పూర్వం సౌభరి అనే పేరుగల మహర్షి ఉండేవారు. ఆయన మహా తపశ్శాలి. ఓ రోజున ఆయన ఎప్పటిలాగే నదికి వెళ్లి, సూర్యునికి ఎదురుగా నిలబడి దోసిలి నిండా నీళ్లు తీసుకున్నాడు. మంత్ర పూర్వకంగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించబోతుండగా ఆయన చేతిలో అయిదారు చేపలు కనిపించాయి. అవన్నీ ఒకదానితో ఒకటి ఎంతో ప్రేమగా ఉన్నాయి. వాటిని చూడగానే మహర్షికి సంసార జీవితం మీదకు ధ్యాస మళ్లింది. ‘ఎందుకు నేను ఇంతకాలం తపస్సు చేస్తున్నాను. ఎవరికోసం చేస్తున్నాను. నన్ను ఆదరించేవారెవరు. నా అంతిమ ఘడియలలో నన్ను ప్రేమతో సాగనంపేవారెవరున్నారు. అల్పజీవులైనప్పటికీ ఈ చేపలు ఎంత హాయిగా కుటుంబ జీవనం గడుపుతున్నాయి! వాటితో పోల్చుకుంటే నేను జీవితంలో చాలా కోల్పోయాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే వివాహం చేసుకుంటే బాగుంటుంది’ అనుకుంటూ ఆ దేశపు రాజు వద్దకెళ్లి, తనకు పెళ్లి చేసుకోవాలని ఉందన్న కోరికను వెళ్లబుచ్చాడు. అంతటి మహాయోగి తనంత తానుగా వచ్చి అడిగితే ఎలా కాదనగలం అనుకుని తన కుమార్తెలనే ఇచ్చి వివాహం చేశాడు.
వారితో కొంతకాలం పాటు అన్ని సౌఖ్యాలనూ అనుభవించాడు సౌభరి. ఆ తర్వాత అర్థమైంది ఆయనకు ఈ జీవితంలో ఏమున్నదో! నిద్రలేవడం, వండుకోవడం, తినడం, వినోదాలతో కాలక్షేపం చేయడం, నిద్రపోవడం... ఇంతకు మించి ఏమీ కనిపించడం లేదని భార్యలతో అన్నాడు. వారు కూడా ఆయన అభిప్రాయాన్ని గ్రహించి, గౌరవించారు. తాము కూడా యోగమార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి మళ్లి, తర్వాత మోక్షం పొందాలని ఉందని తెలియజేశారు. ఆ తర్వాత అందరూ కలసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించి, ముక్తి పొందారు. పిన్న వయసులో వైరాగ్యాన్ని, వేదాంతాన్ని అలవరచుకోవడం ఎంత హాస్యాస్పదమో, వృద్ధాప్యంలో కూడా యవ్వనంలో ఉన్నట్లు ప్రవర్తించడం అంతటి హేయం. అంటే ఏ వయసులో ఆ ధర్మాన్ని పాటించాలని సౌభరి మహర్షి కథ ద్వారా వ్యాసుడు మనకు తెలియజేశాడు. కొందరు ఎంత సంపాదించినా, ఇంకాస్త సంపాదిస్తేనో లేదా ఇల్లు, గృహోపకరణాలు అన్నీ అమర్చుకుంటేనే కానీ పెళ్లి చేసుకోవడం సరికాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూనో కాలయాపన అయ్యాక చివరికి బాధపడుతుండడం మనం చూస్తున్నదే.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment