Maharishi
-
యాద మహారుషి మర్రిచెట్టు తొలగింపునకు సన్నాహాలు..?
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల యం కొండ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డుకు పక్కన యాద మహారుషి కొ లువై ఉన్న భారీ మర్రి చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మర్రిచెట్టుకు ఉన్న పెద్దపెద్ద కొమ్మలను ఆర్అండ్బీ అధికారుల ఆదేశాలతో సిబ్బంది తొలగించినట్లు చెబుతున్నారు. యాద మహారుషి ఘోర తపస్సుతోనే యాదాద్రి క్షేత్రం రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం అభివృద్ధిలో భాగంగా చెట్టు కొమ్మలు తొలగించడంతో ఆ మహారుషికే నిలువ నీడ లేక మండుటెండలో కనిపిస్తున్నాడని స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మర్రి వృక్షాన్ని తొలగించవద్దని, యాద మహారుషి కొలువై ఉన్న ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. -
మమజీవనహేతునా...
‘‘సీతమ్మా! నీ భర్త అంత రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసానికి వస్తుంటే, ఆయనను అనుగమించి వచ్చేసావు... అలా వస్తుంటే నీ భర్త చేతకానివాడిలా అనిపించలేదా... రాజ్యాన్ని సముపార్జించుకోలేడూ, తండ్రిని ధిక్కరించలేడూ... ఆయన ధర్మానికి కట్టుబడ్డాడని ప్రశంసాపూర్వకంగా వెంట వచ్చావా తల్లీ... ఎంత గొప్పపని అమ్మా నీవు చేసింది...’’ అని అనసూయమ్మ(అత్రి మహర్షి భార్య) తమ ఆశ్రమానికి వచ్చిన సీతమ్మతో అన్నది. మెచ్చుకుని భర్తను అనుగమించడం కేవలం గుడ్డితనంగా కాదు. అదేదో అయనది అధికారమనీ కాదు, ఆ భర్త పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసింది. ఒక తండ్రి ఆడపిల్లను కంటాడు. నోములు పట్టిస్తాడు, వ్రతాలు చేయిస్తాడు... మంచి భర్త కోసం. ఆ తరువాత... పెళ్ళయి పోయాక వ్రతాలు పడుతుంది... ఎవరి కోసం? భర్తకోసం, అత్తామామల కోసం, పుట్టింటివారి కోసం... సరే.. మరి తనకోసం??? ఏమీ ఉండదు. వాళ్ళ సుఖమే తన సుఖం. అది ఆడపిల్ల గొప్పతనం. అందుకే స్త్రీ వైశిష్ట్యం వేరు. అదే పురుషుడయితే... ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం... అలా తనకోసం చాలా చెబుతాడు. ఆమెకో!!! తనకోసం అంటూ ఏమీ ఉండదు. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలి. పిల్లలు బాగుండాలి. అత్తమామలు, అమ్మానాన్నలు, తోబుట్టువులు, ఆడపడుచులు, బావగార్లూ, మరుదులూ బాగుండాలి... మరి నువ్వో... ‘అందరూ బాగుండడమే నేను బాగుండడం’... అనుకుంటుంది. అందుకే నెలకు పడే మూడువానల్లో ఒక వాన ఉత్తములయిన స్త్రీలవలన పడుతున్నది అన్నది శాస్త్రం. అటువంటి ఔదార్యం కలిగిన ఆడపిల్లకు తండ్రి పరిమితంగానే ఇస్తాడు. పెళ్ళయ్యేవరకు ఉత్తముడయిన వరుణ్ణి చూస్తాడు. పుట్టింటికి వస్తే పసుపు కుంకుమలు ఇస్తారు.. అలా ఆమెకు రక్త సంబంధీకులు కానీ, బంధుగణం కానీ ఎవరిచ్చినా అది పరిమితమే... ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమయిన దాన్ని ఇచ్చేవాడు ఎవరంటే... భర్త ఒక్కడే. కారణం– శాస్త్రంలో ఒక మర్యాదుంది. నేను ఎంత ఐశ్వర్యవంతుడిని అయినా, నేను నా భార్య పాణిగ్రహణం చేయగానే, ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం అంతా ఆమెదయిపోతుంది. నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలన నిర్ణయింపబడుతుంది. ఆమె సౌశీల్యం వల్ల నా ఆయుర్దాయం నిలబడుతుంది. అందుకే ‘మమజీవనహేతునా’ అని చెప్పి మంగళసూత్రం కడుతున్నారు. అందుకే అనసూయమ్మ అంటున్నది... ‘‘అమ్మా! భర్త తాను చేసిన పుణ్యంలో సగభాగం భార్యకిస్తున్నాడు. ఆయన ఐశ్వర్యం అంతా ఆమెదే. ఆయన ఆయుర్దాయానికి నేను కర్త. విశేషించి నేను లేని నాడు ఆయనకు ధర్మం లేదు. నేను తల్లినయి అమ్మా అని పిలిపించుకుని ఆనందాన్ని పొందానంటే దానికి కారణం–ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి. నేను ఎంత నాసిరకం చీర కట్టినా ‘సువాసిని’ అని గౌరవించడానికి కారణం– ఆయన ఉండబట్టే. ఇవన్నీ మరెవరి వలనా సంభవించవు... అందువలననే కులకాంతలు, ఉత్తమమైన స్త్రీలను గౌరవిస్తారమ్మా... శాస్త్రం ఎరిగినవారు.‘‘ఒక్కొక్క మహా పతివ్రత ఈ దేశంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలను శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే... ‘‘సూర్యోదయమవకుండు గాక’’ అని ఆదేశించింది. ధర్మచక్రం నిలబడిపోయిందంతే. అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషుడు పొందగలడో లేదో కానీ పతివ్రతాధర్మంతో స్త్రీ సాధించింది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విద్వన్మణి గణపతిముని
దేశం నలుమూలలనుంచీ వచ్చిన కవులూ, పండితులతో నవద్వీప పండితసభ కోలాహలంగా ఉంది. సభలో నెగ్గినవారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదులను ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సభలో తన సత్తా నిరూపించుకోడానికి వచ్చాడో తెలుగు యువకుడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. ఆశుకవితా దురంధరుడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆసేతు హిమాచలమంతా కీర్తించిన ఆ ప్రతిభామూర్తియే అయ్యలసోమయాజుల గణపతిముని. వినాయకుడి అనుగ్రహంతో జన్మించినందున తల్లిదండ్రులు పెట్టినపేరు గణపతి. చిన్నతనంలోనే పురాణ–ఇతిహాసాలతోబాటు జ్యోతిష్యశాస్త్రాన్ని కూడా కరతలామలకం చేసుకున్నారు. ఆనాటి పండిత లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన నవద్వీపసభలో గణపతిముని తన పాటవాలను నిరూపించుకుని‘కావ్యకంఠ‘ బిరుదును పొందారు. తత్త్వచింతనలో శంకరుడిని, కావ్యమాధుర్యంలో కాళిదాసుని తలపించే కవిత్వం గణపతిమునిదని ఆనాటి పండితులు అభిప్రాయ పడ్డారు. వారి రచనల్లో ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమాశతకం, రమణగీత, దశమహావిద్యలు వంటి గ్రంథాలు ముఖ్యమైనవి. నాయనగారు..! తీవ్రమైన తపోకాంక్షతో అరుణాచలం చేరిన వీరిని చూసి అక్కడున్న బ్రాహ్మణస్వామి తమ దీర్ఘకాలిక మౌనాన్ని వీడి ‘నాయనా‘ అని ప్రేమపూర్వకంగా పిలిచారు. ‘రమణ మహర్షులకు‘ నమస్కారం అంటూ సంబోధించిన గణపతిముని మాటతో ఆనాటి నుండి బ్రాహ్మణ స్వామి రమణ మహర్షిగా ప్రజలలో స్థిరమయ్యారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
‘అమ్మా! నన్ను కూడా...’
