భలేవాడివి బోసూ!
‘మహర్షి’లో హీరోలాంటి వేషం... ‘ఏప్రిల్ 1 విడుదల’లో విలన్ పాత్ర...ఈ రెండింటితో ఎంటరైన కృష్ణభగవాన్‌లోని సరికొత్త కామెడీ యాంగిల్‌ని పరిచయం చేసింది మాత్రం ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’. ఆ సినిమాలో ఆయన వినోదాన్నీ, వెటకారాన్నీ అందరూ ఇష్టపడ్డారు. ఇక కృష్ణభగవాన్‌ని ‘పీక్’కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది మాత్రం ‘కబడ్డీ... కబడ్డీ’. నిజంగానే ఈ సినిమాతో కామెడీతో కబడ్డీ ఆడేశాడీ కృష్ణభగవానుడు. అన్నట్టు నేడు ఆయన పుట్టిన రోజు కూడా.
పల్లెటూళ్లల్లో ఆంబోతులకి అచ్చేసి వదిలేస్తారు. అవి ఏం చేసినా అడిగే నాథుడుండడు. అచ్చోసిన ఆంబోతు కాబట్టి జనాలు కూడా ముందే అలర్టైపోతారు. ఎంకన్నపాలెంలో బోసుబాబు కూడా సేమ్ టూ సేమ్. ఆంబోతుకు మీసాలూ గడ్డాలూ ఉండవు. ఈ బోసుబాబుకుంటాయ్. అంతే తేడా!
బోసుబాబు నోట్లో ఎవ్వరూ నోరెట్టరు. నోటి వాసన వల్ల కాదు... నోటి దూల వల్ల! బోసు వేసేది ప్యాంటూ చొక్కానే అయినా, పంచ్‌లు మాత్రం తెగ ఏసేస్తుంటాడు. ఎదుటోణ్ణి ఎర్రివెధవను చేయాలంటే ఆడి తర్వాతే ఎవరైనా. వట్టి కబుర్ల పోగు. ఎవణ్ణి ఎక్కడ, ఎలా వాడుకోవాలో బాగా తెలిసినోడు. ఎదుటోడి వీక్‌నెస్సే... ఈడికి ప్లస్ పాయింట్.
ఈ బోస్ - చిరంజీవిలాగా మెగాస్టార్ అయిపోవాలనో... ఐశ్వర్యారాయ్‌ని పెళ్లాడేయాలనో... లాటరీలో యూరోలు కొట్టే యాలనో పగటి కలలు కనడు. ఇతగాడికి ఉన్నది ఒకే ఒక్క... సింగిల్... ఏక్‌హీ... కోరిక. దుబాయెళ్లి బాగా డబ్బులు సంపా దించేసి ‘దుబాయ్ బోస్’ అనిపించుకోవాలి. అందుకోసమే ఈ నానాగడ్డీ కరిచేది. గడ్డి అంటే ఊరి చివరున్న గడ్డిమేటు గుర్తొచ్చింది - ఓసారటు లుక్కేస్తే మన బోసుబాబుగాడి చిందులు సెవెన్టీ ఎమ్‌ఎమ్‌లో తిలకించేయొచ్చును.
ప్రెసిడెంటు రామారావు... బక్కపలచ కృష్ణారావు... జులపాల జుట్టు ఆంజనేయులు... బోసుబాబుకు బాసులాంటి రాంబాబు... ఎట్సెట్రా... చెమటలు కక్కుకుంటూ గేమాడేస్తున్నారు. గేమంటే... క్రికెట్టో, కబడ్డీనో, ఇంకేదోనో అనుకునేరు. ఒళ్లు అలవకుండా ఎంచక్కా సుఖాసనంలో కూర్చుని ఆడే సుఖవంతమైన గేమ్ ఈ ప్రపంచంలో ఒకటే ఉంది. ఎవడు డ్రాప్ అయితే మైండ్ బ్లాక్ అయ్యి, జేబు నిల్లవుతుందో ఆ గేమే... పేకాట. ఫేట్‌లు మార్చే ఫేక్ గేమ్.
