జీవితం... చక్కదిద్దింది | women: Refined life | Sakshi
Sakshi News home page

జీవితం... చక్కదిద్దింది

Published Wed, Mar 14 2018 12:01 AM | Last Updated on Wed, Mar 14 2018 8:48 AM

women: Refined life  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జీవితాన్ని చక్కదిద్దుకోడానికినాలుగిళ్లు చక్కదిద్దగలిగితే?!అరె! భలే  ఉందే ఐడియా!ఇళ్లను అందంగా సర్ది..తన జీవితాన్నీ అంతే అందంగాతీర్చిదిద్దుకున్న ఓ సుగంధ కథ ఇది. చదువు లేని సుగంధ..భర్తలేని సుగంధ..డబ్బు లేని సుగంధ..ఆదరించేవారు లేని సుగంధ.. కథ ఇది!


ఒక చేత్తో బిడ్డను, ఒక చేత్తో పెట్టెను మోసుకుంటూముంబైలో దిగగానే.. ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో ఎదురయ్యేవన్నీసుగం«దకూ ఎదురయ్యాయి. అయితే జీవితం అంటే  ఎదురీదడమేననే సత్యాన్నీ ముంబైని చూసే ఆమె తెలుసుకుంది. 

మగవాళ్లు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం, ఆడవాళ్లు ఇంటి దగ్గరే ఉండి వంట పని, ఇంటి పని చూసుకోవడం.. ఏళ్లుగా సమాజంలో స్థిరపడిపోయిన సంప్రదాయం! ఇప్పటికీ చాలావరకు ఆ సంప్రదాయమే మన కుటుంబాలను, సమాజాన్ని నడిపిస్తోంది. అందుకే సుగంధ.. ఇంటి నుంచి బయటికి అడుగేయగానే ఒడ్డున పడిన చేప అయింది! అయితే ఆమె చేపలా విలవిల్లాడలేదు. బతుకు ఎడారిలో ఆత్మవిశ్వాసంతో పయనించి తన కోసం ఒక జీవ నదినే వెతుక్కుంది!

తెలిసింది రెండే గడపలు
సుగంధకు 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి, వాళ్ల ఇంటికి మూడిళ్ల అవతల ఉన్న సుధీర్‌తో ఆమె వివాహం నిశ్చయం అయింది. ఏదో కులాచారం అని చెప్పి ఇంట్లో వాళ్లు ఆమెను చదివించలేదు. సుగంధకు ఒక్క అక్షరం కూడా చదవడం రాదు! ‘చదువుతాను’ అని ఆమె ఎప్పుడూ అనలేదు. ‘ఎందుకు చదివించలేదు?’ అనీ అడగలేదు. తల్లిదండ్రుల మాటే ఆమెకు వేదం. తల్లి చెప్పినట్లుగా చక్కగా వంట పనులు, ఇంటి పనులు నేర్చుకుంది. పుట్టింటికి మంచి పేరు తేవాలని అమ్మ చెప్పిన మాటలు ఒంట బట్టించుకుంది. అత్తవారింట్లో అడుగుపెట్టింది. సుగంధకు తెలిసింది రెండే గడపలు. పుట్టింటి గడప, మెట్టినింటి గడప.