ఒక మహర్షి బీజాక్షర సంయుక్తమైన శ్లోకాన్ని అందించినట్లే శ్యామశాస్త్రి గారు కూడా తన కీర్తనల్లో అంతటి ప్రయత్నం చేసారు. ‘సుమేరు మధ్య వాసినీ వరదే పరదేవతా..’ –మధ్యమా స్వరూపంలో ఉన్న వాక్కుకు అధిష్ఠానమైన దేవతకు పరదేవత–అని పేరు, ‘సుమేరు మధ్య వాసిని, పరదేవత, హిమాద్రిసుతే’’ ..అది లోపల శ్యామశాస్తిగ్రారు దర్శనం చేస్తూ బయటికి వ్యక్తీకరించిన వైఖరీ వాక్కు. కనుక ఆ కీర్తనను మీ ఇంట్లో తెలిసి విన్నా, తెలియకుండా విన్నా ఆ వాక్కులోంచి శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి అయి అమ్మవారి అనుగ్రహం వైఖరీ రూపంలో ఒక్కసారి శబ్ద బ్రహ్మంగా ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. అది మన జీవితాలలో ఎటువంటి సానుకూల మార్పులనయినా తీసుకురాగలదు. అదీ వాగ్గేయకారులు మనకు చేస్తున్న ఉపకారం.శంకరాచార్యులు ఎక్కడయినా ప్రార్థన చేస్తే...అది శంకరులు చేస్తున్నట్లు ఆయన పేరుతో ఉండదు. ‘అమ్మా ! నన్ను కూడా...’’ అంటారు. అంటే ఆ శ్లోకాన్ని తరువాత కాలంలో ఎవరయినా తెలిసి కానీ, తెలియక కానీ చదువుకుంటే, అది వారే ప్రార్థన చేస్తున్నట్లుగా భావించి, వారిపట్ల అమ్మవారి అనుగ్రహం ప్రసరించాలని అలా చేసారు. అందుకే వారు జగద్గురువులు అయ్యారు.అలాగే శ్యామశాస్తిగ్రారు కూడా ‘శ్యామకష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీ కీరవాణీ, శ్రీ లలితే హేమాద్రిసుతే పాహిమాం..’’ అన్న కీర్తనలోకూడా ఆయన మనకు ఇటువంటి ఉపకారమే చేస్తున్నారు.‘అమ్మా! నీవెటువంటిదానివో తెలుసా ! సుమేరు మధ్య వాసినివి. నీలవేణి కలిగిన దానివి’ అంటే నల్లని జడ కలిగిన దానివి. కబరీబంధం(జడ) ఉన్నదానివి–అంటున్నారు. అమ్మవారి కబరీ బంధం మన కంటికి కనబడదు. అమ్మవారిని ఎదురుగుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అమ్మవారి వెనక్కి వెడితే – కిరీటానికి మధ్యలో కొంచెం ఖాళీ ఉండి అందులో కబరీ బంధం ఇముడుతుంది. దానిని దర్శనం చేస్తే మన అజ్ఞానం పోతుంది.నల్లకలువల దండలా ఉండే నల్లటి జడ, నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది ? అది తెలియాలంటే లలితా సహస్రనామంలోకి వెళ్ళాలంటారు. దేవతలను ఉపాసన చేసేటప్పడు కేశాది, పాదాది పర్యంతం(తల దగ్గర మొదలుపెట్టి పాదాల వరకు) చేయాలి. అదే పురుష స్వరూపాన్ని చేసినప్పుడు పాదాది, కేశాది పర్యంతం చేయాలి. కానీ లలితా సహస్రంలో ముందు తల చెప్పరు. ‘చతుర్బాహుసమన్విత’ అన్నారు. అలా చేతులతో ఎందుకు మొదలుపెట్టారో శ్యామశాస్తిగ్రారు ఆ రహస్యాన్ని ఆవిష్కరించారు.అమ్మవారు నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు(చతుర్బాహు సమన్విత)పట్టుకుంది. రాగం కోర్కెను జయించాలి. పొద్దస్తమానం సంసార లంపటంతో కూడిన కోర్కెలు కోరుకోవడం కాదు. ‘అమ్మా ‘ నీ చరణ సేవ ఎన్నడు చేస్తానమ్మా!’ అన్న కోర్కె పుట్టాలి. అటువంటి కోర్కెలు కోరేటట్లుగా మనస్సును మార్చగలిగే స్థితిని ఇచ్చి వరాలిస్తుంది కనుక ‘వరదే’ అన్నారు. అమ్మవారి చేతిలో ఉన్న బాణాల ఆకర్షణ చేత–‘క్రోధాంకుశోజ్వల’...క్రోధాన్ని క్రోధంతో, కోరికను తిరస్కతితో గెలవబడితే– మనస్సునుండి అజ్ఞానం తొలగి కబరీబంధ దర్శనమవుతుంది. అందుకని చేతులు ముందుగా చెప్పి తరువాత తల చెబుతారు అమ్మవారికి. నీ పాద సేవ చేయాలనే కోర్కెలను మాలో కలిగించి వాటిని నువ్వే తీర్చే స్వరూపమున్న ‘వరదే’, ‘హిమగిరి సుతే’ పాహిమాం ! అంటున్నారు. -
ఎవరెస్ట్ అంచున పూజ
కెరీర్ పీక్‌లో ఉంది.హిమంతో కట్టిన సినీ ఆలయంలో పూజలందుకుంటున్న స్టార్ దేవత పూజా హెగ్డే.అక్కడిదాకా ఎలా వెళ్లావ్?ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళతావ్?అని అడిగితే...నేను రాలేదు.. నేను వెళ్లలేదు..నేను ఉన్నాను.. అంతే.భయం లేకుండా ఉన్నాను.ఓర్పుగా ఉన్నాను.టాలెంట్‌ని నమ్మాను అంటోంది పూజా హెగ్డే. ‘డీజే’ తర్వాత మీ కెరీర్ పీక్స్‌లో ఉంది. అన్నీ పెద్ద సినిమాలే చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? పూజ: చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమాని ఈ మధ్యే పూర్తి చేశాను. ప్రభాస్‌తో పీరియాడికల్ మూవీ చేస్తున్నాను. అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో మీరే కథానాయిక కదా? అవును. అయితే దాని గురించి ఇప్పుడేం చెప్పలేను. మళ్లీ మాట్లాడదాం. అన్నీ పెద్ద సినిమాలే చేస్తున్నారు.. పెద్దవి కాబట్టి ఓకే అంటున్నారా? మీ పాత్ర కూడా బాగుండాలనుకుంటారా? ఒక్కో సినిమాకు ఒక్కోవిధంగా ఉంటుంది. అన్ని సినిమాలను ఒకేవిధంగా ఎంపిక చేసుకోలేం. కొన్ని సినిమాలు క్యారెక్టర్ వల్ల అంగీకరిస్తాను. ఇంకొన్ని సినిమాలు దర్శకుడి వల్ల కూడా ఒప్పుకుంటాను. కొన్ని సినిమాలను హీరోలను దృష్టిలో పెట్టుకుంటాను. మంచి దర్శకుడు–హీరో సినిమాలో ఒకవేళ నా క్యారెక్టర్ లెంగ్త్ అరగంటే అనుకోండి.. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే అలాంటి కాంబినేషన్లో వచ్చే సినిమాల్లో రోల్ తక్కువ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే.. అనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు పాటను కొంచెం మార్చి అనగనగా పూజట తన పేరు.. తనెలాంటి అమ్మాయి అంటే..? (నవ్వుతూ) పూజ ఎలాంటి అమ్మాయి అంటే.. సింపుల్‌గా చెప్పాలంటే.. ‘ధైర్యవంతురాలు’. టామ్‌బాయ్ టైప్. కెరీర్ జర్నీ పరంగా ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కెరీర్ విషయంలో ఉండే సహజమైన భయాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా కెరీర్ జర్నీ కొనసాగించడమే. మరి.. ఈ ధైర్యవంతురాలకి కోపం ఎక్కువ ఉంటుందా? కోపమనేది తప్పు కాదనుకుంటాను. అప్పుడప్పుడు కోప్పడటం మంచిదే. జనరల్‌గా కోపాన్ని తప్పుగా ఊహించుకుంటాం అయితే ఎప్పుడు కోపగించుకోవాలో తెలియాలి. చీటికీ మాటికీ కోపం తెచ్చుకుంటే ఆ కోపానికి అర్థం ఉండదు. నా కోపానికి తగిన కారణం ఉంటుంది. సాధారణ అమ్మాయి నుంచి హీరోయిన్గా, హీరోయిన్ నుంచి స్టార్‌గా.. ఆర్టిస్ట్‌గా ఈ నాలుగేళ్లలో ఏం నేర్చుకున్నారు? నేను స్టార్ అదీ ఇదీ అని ఏదో గొప్పగా ఫీల్ అవ్వను. నార్మల్ అమ్మాయిలానే ఫీల్ అవుతాను. ఈ ఐదేళ్లల్లో నేను తెలుసుకున్నదేంటంటే... ఆర్టిస్ట్‌గా కంటిన్యూ కావాలంటే చాలా సహనం కావాలి. అసలు ఈ ప్రపంచంలో బతకడానికి చాలా ముఖ్యమైంది అదే అనుకుంటా. ఇక నా ప్రొఫెషన్ విషయానికి వస్తే.. ‘ఓర్పు’ అనేది చాలా చాలా ముఖ్యం. మేకప్ చేసుకోవాలి. ప్రతి షాట్‌కి మధ్య గ్యాప్.. లొకేషన్లో వేరే ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ తీసేటప్పుడు షాట్‌కి వెయిటింగ్, మేకప్... ఇలా ప్రతి దాని ముందు చాలా వెయిటింగ్ ఉంటుంది. ఆ వెయిటింగ్‌ని తట్టుకోవాలి. కొందరిని మినహాయిస్తే చాలామంది అమ్మాయిలకు మేకప్ అంటే శ్రద్ధ ఎక్కువ. మరి మీకు? కాలేజ్ రోజుల్లో నేను టామ్‌బాయ్‌ని. అలాంటి అమ్మాయిలు నాకు తెలిసి మేకప్‌కి దూరంగా ఉంటారు. నా చిన్నప్పుడు నేను మేకప్ వాడలేదు. పెద్దయ్యాక కూడా అంతే. అందుకే హీరోయిన్ అయ్యాక స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగా అనిపించేది. కానీ ఇప్పుడు అలవాటు పడిపోయాను. షూటింగ్ లేనప్పుడు మేకప్ వేసుకోను. ఒకవేళ ఏదైనా పాత్ర మేకప్ కోసం నాలుగైదు గంటలు మేకప్ చైర్లో కూర్చోవాల్సి వస్తే? తప్పకుండా. ఇందాక చెప్పినట్టు సహనం ముఖ్యం. అది ఉంటే ఈజీగా చేసేయొచ్చు. పైగా ప్రొఫెషన్ కోసం చెయ్యాలి. స్టార్‌గా మారాక మీ లైఫ్‌లో వచిన మార్పులేంటి? పెద్ద మార్పులేం లేవు. మా పేరెంట్స్ నన్ను చాలా నార్మల్‌గా పెంచారు. అది చాలా ఉపయోగపడింది. ఇండస్ట్రీ నన్ను ఎఫెక్ట్ చేసిందనుకోను. అప్పటిలానే ఉన్నాను. బయటకు వెళ్తే గుర్తుపడతారు. మనకు ప్రైవేట్ స్పేస్ ఉండదనే డౌన్ సైడ్ తప్పితే ఏం తేడా లేదు. బయటకు వెళ్లినప్పుడు స్వీట్ ఫ్యాన్స్ ఎదురుపడతారు, ఇబ్బంది పెట్టేవాళ్లూ ఉంటారు. ఇబ్బంది పెట్టే వాళ్ల గురించి? కొందరు దగ్గరకు వచ్చేస్తారు. మీద పడిపోతారు. అదంతా