజల్ని గురించి ఆలోచించేవాళ్ళు. దివాన్ జర్మణి దాస్ అనే ఆయన పాటియాలా, కపుర్తలా సంస్థానాల్లో మంత్రిగా పని చేసి వాళ్ళను జాగ్రత్తగా గమనించి ‘మహారాజా’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన వ్యాసాల్లో రాస్తే, చలసాని ప్రసాదరావు కథలుగా మార్చి అనువాదం చేశారు. 1977లో ఈ పుస్తకం వచ్చింది. ఇటీవల అనంతపురం పుట్‌పాత్‌పై దొరికింది. తెలుగు పాఠకులు మంచివాళ్ళు. మంచి పుస్తకాలను తూకానికి వేస్తారు. ఈ రాజులబూజులో ఏముందంటే...
జునాగడ్ రాజావారైన రసూల్‌ఖాన్‌కి కుక్కలంటే ఇష్టం. కేవలం తొమ్మిది వందల కుక్కలను మాత్రమే పెంచేవాడు. వాటిలో రోషనార అనే కుక్కకు ఆయన పెళ్ళి చేయాలనుకున్నాడు. వరుడేమో మంగ్రోల్ రాజావారి కుక్క, దాని పేరు బాబీ. వరుడు రైలు దిగిన వెంటనే గౌరవార్ధం 101 సార్లు తుపాకులు పేల్చారు. 250 కుక్కల సమేతంగా స్వయంగా రాజావారే స్వాగతం పలికారు. పెళ్ళి కోసం మూడు రోజులు సెలవు ప్రకటించారు. 50 వేల మందికి భోజనాలు. పెళ్ళి కవరేజ్ కోసం వందలమంది ఫోటోగ్రాఫర్లు విలేకరులు వచ్చారు. ఇది చూసి ప్రేరణ పొందిన బోలెడంత మంది రాజావార్లు తమ కుక్కలకు కూడా ఇదే రీతిలో కళ్యాణం జరిపించారు. పాటియాలా రాజా యాదవేంద్రవారికి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాలని కోరిక. అది సాధ్యంకాదు కాబట్టి తన సైన్యాన్నే రెండుగా విభజించి సగం సైన్యానికి బ్రిటిష్ యూనిఫాం వేసి ఉత్తుత్తి యుద్ధం చేయించి చిత్తుగా ఓడించారు.
భూపేంద్రసింగ్ రాజావారికి క్రికెట్ పిచ్చి. ఒకసారి ఆయన టీం ఇంగ్లండ్ టీంతో ఆడాల్సి వచ్చింది. బ్రిటిష్ ఆటగాళ్ళ చేతిలో ఎలాగూ ఓడిపోతామని తెలిసి ఆయన ఓ ఎత్తు వేశారు. బ్రిటిష్ ఆటగాళ్ళకు తానే ఆతిథ్యమిచ్చాడు. బ్రహ్మాండమైన కానుకలు, రుచికరమైన భోజనం, ఖరీదైన మద్యం, సుందరీమణుల నాట్యంలో ఆటగాళ్ళు రాత్రంతా అలసిపోయి తెల్లారేసరికి ఆటలో ఓడిపోయారు. మనవాళ్ళు రన్ చేయకుండా అవతలవాళ్ళను అవుట్ చేశారు.
ఒక రాజావారికి పైజామా బొందు కట్టడానికి, లంగోటి ఎక్కించడానికి పర్మనెంట్ ఆఫీసర్ వుండేవారు. ఇంకొకాయనకు ఐదొందల మంది అంతఃపుర స్త్రీలుండేవారు. ఇలా చాలా విషయాలున్నాయి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే రాచరికాలు రద్దయ్యాక ఈ రాజుల్లో అనేకమంది ప్రభుత్వంలో మంత్రులుగా చేరిపోయారు. ఇప్పటికీ వీరి వారసులు అనేక మంది పార్లమెంట్‌లో కూచుని చట్టాలు చేస్తున్నారు. జనం గురించి పట్టించుకోకపోవడం వీళ్ళ నుంచి అంటువ్యాధులుగా మన నేతలకు కూడా సోకినట్టుంది.ఈ పుస్తకం ఇప్పుడు బుక్‌స్టాల్స్‌లో దొరికే అవకాశం లేదు. పాత పుస్తకాల షాపులో దొరికితే దొరకొచ్చు. వీలైతే దొరికించుకుని చదవండి.
- జి.ఆర్. మహర్షి 9000226618