వీళ్లందరూ ఈ బిజీలో ఉన్న సమయంలో శీనుగాడని పక్క ఊరి కుర్రాడొచ్చి రాంబాబును పక్కకు తీసుకెళ్లాడు. ‘‘నేనో అమ్మాయిని లవ్వాడేశాను... నువ్వే కలపాల్రా’’ అని తెగ రిక్వెస్టింగ్ చేసేశాడు. రాంబాబు వెంటనే బోసును పిలిచాడు. ‘‘మనమేదీ ఫ్రీగా చేయం కదా’’ అన్నాడు బోసు, సంకలో క్యాష్‌బ్యాగ్ సర్దుకుంటూ. ‘‘ఎంతవుద్దేంటి?’’ అనడిగాడు శీనుగాడు. బోసు టకాటకా బ్యాగులోని కేలిక్యులేటర్ తీసేసి ఏవో లెక్కలేసి, ఓ పది రూపాయలు శీనుగాడి చేతిలో పెట్టాడు. శీనుగాడు అయోమయపడిపోయాడు. ‘‘మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది అవుద్ది... ఆ బ్యాలన్స్ పదీ ఇచ్చాను. నువ్వు మాకు పదివేలు కొట్టు’’ అని క్లారిటీ ఇచ్చేశాడు. కట్ చేస్తే... బోసు, రాంబాబు, శీనుగాడు... ఆ అమ్మాయి పెళ్లిచూపుల ప్లేస్‌లో ఉన్నారు. ‘‘మా శీనుగాడు ఉండగా మీ చెల్లికి ఇంకో అబ్బాయితో పెళ్లెలా చేస్తావ్?’’ అని రాంబాబు, ఆ అమ్మాయి అన్నయ్యతో గొడవకు దిగాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. ‘‘రామాయణమంతా విని భీమునికి సీత ఏమ వుద్దన్న ట్టుంది నీ వాలకం... మావాడు నీ చెల్లిని ప్రేమించాడు. అందరిలాగే ఈ ప్రేమికులను విడదీయాలని చూస్తే నేను ఇంద్రసేనారెడ్డినైపోతా’’ అంటూ బోసు తొడగొట్టాడు. తీరా చూస్తే, ఆ అమ్మాయి శీనుగాడెవడో తెలియదని చెప్పింది. ‘‘ఆ అమ్మాయిని నేను ప్రేమించానని చెప్పాను కానీ, తను నన్ను ప్రేమించిందని చెప్పలేదు కదా’’ అని శీనుగాడు జంప్. రాంబాబు కూడా జంప్. ఫైనల్‌గా బోసును కుమ్మి కుమ్మి వదిలారు వాళ్లు.
ప్రెసిడెంట్ రామారావుకూ, బక్కపలచ కృష్ణారావు భార్య రాణికీ కనెక్షనుంది. కనెక్షనంటే... కేబుల్ కనెక్షననుకునేరు. బెడ్ కనెక్షన్. అది ఎవడి కంట్లో పడితే యాగీ అవుతుందో, వాడి కంట్లోనే పడింది. రామారావు, రాణి మాంచి ఇదిలో ఉండగా, కిటికీ చప్పుడు చేసి మరీ పళ్లికిలిస్తూ నిలబడ్డాడు బోసు. ‘‘నేనేం చూడలేదు... నువ్వూ చూడలేదు... ఆల్ ది బెస్ట్...’’ అంటూ చక్కాపోయాడు. వెళ్లడం వెళ్లడం పేకాటలో మంచి మూడ్‌లో ఉన్న కృష్ణారావు దగ్గరకెళ్లాడు. ‘‘ఇక్కడ నువ్వేమో పేకాట ఆడుతున్నావ్. అక్కడ ఆడేమో నీ...’’ అని ఆపేశాడు బోసు. ‘‘ఏంటెహే..! నీ గోల’’ అని కసురుకున్నాడు కృష్ణారావు. ‘‘నీకో ‘నగ్న’ సత్యం చూపిస్తా... పద’’ అంటూ కృష్ణారావును తీసుకుని బయలుదేరాడు బోసు.
ఎదురుగా పంచె ఎగ్గట్టుకుని కంగారుపడుతూ వచ్చాడు ప్రెసిడెంట్. బోసును పక్కకు లాక్కెళ్లి బతిమిలాడుకున్నాడు. ‘‘నువ్వు చిన్న పిల్లాడివిరా! ఇలాంటివి చూసీ చూడనట్టు వదిలెయ్యాలి’’ అని బుజ్జగించాడు. బోసు బుర్ర షార్ప్‌గా పనిచేసింది. ‘‘అయితే నేను చిన్న పిల్లాణ్ణి. చాక్లెట్లు కొనుక్కుంటాను. ఓ అయిదొందలు కొట్టు. నాకు చాక్లెట్లు కావాల్సినప్పుడల్లా ఇలానే ఇస్తుండాలి’’ అని గారం లాంటి దౌర్జన్యంతో డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు బోస్. ప్రెసిడెంట్ తల పట్టుకున్నాడు.
చూశారుగా! మన బోసుగాడి వెధవ్వేషాలు. చీమ దూరే సందిస్తే చాలు డైనోసార్‌ను పెట్టేస్తాడు. రాంబాబు అండ్ కో కలిసి ఊళ్లో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ అనే మూకీ డ్రామా ప్లాన్ చేస్తారు. ఇక్కడ కూడా బోసు తన బుద్ధి పోనిచ్చుకోడు. ‘‘జనాలు ఎగబడి వస్తారు... నీకు డబ్బులే డబ్బులు’’ అంటూ అరచేతిలో స్వర్గం చూపించి, ఒకడికి టీ అమ్ముకోడానికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. ఇంకా ఇదేం చూశారు..? ఒకతను భార్య గోల పడలేక గోదాట్లో దూకి చావడానికి సిద్ధపడ్డాడు. ఎంటర్ ది బోసుబాబు! ‘‘నీకెందుకు నేనో అవుడియా చెప్తా. ఫుల్ పైసలు... ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ...’’ అన్నాడు. అలా అతగాణ్ణి ‘బాచి బాబా’ను చేసేశాడు. జనం తండోపతండాలుగా వస్తున్నారు. హుండీ నిండిపోయింది. కానీ... లాస్ట్‌మినిట్‌లో ‘బాచి బాబా’ మాయం... హుండీ కూడా మాయం. నెత్తి మీద చెంగేసుకుని బోసు ఒకటే ఏడుపు.