యాక్టర్స్ మీద ఉన్న అభిమానమే అని అనుకుంటాను. సినిమాల మీద ప్రేమే. తెలుగు ప్రేక్షకుల్లో నాకు బాగా నచ్చేది అదే. సినిమాను బాగా ప్రేమిస్తారు. మమ్మల్ని చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు. స్క్రీన్ మీద చూసినప్పుడు అరుస్తారు. మమ్మల్ని బయట చూసినప్పుడు మాతో ఫోటో దిగాలనుకుంటారు. టచ్ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు టూమచ్ అవుతుంది. బట్ అదంతా ప్రేమాభిమానాల వల్లే అని అర్థం చేసుకోగలగాలి. స్క్రీన్ మీద మిమ్మల్ని చూసి ఫ్యాన్స్ అరుస్తారు, విజిల్స్ వేస్తారు. మీరు ఎవరి కోసమైనా విజిల్స్, అరవడం లాంటివి చేసిన సందర్భాలు? నేనంత స్టార్‌స్టక్ కాదు. చిన్నప్పుడు అలా చేయలేదు. ఫ్యాన్గాళ్గా అనిపించిన మూమెంట్ రాహుల్ ద్రావిడ్‌ని కలిసినప్పుడు మాత్రమే. రాహుల్ ద్రావిడ్ ఇష్టమన్నారు. క్రికెట్‌ను ఫాలో అవుతారా? చిన్నప్పుడు ఆడేవారా? క్రికెట్ బాగానే ఫాలో అవుతాను. కానీ చిన్నతనంలో ఎప్పుడూ ఆడిన సందర్భాలు లేవు. ఏ స్పోర్ట్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవారు? నేను స్కూలింగ్‌లో బ్యాడ్.. పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) పిరియడ్ అంటే చాలు పరిగెత్తేదాన్ని. బాస్కెట్ బాల్ ఆడినట్టు గుర్తు. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవారా? అస్సలు లేదు. నాకు చాలా సిగ్గు. యాన్యువల్ డే అంటే స్కిప్. స్కూల్లో అంతమంది ముందు పర్ఫామ్ చేయడమా? వామ్మో అనుకునేదాన్ని. అందుకే స్కిప్ కొట్టేదాన్ని. యాక్టర్ అయ్యాక సుమారు 100 మందికి పైనే సెట్లో ఉంటారు. వాళ్ల ముందు యాక్ట్ చేయాలి. ఆ సిగ్గుని ఎలా దాటేశారు? నిజానికి కాలేజ్ టైమ్‌లోనే స్టేజ్ ఫియర్ పోగొట్టుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా ఆ ప్రయత్నం చేశాను. బిడియం అనేది ఒక్క రోజులో పోగొట్టుకున్నది కాదు. ప్రయత్నించీ.. ప్రయత్నించీ.. చివరికి పోగొట్టగలిగా. మీ ఫస్ట్ డే షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని గుర్తు చేసుకుంటారా? హో.. చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. తమిళ సినిమా ‘ముగముడి’ ద్వారా పరిచయం అయ్యాను. కెమెరా ముందుకెళ్లి నా డైలాగ్స్ అన్నీ టకటకమని అప్పజెప్పినట్టు చెప్పేసి వచ్చాను. అప్పుడు నా కోస్టార్ జీవా ‘డైలాగ్స్ అంత ఫాస్ట్‌గా కాదు.. కొంచెం టైమ్ ఇచ్చి మెల్లిగా చెప్పాలి’ అన్నారు. అలా అప్పటినుంచి ఇప్పటివరకూ రోజూ ఏదొకటి నేర్చుకుంటూనే ఉన్నాను. రొమాంటిక్ సీన్స్‌కి ఇబ్బంది పడతారా? ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో పెద్దగా రొమాంటిక్ సన్నివేశాలేం లేవు. అయినా రొమాంటిక్ సీన్, డైలాగ్స్ సీన్.. ఏదైనా ఒకటే. పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్. రొమాంటిక్ సీన్స్‌ని మనసుకు తీసుకుని చెయ్యం కదా. టెక్నికల్ థింగ్.. అంతే. ఫైనల్లీ... మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి? ‘మహర్షి’ అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఎగై్జటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. మరిన్ని ఎగై్జటింగ్ ప్రాజెక్ట్స్‌లో కనిపిస్తా. డి.జి.భవాని తమిళ్ నుంచి తెలుగుకి.. ఆ తర్వాత హిందీ సినిమాలకు.. భాషలు వేరు. ఇంకా ఏమైనా వ్యత్యాసాలున్నాయా? భాష ఒక్కటే వేరు. అయితే మనుషులంతా ఒకటే. షూటింగ్ అట్మాస్ఫియర్ కూడా సేమ్ టు సేమ్. అయితే సౌత్ స్క్రీన్ మీద హీరోయిన్లు కనిపించే తీరు వేరు.. నార్త్ స్క్రీన్ మీద వేరు. ఇక్కడికి తగ్గట్టుగా మా పాత్రలు ఉంటాయి. అక్కడికి తగ్గట్టుగా అక్కడి హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ని డిజైన్ చేస్తారు. ఫిల్మ్ మేకింగ్‌లో కొంచెం తేడా ఉంటుంది. అంతే తప్ప పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. మీరు అందానికి సొంతూరు అంటే అతిశయోక్తి కాదు.. మరి అందం గురించి ఎలాంటి కేర్ తీసుకుంటారు? ‘ఇలా చేస్తాను’ అని పర్టిక్యులర్‌గా చెప్పడానికి ఏమీ లేదు. నిజానికి నేను బద్ధకస్తురాలిని. అయితే ఎంత బద్ధకమైనా ఒక్క పని మాత్రం చేస్తాను. అదేంటంటే.. నిద్రపోయే ముందు మేకప్ తీయడం. అలాగే ఎక్కువగా నీళ్లు తాగుతాను. యాక్టర్ అంటే హిట్స్ ఉంటాయి... ఫ్లాప్స్ ఉంటాయి. ఫ్లాప్స్‌ని ఎలా తీసుకుంటారు? ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకూ నేనే పాత్ర చేసినా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్టర్‌గా పూజా కరెక్ట్‌గా చేయలేదు అనే నెగటివ్ రివ్యూ చదవలేదు. సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. మనం డిసైడ్ చేయలేం. అన్ని సినిమాలు బాగా ఆడాలనుకుంటాం. అలా జరగదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఏం చెయ్యగలం? అందుకే ఫ్లాప్ అనేది నన్ను పెద్దగా ఎఫెక్ట్ చేయదు. -
చెప్పిన డేట్‌కే వస్తున్నాం
మహేశ్‌బాబు లేటెస్ట్ చిత్రం ‘మహర్షి’ ఆలస్యం అవుతుంది, జూన్‌లో రిలీజ్ కానుంది అని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్ 25నే వస్తున్నాం అని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’రాజు, పీవీపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలకపాత్రలో కనిపిస్తారు. ‘‘చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.మార్చి 15 నాటికి రెండుపాటలు మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముందు ప్రకటించినట్టు ఏప్రిల్ 25నే చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. మహేశ్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: కె.యు. మోహనన్. -
నో హాలిడే
విలన్స్ తాట తీస్తున్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ ఫైట్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. అంటే.. సండే ‘మహర్షి’ యూనిట్‌కి నో హాలిడే అన్నమాట. నెక్ట్స్ హైదరాబాద్‌లోని మరో స్టూడియోలో వేసిన సెట్లో మరో ఫైట్‌ను షూట్ చేస్తారు చిత్రబృందం. ఈ ఫైట్‌ను నాలుగురోజుల పాటు చిత్రీకరిస్తారని సమాచారం. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని ఫారిన్ షెడ్యూల్ కోసం ‘మహర్షి’ టీమ్ ఫ్లైట్ ఎక్కుతుందట. ఇందులో స్టూడెంట్‌గా, బిలియనీర్‌గా కనిపిస్తారు మహేశ్. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో అల్లరి నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారు. ఆల్రెడీ ‘మహర్షి’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
తగిన సమయం
పూర్వం సౌభరి అనే పేరుగల మహర్షి ఉండేవారు. ఆయన మహా తపశ్శాలి. ఓ రోజున ఆయన ఎప్పటిలాగే నదికి వెళ్లి, సూర్యునికి ఎదురుగా నిలబడి దోసిలి నిండా నీళ్లు తీసుకున్నాడు. మంత్ర పూర్వకంగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించబోతుండగా ఆయన చేతిలో అయిదారు చేపలు కనిపించాయి. అవన్నీ ఒకదానితో ఒకటి ఎంతో ప్రేమగా ఉన్నాయి. వాటిని చూడగానే మహర్షికి సంసార జీవితం మీదకు ధ్యాస మళ్లింది. ‘ఎందుకు నేను ఇంతకాలం తపస్సు చేస్తున్నాను. ఎవరికోసం చేస్తున్నాను. నన్ను ఆదరించేవారెవరు. నా అంతిమ ఘడియలలో నన్ను ప్రేమతో సాగనంపేవారెవరున్నారు. అల్పజీవులైనప్పటికీ ఈ చేపలు ఎంత హాయిగా కుటుంబ జీవనం గడుపుతున్నాయి! వాటితో పోల్చుకుంటే నేను జీవితంలో చాలా కోల్పోయాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే వివాహం చేసుకుంటే బాగుంటుంది’ అనుకుంటూ ఆ దేశపు రాజు వద్దకెళ్లి, తనకు పెళ్లి చేసుకోవాలని ఉందన్న కోరికను వెళ్లబుచ్చాడు. అంతటి మహాయోగి తనంత తానుగా వచ్చి అడిగితే ఎలా కాదనగలం అనుకుని తన కుమార్తెలనే ఇచ్చి వివాహం చేశాడు. వారితో కొంతకాలం పాటు అన్ని సౌఖ్యాలనూ అనుభవించాడు సౌభరి. ఆ తర్వాత అర్థమైంది ఆయనకు ఈ జీవితంలో ఏమున్నదో! నిద్రలేవడం, వండుకోవడం, తినడం, వినోదాలతో కాలక్షేపం చేయడం, నిద్రపోవడం... ఇంతకు మించి ఏమీ కనిపించడం లేదని భార్యలతో అన్నాడు. వారు కూడా ఆయన అభిప్రాయాన్ని గ్రహించి, గౌరవించారు. తాము కూడా యోగమార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి మళ్లి, తర్వాత మోక్షం పొందాలని ఉందని తెలియజేశారు. ఆ తర్వాత అందరూ కలసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించి, ముక్తి పొందారు. పిన్న వయసులో వైరాగ్యాన్ని, వేదాంతాన్ని అలవరచుకోవడం ఎంత హాస్యాస్పదమో, వృద్ధాప్యంలో కూడా యవ్వనంలో ఉన్నట్లు ప్రవర్తించడం అంతటి హేయం. అంటే ఏ వయసులో ఆ ధర్మాన్ని పాటించాలని సౌభరి మహర్షి కథ ద్వారా వ్యాసుడు మనకు తెలియజేశాడు. కొందరు ఎంత సంపాదించినా, ఇంకాస్త సంపాదిస్తేనో లేదా ఇల్లు, గృహోపకరణాలు అన్నీ అమర్చుకుంటేనే కానీ పెళ్లి చేసుకోవడం సరికాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూనో కాలయాపన అయ్యాక చివరికి బాధపడుతుండడం మనం చూస్తున్నదే. – డి.వి.ఆర్. -
మోక్షసాధన మార్గం
శమీక మహర్షి కుమారుడు శృంగి శాప కారణంగా తన ఆయుష్షు ఇంకా ఏడురోజులు మాత్రమే మిగిలి ఉందని తెలుసుకున్నాడు పరీక్షిన్మహారాజు. వెంటనే శుకమహర్షిని రప్పించి, భాగవత పురాణాన్ని వినడం ప్రారంభించాడు. శుకుడు ఎంతో మధురంగా శ్లోకాలను గానం చేస్తూ పరీక్షిత్తుకు పురాణ గాథలు వినిపిస్తూ, అందులో ఖట్వాంగుని ఉదంతాన్ని ఇలా వివరించాడు. పూర్వం ఖట్వాంగుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన మహాబల సంపన్నుడు, శక్తిసామర్థ్యాలు కలవాడు కావడంతో ఒంటిచేత్తో సప్తద్వీపాలను పరిపాలించేవాడు. ఇది ఇలా ఉండగా అప్పటి భీకర యుద్ధాలలో దానవుల ధాటికి దేవతలు ఆగలేకపోతున్నారు. దాంతో ఇంద్రాది ప్రముఖులు ఖట్వాంగుడిని యుద్ధంలో సాయం రమ్మని పిలిచారు.ఖట్వాంగుడు గొప్ప పరాక్రమం కలవాడు కావడంతో చండప్రచండంగా విజృంభించి దానవులను అందరినీ అవలీలగా వధించి, దేవతలందరికీ ఊరట కలిగించాడు. అతని సాయానికి మెచ్చిన దేవతలు ఏదైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు ఖట్వాంగుడు చేతులు జోడించి ‘మహాత్ములారా, నేను ఇంకెంతకాలం బతుకుతాను?’ అని అడిగాడు.దానికి దేవతలు ఎంతో విచారపడుతూ ‘ఏమని చెప్పమంటావు ఖట్వాంగా! ఇంకో ముహూర్త కాలం మాత్రమే నీ ఆయుర్దాయం ఉన్నది’ అని చెప్పారు. అందుకు ఖట్వాంగుడు ఏమాత్రం దిగులు పడకపోగా, ఇంకో ముహూర్తం కాలం పాటు తన జీవితం మిగిలి ఉన్నందుకు ఎంతో సంతోషించాడు. వెంటనే భూలోకం వచ్చి తనకున్న సకల సంపదలను దానం చేశాడు. పుత్ర మిత్రాది బంధాలు, భయాలు విడిచిపెట్టి, శ్రీహరిని సేవిస్తూ మోక్షం పొందాడు. ఈ కథ చెప్పిన శుక మహర్షి, పరీక్షిత్తుతో ‘‘రాజా నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను విను. ఎంతటి సిద్ధులు పొందినవారైనా, దేవతలైనా సరే మోక్షాన్ని ఇవ్వలేరు. మోక్షాన్ని తనంతట తనే సంపాదించాల్సిందే. ఎందుకంటే, మోక్షం సాధించాలంటే ముందుగా సంసార బంధాలను, భయాన్ని వదలాలి. పరిపూర్ణంగా విష్ణుభక్తి కలిగి ఉండాలి. మరో విషయం ఏమిటంటే, మోక్షసాధన స్వర్గంలో సాధ్యం కాదు, భూలోకంలోనే సాధన చేయాలి’’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న పరీక్షిత్తు... వైరాగ్యం పొంది, వెంటనే తన కుమారుని పిలిచి, రాజ్యపాలన పగ్గాలు అప్పగించి, తాను విష్ణుభక్తి పరాయణుడై నిశ్చింతగా ఉన్నాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
అభయ ప్రదాత
కలియుగంలో పెళ్లి కోసం అప్పు చేసిన మొదటివాడు శ్రీనివాసుడేనట. ఈ విషయం మనకు శ్రీ శ్రీనివాస కల్యాణమనే గ్రంథమే చెబుతోంది. పద్మావతీ అమ్మవారిని పెళ్లాడడానికి తన దగ్గర డబ్బులేకపోవడంతో స్వామివారు కుబేరుడి దగ్గర అప్పు చేశారట. కల్యాణం అనంతరం తన దేవేరితో కలిసి తిరుమలకు వెళుతూ, మార్గమధ్యంలో అప్పలాయగుంట వద్ద ఉన్న వేముల పర్వతంపై తపస్సు చేస్తున్న సిద్ధేశ్వర మహర్షి భక్తికి మెచ్చి ఆయనను అనుగ్రహించేందుకు ఆయన వద్దకు వచ్చాడట. తన స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి అప్పు చేసినట్లు మహర్షికి తెలియడంతో ఆయన స్వామివారిని ‘అప్పులాయన’ అని సంబోధిస్తూ, తనను అనుగ్రహించినందుకు గుర్తుగా ఇక్కడే ఉండిపొమ్మని కోరుకున్నాడట. ఆ మహర్షికి అభయమిచ్చిన చోటే వేంకటేశ్వరుడు వెలిశాడట. అక్కడ నీటికుంట ఉండడంతో అప్పులాయనకుంటగా పేరొచ్చిందని కూడా చెబుతారు. నాటి అప్పులాయన కుంటనే నేడు అప్పలాయగుంటగా పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని టీటీడీ ధార్మిక సంస్థ నిర్వహిస్తోంది. తిరుమలకే ఎందుకు వెళ్లారు...? వేంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఎక్కడ ఉండాలనే విషయంపై చర్చ జరిగింది. అప్పుడు అమ్మవారి తండ్రి ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి తిరుమల కొండపై ఒక కుటీరం ఏర్పాటు చేశారని, అందువల్ల స్వామివారు అక్కడ కొలువై ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. ఆరునెలలు అగస్త్యేశ్వరుని అతిథిగా.. పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత స్వామివారు కాలినడకన తిరుమలకు వెళ్తుండగా మధ్యలో శ్రీనివాసమంగాపురం దగ్గర తొండాపురంలో అగస్త్యేశ్వర స్వామి మందిరానికి వెళ్తాడు. అప్పుడు అగస్త్యేశ్వరుడు వెంకన్న–పద్మావతి దంపతులకు ‘తిరుమలలో 33 కోట్ల మంది రుషులు తపస్సు చేస్తున్నారు. అందువల్ల మీరు ఆర్నెల్లపాటు ఇక్కడే ఉండాలి’ అని చెబుతాడు. దీంతో స్వామి, అమ్మవారు అగస్త్యేశ్వరుడి మందిరంలో ఆర్నెల్లపాటు అతిథులుగా ఉన్నారని చరిత్ర. తదనంతర కాలంలో ఆ కుటీరం వకుళామాత కుటీరంగా పిలువబడుతోంది. ఆలయానికి విజయనగర రాజుల బహుమానం... నాటి విజయనగర రాజ్యస్థాపకులు అప్పలాయగుంట వేంకటేశ్వరుని ఆలయానికి కొన్ని దీపపు స్తంభాలను బహూకరించినట్లు ప్రతీతి. అప్పటి నుంచి ఇప్పటివరకు స్వామివారి సేవలకు ఆ దీపపుస్తంభాలనే వాడుతున్నారు. దీనికితోడు స్వామివారి ఆలయానికి తూర్పుముఖంగా అభయాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. తిరుమలలో లాగే పూజా కైంకర్యాలు.. తిరుమలలో జరిగే నిత్యకైంకర్యాలు, ప్రతి వైఖానస పూజా కార్యక్రమం, అన్ని సేవలు, బ్రహ్మోత్సవాలను కూడా టీటీడీ ఆధ్వర్యంలో అప్పలాయగుంటలో జరుగుతాయి. స్వామివారికి శనివారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ఊంజల్‌సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోరు.. తిరుమల కొండపై వేలాదిమంది పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం పెళ్లిళ్లు చేసుకోరు. చేసుకోవడానికి భక్తులు కూడా ఆసక్తి చూపరు. ఎలా వెళ్లాలంటే.. తిరుపతి బస్టాండులో అప్పలాయగుంటకు వెళ్లే బస్సులు ఉన్నాయి. ఆ బస్సు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపం మీదుగా అప్పలాయగుంటకు చేరుకుంటుంది. అలాగే చెన్నై నుంచి వచ్చే భక్తులు పుత్తూరు మండలం సరిహద్దులోని తడుకు ఆర్ఎస్ గ్రామం జాతీయరహదారి నుంచి ఎడమవైపునకు వెళ్తే అప్పలాయగుంట వస్తుంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే ప్రతి బస్సు వడమాలపేట మీదుగా వెళ్తుంది. వడమాలపేట నుంచి ఆటోలో వెళ్లొచ్చు. లేదంటే తడుకు ఆర్ఎస్ గ్రామం వద్ద దిగి అక్కడి నుంచి కూడా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు. ఇక్కడి స్వామివారి గొప్పతనం తిరుమల కంటే ముందే వేంకటేశ్వరుడు అభయహస్తంతో వెలిశారు గనుక ఇక్కడికి వచ్చే భక్తులంతా తమను అప్పుల బాధ నుంచి విముక్తుల్ని చేయాలని వేడుకుంటారు. కొన్నివారాల పాటు అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తిరుమలలో వేంకటేశ్వరుడు భక్తుల నుంచి కానుకలు తీసుకుంటాడని, కానీ అప్పలాయగుంట వేంకటేశ్వరుడు మాత్రం భక్తులకు అభయమిస్తాడని నమ్మకం. తిరుమలలో స్వామివారి హస్తం కిందకు ఉంటే.. అప్పలాయగుంటలో స్వామి చేతివేళ్ళు పైకి ఉంటాయి. అందుకే అభయహస్తం వేంకటేశ్వరుడిగా కీర్తింపబడుతున్నారు. – జి.బసవేశ్వరరెడ్డి, సాక్షి, తిరుపతి -
కంపెనీ సీఈఓగా...!