ఎంత ఎదవైనా బోసు... ఫ్రెండ్‌షిప్‌కి ప్రాణమిస్తాడు. బెస్టుఫ్రెండు రాంబాబు, కావేరి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక్కడ ట్విస్టు ఏంటంటే... ఆ అమ్మాయి సొంతం కావాలంటే సఖినేటిపల్లి టీమ్‌తో కబడ్డీ ఆడి గెలవాలి. అది మామూలు టీమ్ కాదు... ఇప్పటికి వరుసగా 99 మ్యాచ్‌లు గెలిచింది. రాంబాబు టీమ్‌లో కబడ్డీ ఆడడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. భయపెట్టి... బుజ్జగించి... బ్లాక్‌మెయిల్ చేసి... వైట్ మెయిల్ చేసి... మొత్తానికి బోసుగాడు కబడ్డీ టీమ్‌ని సెట్ చేసిపెట్టాడు.
ఆ రోజు సఖినేటిపల్లి టీమ్‌కీ, ఎంకన్నపాలెం టీమ్‌కీ కబడ్డీ మ్యాచ్. వాళ్లు గెలిస్తే సెంచరీ పూర్తి. వీళ్లు గెలిస్తే రాంబాబుకి కావేరి సొంతం. ఇది తెలిసి చుట్టుపక్కల ఊళ్లోవాళ్లంతా ఎగబడ్డారు. దీన్ని కూడా క్యాష్ చేసేసుకున్నాడు బోసు. కిస్మత్ బీడీ కంపెనీతో డీలింగ్ కుదిర్చేసుకుని స్పాన్సరింగ్ హక్కులిచ్చేశాడు. మొత్తానికి చచ్చీ చెడీ... రాంబాబు టీమ్ ఘనవిజయం సాధించింది. కావేరి మెళ్లో రాంబాబు మూడు ముళ్లేసేశాడు. మరి దీనికి కర్త-కర్మ-క్రియ అయిన బోసుబాబు ఏం చేస్తున్నట్టు?
బోసుబాబు ఏదైనా చేయగలడు! పబ్లిగ్గానే కాదు... ప్రైవేట్‌గానే నీళ్లల్లో పాలు కలపగలిగినవాడు... ఎన్నో ‘నగ్న’ సత్యాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచినవాడు...సెంటీమీటరంత సెంటిమెంట్‌తో పాటు కిలోమీటరంత కమర్షియాల్టీ ఉన్నవాడూ... అయిన మన బోసుబాబుకు దుబాయ్ వెళ్లడం ఓ లెక్కా? తొక్క కాకపోతే!
- పులగం చిన్నారాయణ
నా ఎటకారానికి తగ్గ పాత్ర దొరికింది..!
‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. మా వాళ్లకి కొంచెం ఎటకారం ఎక్కువని ప్రతీతి. నేను కూడా ఆ జాబితానే. నా ఎటకారానికి తగ్గట్టే, మంచి ఎటకారమున్న బోసు పాత్ర దొరికింది. ఇంకేముంది... రెచ్చిపోయాను. ఈ పాత్ర గురించి దర్శకుడు వెంకీ చెప్పగానే చాలా ఈజీగా కనెక్టయిపోయాను. మా ఊళ్లో నాకున్న ఎక్స్‌పీరియెన్సులు, ఎటకారం పనులూ అన్నీ దర్శక, రచయితలకు చెబితే, వాళ్లు ఇంప్రెస్ అయిపోయి ఇందులో పెట్టేశారు. జీవా పాత్ర దున్నపోతు దగ్గర పాలు పితకడం, ట్రాక్టర్ సీన్... ఇవన్నీ నేను చెప్పినవే. షూటింగ్ టైమ్‌లోనే ఈ సినిమా హిట్టయిపోద్దని నాకు తెలిసిపోయింది. జగపతిబాబులాంటి పెద్ద హీరోకి ఫ్రెండ్‌గా చేయడం నాకు మంచి బ్రేక్. మా గోదావరి యాసతోనే ఈ సినిమా అంతా మాట్లాడేశా. అదే ప్రేక్షకులకు నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయిపోయాను. థ్యాంక్స్ టూ బోస్‌బాబు’’.
- కృష్ణ భగవాన్
హిట్ క్యారెక్టర్
సినిమా పేరు: కబడ్డీ... కబడ్డీ (2003)
డెరైక్ట్ చేసింది: వెంకీ
సినిమా తీసింది: వల్లూరిపల్లి రమేశ్
మాటలు రాసింది: వేగేశ్న సతీశ్