అమెరికాలో ‘మహర్షి’ ప్రయాణం మొదలవ్వడానికి టైమ్ దగ్గర పడుతోంది. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ కనిపిస్తారు. మహేశ్‌కు తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. అమెరికాలో జరగనున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల 15న స్టార్ట్ అవుతుందని సమాచారం. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇందులో మహేశ్‌బాబు స్టూడెంట్‌గా నటిస్తున్నారని ‘మహర్షి’ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కానీ మహేశ్ క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయని... ఒక షేడ్‌లో స్టూడెంట్‌గా కనిపించే మహేశ్ మరో షేడ్‌లో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాలనే అమెరికాలో తీయబోతున్నారట ‘మహర్షి’ టీమ్. అలాగే రెండు సాంగ్స్‌ను కూడా ఈ షెడ్యూల్లోనే కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ‘మహర్షి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హాలిడే కోసం మలేసియాలో ఉన్న సంగతి తెలిసిందే. -
భానూదయాన.. చంద్రోదయాలు
చిత్రం: మహర్షి రచన: నాయని కృష్ణమూర్తి గానం: బాలు, జానకి సంగీతం: ఇళయరాజా ‘మహర్షి’ సినిమాలోని ఈ పాట నేపథ్యం ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. ఈ చిత్రంలో కొత్తవారితో ఒక పాట రాయించాలనుకున్నాను. అలా ‘సుమం ప్రతి సుమం సుమం...’ పాటతో నాయని కృష్ణమూర్తి కొత్త రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. మదురైలోని హోటల్ తమిళనాడులో కూర్చుని కంపోజ్ చేస్తే హిట్ అవుతుందని ఇళయరాజాకి ఒక సెంటిమెంట్ ఉంది. ఆయన అక్కడ కూర్చుని ట్యూన్ చేసి ఇచ్చారు. ఆ ట్యూన్‌ను నాయని కృష్ణమూర్తికి ఇచ్చి పాట రాయమన్నాను. ఆయన వారం రోజుల పాటు కష్టపడి పాట రాశారు. పాట పాడించడానికి ఎస్ పి బాలు, ఎస్. జానకిలను రప్పించాం. పాడటానికి వస్తున్న సమయంలో, ఇళయరాజా ఆ పాట ట్యూన్ మళ్లీ విని, ‘ఇది నాకు నచ్చలేదు’ అని మళ్లీ కొత్త ట్యూన్ కట్టారు. ఈలోగా గాయకులు వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మళ్లీ నాయని కృష్ణమూర్తిని రప్పించి, కొత్త ట్యూన్‌కి పాట రాయమని అడిగాను. ముందుగా పల్లవి రాసి ఇచ్చారు. పల్లవి రికార్డింగు అవుతుండగా చరణం రాశారు. ఇలా మొత్తం పాటను గంటలో రాసి ఇచ్చారు. మరో విషయం ఏంటంటే... ఈ పాట సోలోకి అనువుగా కంపోజ్ చేశారు ఇళయరాజా. అప్పటికే ఎస్. జానకి వచ్చేయడంతో, ఆ పాటలో ఆవిడ చేత హమ్ చేయించాం. పాట కోసం చాలా కష్టపడ్డాం. ఇలా ఆ పాట పుట్టింది.‘సుమం ప్రతి సుమం సుమం’ అంటూ అందమైన పదాల పూలతో అల్లుకున్న పందిరి ఈ పాట. సువాసనలు వెదజల్లే కుసుమాల వంటి పదాలతో అల్లిన మాలిక ఈ పాట. భావకవిత్వ పలుకులతో గుది గుచ్చిన పుష్పగుచ్ఛం ఈ పాట. కథానాయికను ఊహించుకుంటూ కథానాయకుడు చేసిన భావ ప్రకటనే ఈ పాట. కవి భావన హృద్యంగా ఉంటుంది. ‘భానూదయాన... చంద్రోదయాలు....’ తన కలల కథానాయికను చూడగానే సూర్యోదయ సమయాన చంద్రోదయం అయినట్లు భావిస్తాడు ప్రియుడు. ఆమె గొంతు విప్పి గానం చేస్తుంటే, అది వేణు నాదమో, వీణా నాదమో తెలియనంత సుస్వరంగా ఉంది ఆమె కంఠం అని ప్రస్తుతిస్తాడు. ప్రేమలో పడినవారికి... తమ ప్రియురాలిని తలచుకుంటే హృదయమంతా ఆనంద తరంగితమవుతుంది. ప్రేమ మహిమ అంటే ఇదేనేమో. ప్రపంచమంతా అందంగా అనిపిస్తుంది. ఆకాశమంతా తెల్లగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రంగురంగుల ఆకాశాన్ని ఊహిస్తాడు. ఆమెను ప్రణయరాగ దేవతగా, చెలియ ప్రణయాన్ని అందుకోవడం ఒక వరంగా భావిస్తాడు ప్రేమికుడు. తన మనసులో ప్రేయసిని ఊహించుకుంటూ కలిగే సౌఖ్యం... స్థిరంగా, మధురంగా ఉంటుందనుకుంటాడు. తన మనసంతా ప్రేమమయంగా ఊహల్లో విహరిస్తాడు. ప్రపంచమంతా ప్రణయ కలహాలు కూడా ఉంటాయనుకుంటాడు. ఈ పాటలో హృదంతరం, సురతం, రాగోల్లసాలు... వంటి మంచి మంచి పదాలను ఉపయోగించారు రచయిత. ఒక ప్రేమికుడి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన పాట ఇది. ఈ పాట ఒక కొత్త రచయిత రాసిన భావన కలగదు. అప్పటికే ఎన్నో సినీ గీతాలు రచించిన అనుభవజ్ఞుడిలా రాశారు రచయిత నాయని కృష్ణమూర్తి. – వైజయంతి -
సజ్జన సాంగత్యం
ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుడిని తనతో రమ్మన్నాడు. ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో ‘‘ఓ మహర్షీ! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే, ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తథ్యం. అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి’’ అన్నాడు.ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి ‘‘అటువంటిదే గనక జరిగితే నేను నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను’’ అన్నాడు.ఆదిశేషుడు అందుకు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయాడు. ఆదిశేషుడు భయపడి చేసేది లేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.అంతలొనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఆదిశేషుని వేయిపడగలపై భద్రంగా వున్న భూగోళం వెంటనే పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి. జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మాన్పడిపోగా, తప్పశ్శక్తి సంపన్నుడనన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలంలోని నీరు ధారపోసి ‘ఆగు’ అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భూగోళ పతనం ఆగకపోగా, మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో ‘‘నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను, వెంటనే ఆగు’’ అంటూ ఆజ్ఞాపించాడు. అయినా ఫలితం లేకపోయింది.దాంతో విశ్వామిత్రునికి అహంకార మైకం తొలగిపోయింది. భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని ‘‘నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి వుంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపోయి. భూపతనం ఆగిపోతుంది’’ అని చెప్పాడు.విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు. తాను అందరితో తగవులు పెట్టుకోవడమే కాని సజ్జన సాంగత్యం చేసింది లేదు. సాటి ముని పుంగవులతోనూ తగవులే. సత్సంగం చేసింది లేదు. అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధారపోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆదిశేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తలకు ఎత్తుకున్నాడు.మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం. సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆజానుబాహుబలి
హ్యూమర్ ఫ్లస్ ఆయన పేరు ఆజానుబాహుబలి. ఒకరోజు షవర్ కింద స్నానం చేస్తూ వుండగా ‘‘నేనెవర్ని?’’ అని అనుమానమొచ్చింది. నడుంకి టవల్ బిగించి బయటికొచ్చి ‘‘నేనెవర్ని?’’ అని అరిచాడు.‘‘ఇంట్లో కుక్వి, గెస్ట్లొస్తే చెఫ్‌వి. స్టయిల్‌గా చెప్పాలంటే బట్లర్వి, మోటుగా వంటాడివి’’ అని విడమరిచి చెప్పింది భార్య. ‘‘ఇంతకీ నేను ఇంటోడినా? వంటోడినా?’’ ‘‘అదంతా చెప్పాలంటే మీ నాన్న అమరేంద్ర నరబలి దగ్గరుంచి మొదలుపెట్టాలి. చాలా పెద్ద కథ. రెండు పార్టులుగా చెప్పాల్సి వుంటుంది. వెళ్లి బట్టలేసుకురా. లేదంటే ఆవేశంలో నరాలు పొంగి తువ్వాలు ఊడిపోవచ్చు.’’ కథ మొదలైంది. ‘‘ఎవరి పేరు చెబితే జనం కకావికలమవుతారో, ఎవరి వంట తింటే కంట కన్నీరు ఒలుకుతుందో ఆయనే అమరేంద్ర. ఆయన వండితే సగంమంది పైకి, మిగిలిన సగం ఆస్పత్రికి వెళ్ళేవాళ్ళు. దాంతో అందరూ అమరేంద్ర నరబలి అని పిలిచేవాళ్ళు. నిజానికి వంట ఆయన ఇంటావంటా లేదు. మీ అమ్మని చేసుకున్న తరువాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన వంట తిన్న మీ అమ్మ జడుసుకుని భర్త వండింది తినకుండా ఉండడానికి సేఫ్టీకోసం తనను తాను గొలుసులతో బంధించుకుంది. ఇదిలావుండగా అకాలకేయుడు అనే ఆటవిక నాయకుడికి మీ నాన్న విషయం తెలిసింది. మనుషుల్ని సింగిల్ సింగిల్‌గా చంపడంకంటే ఒక మెస్సు పెట్టి మాస్‌గా చంపాలని పథకమేసి సైన్యంతో సహా వచ్చాడు. మీ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి ‘క్కిట్టమ్మప్ప, బ్రాష్కో, ట్టగ్గర్ర’ అని ప్రతి పదానికి ఒత్తునిచ్చే భాషలో మాట్లాడి లొట్టలేశాడు. మీ నాన్న ఒత్తులు, కత్తులకి లొంగేవాడు కాదు. వాడి భాష అర్థం కాకపోయినా లొట్టలేసింది తన వంటకోసమేనని అపార్థం చేసుకుని వండి వడ్డించాడు. సైన్యం అప్పుడే పోగా, అకాలకేయుడు డయేరియాతో వాడి పాపాన వాడే పోయాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా నువ్వు పుట్టావు. నీ క్షేమం కోసం మీ నాయనమ్మ చంటి బిడ్డతో నదిని దాటాలనుకుంది. అయితే నదిలో నీళ్ళు లేవు. ఖర్మగాలి కాళ్ళు కాలాయి. నిన్నో గూడెం వాళ్ళకి ఇచ్చి నీడకోసం ఆమె ఎక్కడికో పారిపోయి మళ్ళీ రాలేదు’’ అని ఆమె కథ ముగించింది. ‘‘అయితే ఇప్పుడు మా నాన్న ఎక్కడ?’’ ‘‘లేడు. వెళ్ళిపోయాడు పైకి’’ ‘‘కత్తికి లొంగడన్నావు. బల్లెం భయపెట్టదన్నావు.’’ ‘‘కత్తిపోటు, బల్లెంపోటు కంటే సాపాటు ప్రమాదకరమైంది. నేనే నా చేతులతో పళ్ళెంలో వడ్డించాను.’’ ‘‘ఎందుకని?’’ తల విదిలించి ఆవేశంగా అరిచాడు ఆజానుబాహుబలి. ‘‘నాకు మాత్రమేం తెలుసు? సెకెండ్ పార్ట్‌లో చెబుతా.’’ - జి.ఆర్. మహర్షి -
భలేవాడివి బోసూ!
‘మహర్షి’లో హీరోలాంటి వేషం... ‘ఏప్రిల్ 1 విడుదల’లో విలన్ పాత్ర...ఈ రెండింటితో ఎంటరైన కృష్ణభగవాన్లోని సరికొత్త కామెడీ యాంగిల్‌ని పరిచయం చేసింది మాత్రం ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’. ఆ సినిమాలో ఆయన వినోదాన్నీ, వెటకారాన్నీ అందరూ ఇష్టపడ్డారు. ఇక కృష్ణభగవాన్‌ని ‘పీక్’కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది మాత్రం ‘కబడ్డీ... కబడ్డీ’. నిజంగానే ఈ సినిమాతో కామెడీతో కబడ్డీ ఆడేశాడీ కృష్ణభగవానుడు. అన్నట్టు నేడు ఆయన పుట్టిన రోజు కూడా. పల్లెటూళ్లల్లో ఆంబోతులకి అచ్చేసి వదిలేస్తారు. అవి ఏం చేసినా అడిగే నాథుడుండడు. అచ్చోసిన ఆంబోతు కాబట్టి జనాలు కూడా ముందే అలర్టైపోతారు. ఎంకన్నపాలెంలో బోసుబాబు కూడా సేమ్ టూ సేమ్. ఆంబోతుకు మీసాలూ గడ్డాలూ ఉండవు. ఈ బోసుబాబుకుంటాయ్. అంతే తేడా! బోసుబాబు నోట్లో ఎవ్వరూ నోరెట్టరు. నోటి వాసన వల్ల కాదు... నోటి దూల వల్ల! బోసు వేసేది ప్యాంటూ చొక్కానే అయినా, పంచ్‌లు మాత్రం తెగ ఏసేస్తుంటాడు. ఎదుటోణ్ణి ఎర్రివెధవను చేయాలంటే ఆడి తర్వాతే ఎవరైనా. వట్టి కబుర్ల పోగు. ఎవణ్ణి ఎక్కడ, ఎలా వాడుకోవాలో బాగా తెలిసినోడు. ఎదుటోడి వీక్‌నెస్సే... ఈడికి ప్లస్ పాయింట్. ఈ బోస్ - చిరంజీవిలాగా మెగాస్టార్ అయిపోవాలనో... ఐశ్వర్యారాయ్‌ని పెళ్లాడేయాలనో... లాటరీలో యూరోలు కొట్టే యాలనో పగటి కలలు కనడు. ఇతగాడికి ఉన్నది ఒకే ఒక్క... సింగిల్... ఏక్హీ... కోరిక. దుబాయెళ్లి బాగా డబ్బులు సంపా దించేసి ‘దుబాయ్ బోస్’ అనిపించుకోవాలి. అందుకోసమే ఈ నానాగడ్డీ కరిచేది. గడ్డి అంటే ఊరి చివరున్న గడ్డిమేటు గుర్తొచ్చింది - ఓసారటు లుక్కేస్తే మన బోసుబాబుగాడి చిందులు సెవెన్టీ ఎమ్ఎమ్లో తిలకించేయొచ్చును. ప్రెసిడెంటు రామారావు... బక్కపలచ కృష్ణారావు... జులపాల జుట్టు ఆంజనేయులు... బోసుబాబుకు బాసులాంటి రాంబాబు... ఎట్సెట్రా... చెమటలు కక్కుకుంటూ గేమాడేస్తున్నారు. గేమంటే... క్రికెట్టో, కబడ్డీనో, ఇంకేదోనో అనుకునేరు. ఒళ్లు అలవకుండా ఎంచక్కా సుఖాసనంలో కూర్చుని ఆడే సుఖవంతమైన గేమ్ ఈ ప్రపంచంలో ఒకటే ఉంది. ఎవడు డ్రాప్ అయితే మైండ్ బ్లాక్ అయ్యి, జేబు నిల్లవుతుందో ఆ గేమే... పేకాట. ఫేట్లు మార్చే ఫేక్ గేమ్. వీళ్లందరూ ఈ బిజీలో ఉన్న సమయంలో శీనుగాడని పక్క ఊరి కుర్రాడొచ్చి రాంబాబును పక్కకు తీసుకెళ్లాడు. ‘‘నేనో అమ్మాయిని లవ్వాడేశాను... నువ్వే కలపాల్రా’’ అని తెగ రిక్వెస్టింగ్ చేసేశాడు. రాంబాబు వెంటనే బోసును పిలిచాడు. ‘‘మనమేదీ ఫ్రీగా చేయం కదా’’ అన్నాడు బోసు, సంకలో క్యాష్‌బ్యాగ్ సర్దుకుంటూ. ‘‘ఎంతవుద్దేంటి?’’ అనడిగాడు శీనుగాడు. బోసు టకాటకా బ్యాగులోని కేలిక్యులేటర్ తీసేసి ఏవో లెక్కలేసి, ఓ పది రూపాయలు శీనుగాడి చేతిలో పెట్టాడు. శీనుగాడు అయోమయపడిపోయాడు. ‘‘మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది అవుద్ది... ఆ బ్యాలన్స్ పదీ ఇచ్చాను. నువ్వు మాకు పదివేలు కొట్టు’’ అని క్లారిటీ ఇచ్చేశాడు. కట్ చేస్తే... బోసు, రాంబాబు, శీనుగాడు... ఆ అమ్మాయి పెళ్లిచూపుల ప్లేస్‌లో ఉన్నారు. ‘‘మా శీనుగాడు ఉండగా మీ చెల్లికి ఇంకో అబ్బాయితో పెళ్లెలా చేస్తావ్?’’ అని రాంబాబు, ఆ అమ్మాయి అన్నయ్యతో గొడవకు దిగాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. ‘‘రామాయణమంతా విని భీమునికి సీత ఏమ వుద్దన్న ట్టుంది నీ వాలకం... మావాడు నీ చెల్లిని ప్రేమించాడు. అందరిలాగే ఈ ప్రేమికులను విడదీయాలని చూస్తే నేను ఇంద్రసేనారెడ్డినైపోతా’’ అంటూ బోసు తొడగొట్టాడు. తీరా చూస్తే, ఆ అమ్మాయి శీనుగాడెవడో తెలియదని చెప్పింది. ‘‘ఆ అమ్మాయిని నేను ప్రేమించానని చెప్పాను కానీ, తను నన్ను ప్రేమించిందని చెప్పలేదు కదా’’ అని శీనుగాడు జంప్. రాంబాబు కూడా జంప్. ఫైనల్‌గా బోసును కుమ్మి కుమ్మి వదిలారు వాళ్లు. ప్రెసిడెంట్ రామారావుకూ, బక్కపలచ కృష్ణారావు భార్య రాణికీ కనెక్షనుంది. కనెక్షనంటే... కేబుల్ కనెక్షననుకునేరు. బెడ్ కనెక్షన్. అది ఎవడి కంట్లో పడితే యాగీ అవుతుందో, వాడి కంట్లోనే పడింది. రామారావు, రాణి మాంచి ఇదిలో ఉండగా, కిటికీ చప్పుడు చేసి మరీ పళ్లికిలిస్తూ నిలబడ్డాడు బోసు. ‘‘నేనేం చూడలేదు... నువ్వూ చూడలేదు... ఆల్ ది బెస్ట్...’’ అంటూ చక్కాపోయాడు. వెళ్లడం వెళ్లడం పేకాటలో మంచి మూడ్‌లో ఉన్న కృష్ణారావు దగ్గరకెళ్లాడు. ‘‘ఇక్కడ నువ్వేమో పేకాట ఆడుతున్నావ్. అక్కడ ఆడేమో నీ...’’ అని ఆపేశాడు బోసు. ‘‘ఏంటెహే..! నీ గోల’’ అని కసురుకున్నాడు కృష్ణారావు. ‘‘నీకో ‘నగ్న’ సత్యం చూపిస్తా... పద’’ అంటూ కృష్ణారావును తీసుకుని బయలుదేరాడు బోసు. ఎదురుగా పంచె ఎగ్గట్టుకుని కంగారుపడుతూ వచ్చాడు ప్రెసిడెంట్. బోసును పక్కకు లాక్కెళ్లి బతిమిలాడుకున్నాడు. ‘‘నువ్వు చిన్న పిల్లాడివిరా! ఇలాంటివి చూసీ చూడనట్టు వదిలెయ్యాలి’’ అని బుజ్జగించాడు. బోసు బుర్ర షార్ప్‌గా పనిచేసింది. ‘‘అయితే నేను చిన్న పిల్లాణ్ణి. చాక్లెట్లు కొనుక్కుంటాను. ఓ అయిదొందలు కొట్టు. నాకు చాక్లెట్లు కావాల్సినప్పుడల్లా ఇలానే ఇస్తుండాలి’’ అని గారం లాంటి దౌర్జన్యంతో డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు బోస్. ప్రెసిడెంట్ తల పట్టుకున్నాడు. చూశారుగా! మన బోసుగాడి వెధవ్వేషాలు. చీమ దూరే సందిస్తే చాలు డైనోసార్‌ను పెట్టేస్తాడు. రాంబాబు అండ్ కో కలిసి ఊళ్లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ అనే మూకీ డ్రామా ప్లాన్ చేస్తారు. ఇక్కడ కూడా బోసు తన బుద్ధి పోనిచ్చుకోడు. ‘‘జనాలు ఎగబడి వస్తారు... నీకు డబ్బులే డబ్బులు’’ అంటూ అరచేతిలో స్వర్గం చూపించి, ఒకడికి టీ అమ్ముకోడానికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. ఇంకా ఇదేం చూశారు..? ఒకతను భార్య గోల పడలేక గోదాట్లో దూకి చావడానికి సిద్ధపడ్డాడు. ఎంటర్ ది బోసుబాబు! ‘‘నీకెందుకు నేనో అవుడియా చెప్తా. ఫుల్ పైసలు... ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ...’’ అన్నాడు. అలా అతగాణ్ణి ‘బాచి బాబా’ను చేసేశాడు. జనం తండోపతండాలుగా వస్తున్నారు. హుండీ నిండిపోయింది. కానీ... లాస్ట్‌మినిట్‌లో ‘బాచి బాబా’ మాయం... హుండీ కూడా మాయం. నెత్తి మీద చెంగేసుకుని బోసు ఒకటే ఏడుపు. ఎంత ఎదవైనా బోసు... ఫ్రెండ్షిప్కి ప్రాణమిస్తాడు. బెస్టుఫ్రెండు రాంబాబు, కావేరి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక్కడ ట్విస్టు ఏంటంటే... ఆ అమ్మాయి సొంతం కావాలంటే సఖినేటిపల్లి టీమ్‌తో కబడ్డీ ఆడి గెలవాలి. అది మామూలు టీమ్ కాదు... ఇప్పటికి వరుసగా 99 మ్యాచ్‌లు గెలిచింది. రాంబాబు టీమ్‌లో కబడ్డీ ఆడడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. భయపెట్టి... బుజ్జగించి... బ్లాక్మెయిల్ చేసి... వైట్ మెయిల్ చేసి... మొత్తానికి బోసుగాడు కబడ్డీ టీమ్‌ని సెట్ చేసిపెట్టాడు. ఆ రోజు సఖినేటిపల్లి టీమ్కీ, ఎంకన్నపాలెం టీమ్కీ కబడ్డీ మ్యాచ్. వాళ్లు గెలిస్తే సెంచరీ పూర్తి. వీళ్లు గెలిస్తే రాంబాబుకి కావేరి సొంతం. ఇది తెలిసి చుట్టుపక్కల ఊళ్లోవాళ్లంతా ఎగబడ్డారు. దీన్ని కూడా క్యాష్ చేసేసుకున్నాడు బోసు. కిస్మత్ బీడీ కంపెనీతో డీలింగ్ కుదిర్చేసుకుని స్పాన్సరింగ్ హక్కులిచ్చేశాడు. మొత్తానికి చచ్చీ చెడీ... రాంబాబు టీమ్ ఘనవిజయం సాధించింది. కావేరి మెళ్లో రాంబాబు మూడు ముళ్లేసేశాడు. మరి దీనికి కర్త-కర్మ-క్రియ అయిన బోసుబాబు ఏం చేస్తున్నట్టు? బోసుబాబు ఏదైనా చేయగలడు! పబ్లిగ్గానే కాదు... ప్రైవేట్‌గానే నీళ్లల్లో పాలు కలపగలిగినవాడు... ఎన్నో ‘నగ్న’ సత్యాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచినవాడు...సెంటీమీటరంత సెంటిమెంట్‌తో పాటు కిలోమీటరంత కమర్షియాల్టీ ఉన్నవాడూ... అయిన మన బోసుబాబుకు దుబాయ్ వెళ్లడం ఓ లెక్కా? తొక్క కాకపోతే! - పులగం చిన్నారాయణ నా ఎటకారానికి తగ్గ పాత్ర దొరికింది..! ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. మా వాళ్లకి కొంచెం ఎటకారం ఎక్కువని ప్రతీతి. నేను కూడా ఆ జాబితానే. నా ఎటకారానికి తగ్గట్టే, మంచి ఎటకారమున్న బోసు పాత్ర దొరికింది. ఇంకేముంది... రెచ్చిపోయాను. ఈ పాత్ర గురించి దర్శకుడు వెంకీ చెప్పగానే చాలా ఈజీగా కనెక్టయిపోయాను. మా ఊళ్లో నాకున్న ఎక్స్పీరియెన్సులు, ఎటకారం పనులూ అన్నీ దర్శక, రచయితలకు చెబితే, వాళ్లు ఇంప్రెస్ అయిపోయి ఇందులో పెట్టేశారు. జీవా పాత్ర దున్నపోతు దగ్గర పాలు పితకడం, ట్రాక్టర్ సీన్... ఇవన్నీ నేను చెప్పినవే. షూటింగ్ టైమ్‌లోనే ఈ సినిమా హిట్టయిపోద్దని నాకు తెలిసిపోయింది. జగపతిబాబులాంటి పెద్ద హీరోకి ఫ్రెండ్‌గా చేయడం నాకు మంచి బ్రేక్. మా గోదావరి యాసతోనే ఈ సినిమా అంతా మాట్లాడేశా. అదే ప్రేక్షకులకు నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయిపోయాను. థ్యాంక్స్ టూ బోస్‌బాబు’’. - కృష్ణ భగవాన్ హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: కబడ్డీ... కబడ్డీ (2003) డెరైక్ట్ చేసింది: వెంకీ సినిమా తీసింది: వల్లూరిపల్లి రమేశ్ మాటలు రాసింది: వేగేశ్న సతీశ్ -
సంస్థానాధీశుల శివాలు..
రాజులు, మహారాజులంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మన తాతాతండ్రుల్ని గోచీగుడ్డలతోనైనా బతకనిచ్చారు కాబట్టి. స్వాతంత్య్రం వచ్చే నాటికి మనదేశంలో వందలకొద్దీ సంస్థానాధీశులుండేవాళ్ళు. వాళ్ళు విందులు వినోదాల్లో మునిగితేలుతూ ఎప్పుడైనా బ్రేక్‌టైంలో ప్రజల్ని గురించి ఆలోచించేవాళ్ళు. దివాన్ జర్మణి దాస్ అనే ఆయన పాటియాలా, కపుర్తలా సంస్థానాల్లో మంత్రిగా పని చేసి వాళ్ళను జాగ్రత్తగా గమనించి ‘మహారాజా’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన వ్యాసాల్లో రాస్తే, చలసాని ప్రసాదరావు కథలుగా మార్చి అనువాదం చేశారు. 1977లో ఈ పుస్తకం వచ్చింది. ఇటీవల అనంతపురం పుట్‌పాత్‌పై దొరికింది. తెలుగు పాఠకులు మంచివాళ్ళు. మంచి పుస్తకాలను తూకానికి వేస్తారు. ఈ రాజులబూజులో ఏముందంటే... జునాగడ్ రాజావారైన రసూల్ఖాన్కి కుక్కలంటే ఇష్టం. కేవలం తొమ్మిది వందల కుక్కలను మాత్రమే పెంచేవాడు. వాటిలో రోషనార అనే కుక్కకు ఆయన పెళ్ళి చేయాలనుకున్నాడు. వరుడేమో మంగ్రోల్ రాజావారి కుక్క, దాని పేరు బాబీ. వరుడు రైలు దిగిన వెంటనే గౌరవార్ధం 101 సార్లు తుపాకులు పేల్చారు. 250 కుక్కల సమేతంగా స్వయంగా రాజావారే స్వాగతం పలికారు. పెళ్ళి కోసం మూడు రోజులు సెలవు ప్రకటించారు. 50 వేల మందికి భోజనాలు. పెళ్ళి కవరేజ్ కోసం వందలమంది ఫోటోగ్రాఫర్లు విలేకరులు వచ్చారు. ఇది చూసి ప్రేరణ పొందిన బోలెడంత మంది రాజావార్లు తమ కుక్కలకు కూడా ఇదే రీతిలో కళ్యాణం జరిపించారు. పాటియాలా రాజా యాదవేంద్రవారికి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాలని కోరిక. అది సాధ్యంకాదు కాబట్టి తన సైన్యాన్నే రెండుగా విభజించి సగం సైన్యానికి బ్రిటిష్ యూనిఫాం వేసి ఉత్తుత్తి యుద్ధం చేయించి చిత్తుగా ఓడించారు. భూపేంద్రసింగ్ రాజావారికి క్రికెట్ పిచ్చి. ఒకసారి ఆయన టీం ఇంగ్లండ్ టీంతో ఆడాల్సి వచ్చింది. బ్రిటిష్ ఆటగాళ్ళ చేతిలో ఎలాగూ ఓడిపోతామని తెలిసి ఆయన ఓ ఎత్తు వేశారు. బ్రిటిష్ ఆటగాళ్ళకు తానే ఆతిథ్యమిచ్చాడు. బ్రహ్మాండమైన కానుకలు, రుచికరమైన భోజనం, ఖరీదైన మద్యం, సుందరీమణుల నాట్యంలో ఆటగాళ్ళు రాత్రంతా అలసిపోయి తెల్లారేసరికి ఆటలో ఓడిపోయారు. మనవాళ్ళు రన్ చేయకుండా అవతలవాళ్ళను అవుట్ చేశారు. ఒక రాజావారికి పైజామా బొందు కట్టడానికి, లంగోటి ఎక్కించడానికి పర్మనెంట్ ఆఫీసర్ వుండేవారు. ఇంకొకాయనకు ఐదొందల మంది అంతఃపుర స్త్రీలుండేవారు. ఇలా చాలా విషయాలున్నాయి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే రాచరికాలు రద్దయ్యాక ఈ రాజుల్లో అనేకమంది ప్రభుత్వంలో మంత్రులుగా చేరిపోయారు. ఇప్పటికీ వీరి వారసులు అనేక మంది పార్లమెంట్లో కూచుని చట్టాలు చేస్తున్నారు. జనం గురించి పట్టించుకోకపోవడం వీళ్ళ నుంచి అంటువ్యాధులుగా మన నేతలకు కూడా సోకినట్టుంది.ఈ పుస్తకం ఇప్పుడు బుక్‌స్టాల్స్‌లో దొరికే అవకాశం లేదు. పాత పుస్తకాల షాపులో దొరికితే దొరకొచ్చు. వీలైతే దొరికించుకుని చదవండి. - జి.ఆర్. మహర్షి 9000226618 -
ఉగాది వ్యాఖ్యాత
హాస్యం ఉగాదికి కోయిల గొంతు సవరించుకున్నట్టు కవులు కూడా యాక్టివేట్ అవుతారు. కొత్తబట్టలు, వేపపూత పచ్చడి, పంచాంగ శ్రవణాలతో పాటు మనకు తగులుతారు. ఒక ఉగాది రోజున ఒక కవిమిత్రుడు బలంగా డీకొని, కవి సమ్మేళనానికి రమ్మని పిలిచాడు. నాకు కవిత్వం రాదని చెప్పాను. అదే అసలైన అర్హతని అన్నాడు. కవిత్వం వస్తుందని చెప్పేవాడికి ఏమీ రాదని, రాదని చెప్పేవాడే అసలు సిసలు కవని వాదించాడు. నేను కుయ్యోమొర్రోమని అరిచినా వినకుండా శాలువాలు అనవసరంగా మిగిలిపోతాయని లాక్కెళ్లాడు. అక్కడ కవులంతా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ఉన్నారు. ఒకాయన చేతికి కంకణాలు, వేలికి ఉంగరాలు ధరించి నడిచే నగల దుకాణంలా ఉన్నాడు. ‘అతడెవరు’ అని అడిగాను? ‘మనం చదివే కవిత్వానికి వ్యాఖ్యాత’ అన్నాడు. ‘అంటే’ అన్నాను. ‘మనం చదివేది మనం చదువుతాం ఆయనకు అర్థమయ్యింది ఆయన చెబుతాడు’ అన్నాడు. అందరూ కాగితాలు సర్దుకున్నారు. యాంకర్లాగా ఉన్న ఒకావిడ వచ్చి ‘ఇంతమంది కవులను చూస్తుంటే నాక్కూడా కవిత్వమొచ్చేస్తా ఉంది’ అని- ‘వారానికొకటే ఆదివారం సాంబా ఏడాదికి ఒకటే ఉగాది సాంబా’ కవిత చదివింది. ‘ఈ సాంబా ఎవరు మధ్యన’ అని కవిమిత్రుణ్ణి అడిగాను. ‘వేమన పద్యాలు వినుర వేమతో ముగిసినట్టు ఈమె ఏం మాట్లాడినా సాంబాతో ముగుస్తుంది. ఆయనెవరో తెలుసుకోడానికి ఒక యూనివర్సిటీలో పరిశోధన కూడా జరుగుతోంది’ అని చెప్పాడు. ‘ఈమెనే అడిగితే చెబుతుందిగా. మళ్లీ పరిశోధన ఎందుకు?’ ‘సులభంగా తెలిసేవాటిని కష్టంగా తెలుసుకోవడమే రీసెర్చి’ ఇంతలో ఒక కవి లేచి ‘తీపి తిన్నవాడు పాపి, ముక్కోపి చేతిలో తుపాకీ’... అంటూ ఏదో మొదలెట్టాడు. నాకేం అర్థం కాక కవిమిత్రుణ్ణి గిల్లాను. ‘కవిత్వాన్ని అనుభూతించాలి. అర్థాలు వెతక్కూడదు’ అన్నాడు. ఇంకొకాయన లేచి ‘నీ నిరీక్షణలో క్షణమొక యుగం మీనాక్షీ... నువ్వుంటే ప్రతిరోజూ ఉగాదే మీనాక్షీ’ అని అందుకున్నాడు. ‘మీనాక్షిని ఈయన ప్రేమించాడు. కానీ ఆమె ప్రేమించలేకపోయింది. ఇదీ కథ’ అడగకుండానే చెప్పాడు మిత్రుడు. ‘ఇప్పుడామె ఎక్కడుంది?’ అని అడిగాను. ‘ఈయన్ని ప్రేమించకపోవడం వల్ల ఇంకా జీవించే ఉంది’ అన్నాడు. ఆ తర్వాత నాకేం వినబడలేదు. ఎందుకంటే నా వంతు వచ్చేస్తుందేమోనని భయం పట్టుకుని కాళ్లు వణుకుతున్నాయి. ఎట్నుంచి నరుక్కొచ్చినా మన వంతు రాక తప్పదు కదా. ఏడుపు మొహంతో మిత్రుణ్ణి చూశాను. ‘నీ నోటికొచ్చింది చదువు’ అన్నాడు. మైక్ దగ్గరికెళ్లి ‘ఉదయాన్నే మా ఆవిడ నిద్రలేపింది’ అన్నాను. వ్యాఖ్యాత అందుకున్నాడు. ‘ఆహా... ఎంత అద్భుత కవితా వాక్యం. ఆడవాళ్లు తాము జాగృతం కావడమే గాక మగవాళ్లని కూడా తన్ని మరీ జాగృతం చేస్తున్నారు. ఇది కదా స్త్రీ చైతన్యానికి ప్రతీక’ అన్నాడు.అందరూ చప్పట్లు కొట్టారు. నాక్కొంచెం కిక్కెక్కింది. ‘మొహం కడుక్కుని అంగడికెళ్లాను’... ‘మొహం కడుక్కోవడం అంటే ఏంటంటే అర్థం... మనం రోజువారీ జీవిక కోసం రకరకాల వేషాలేస్తున్నాం. రంగులద్దుకుంటున్నాం. అందువల్ల ఉదయాన్నే పాతరంగులు తుడుచుకుని కొత్తరంగులు వేసుకోవడమే ఫేస్‌వాష్. ఇక అంగడి అంటే ఈ ప్రపంచమే ఒక అంగడిగా మారిపోయింది. అందరూ అన్నీ అమ్మేస్తున్నారు. కొనేస్తున్నారు. మనల్ని మనం అమ్ముకుని మళ్లీ కొత్తగా కొనుక్కోవడమే జీవితం. ఇది కవి హృదయం’ నా మాటలకి ఇంత అర్థముందని తెలిసి ఉబ్బితబ్బిబ్బయ్యాను. ‘అక్కడ సరుకులు కొన్నాను’ అని కంటిన్యూ చేశాను. ‘సరుకు అంటే ప్రపంచీకరణ. ప్రతి సరుకుకి విలువున్నట్టే అన్ని విలువలు సరుకులుగా మారిపోయాయి’ ‘ఇంటికొచ్చి ఉగాది పచ్చడి తిన్నాను’ ‘ఇక్కడ ఇల్లు అంటే గమ్యం. మనం ఎట్నుంచి ఎటుపోయినా చివరికి ఇంటికే వస్తాం. అంటే గమ్యం చేరుతామన్న మాట. ఈ గమ్యం చేరడంలో కష్టనష్టాలు ఎదుర్కొంటాం. తీపి చేదులకు ప్రతీక ఉగాది పచ్చడి’ ఈసారి చప్పట్లు మోగిపోయాయి. శాలువా కప్పారు. కరెంట్ పోయింది. ఉక్కపోసింది. కవిత్వమొక తీరని ఉక్కబోత. - జి.ఆర్.మహర్షి