మూడేళ్లకే భర్తకు నూరేళ్లు!
మూడేళ్లు సంతోషంగా గడిచాయి. ఒక బాబు పుట్టాడు. వాడికి దీపక్‌ అని పేరు పెట్టుకున్నారు. ప్రేమించే భర్త, ముద్దుల కొడుకు.. వాళ్లిద్దరి మధ్య సుగంధ జీవితం బాంధవ్యపు సుగంధాలు వెదజల్లింది. అంతలోనే అనుకోకుండా ఓ దుర్ఘటన! రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్‌లో సుధీర్‌ కన్నుమూశాడు! అప్పటికింకా సుగంధ వయసు ఇరవయ్యే. అంత చిన్నవయసులో ఆమెకది పెద్ద దెబ్బ. జీవితాన్నే తలకిందులు చేసే దెబ్బ. అసలు ఆ ఘటనకు ఎలా స్పందించాలో కూడా ఆమెకు మొదట అర్థం కాలేదు. రోజులు ఎలా గడుస్తున్నాయో  కూడా తెలియని స్థితిలోకి జారిపోయింది సుగంధ. ఆ స్థితిలోనే.. చదువు లేని సుగంధకు ఒక్క విషయం ఏ మాత్రం స్పష్టంగా అర్థం అయ్యింది, తాను, తన బిడ్డ ఎవ్వరికీ భారం కాకూడదని. ఆమె అత్తింటివాళ్లు, పుట్టింటి వాళ్లు కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే. అందుకని కాదు కానీ, ఎవ్వరినీ చేయి చాచి ఒక్క రూపాయి కూడా అడక్కూడదనుకుంది సుగంధ. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది. 

మూడో గడప ముంబై 
అత్తింటివారు వారిస్తున్నా వినకుండా.. ఓరోజు బిడ్డనొక చేత్తో, బట్టల పెట్టెను ఒక చేత్తో పట్టుకుని, తన దగ్గరున్న కాస్త డబ్బుతో తను ఉంటున్న కల్యాణ్‌ ప్రాంతం నుంచి సమీపంలోనే ఉన్న ముంబైకి బయలుదేరింది సుగంధ! ఆ మహానగరంలో ఎలాగైనా బతకొచ్చనే ఆశ ఆమెను ఇంటి బయటికి అడుగు వేయించింది. అయితే అక్కడకు వచ్చాక తెలిసింది ఆమెకు.. ముంబై వచ్చి తప్పు చేశానని! జీవితం అంటే భయం కలగడం ప్రారంభమైంది. పుట్టింటి నుంచి నేరుగా అత్తింటికి వెళ్లిన సుగంధకు ఈ రెండిటి మధ్య ఉండే బయటి జీవితంలో ఇటువంటివి ఎదురౌతాయని అస్సలు తెలీదు. ముంబైలో దిగగానే  ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో ఎదురయ్యేవన్నీ సుగంధకు ఎదురయ్యాయి. అయితే జీవితం అంటే ఎదురీదడమేననే సత్యాన్నీ ముంబైని చూసే ఆమె తెలుసుకుంది. 

కొడుకును చూసి ఆగిపోయేది!
ఏ ఉద్యోగానికైనా కొద్దో గొప్పో చదువు అవసరం. మరి నిరక్షరాస్యురాలైన సుగంధకు ఉద్యోగం ఎలా వస్తుంది? రోజులు గడిచిపోతున్నాయి. ఆమె దగ్గర ఉన్న డబ్బు కర్పూరంలా కరిగిపోతోంది. ఆమె ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి. చాలాసార్లు కుంగిపోయింది సుగంధ. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. బిడ్డ ముఖం గుర్తుకు రాగానే నిర్ణయం మార్చుకునేది. చివరికి వాడినే తన ఆశాదీపం అనుకుంది. తాను కుంగిపోవడం సరి కాదనుకుంది. ఒకరోజు ఉదయం నిద్ర లేస్తూన్న సమయంలో వచ్చిన ఆలోచనతో సుగంధ మనసు తేలికపడినట్లయింది. కొత్త శక్తి పుంజుకుంది, డబ్బు సంపాదించడానికి మార్గం కనిపించింది. ప్రతి మనిషిలోను ఏదో ఒక శక్తి ఉంటుంది. అలాగే తనలో ఉన్న శక్తి ఏమిటో గమనించుకుంది. 

అమ్మ నేర్పిన ‘విద్య’ ఆదుకుంది
పుట్టింట్లో ఉండగా తల్లి ఆమెకు కుదురుగా ఇల్లు సర్దడం నేర్పించింది. ఆ నమ్మకంతో ధనవంతుల ఇళ్లలో ఇంటిని అందంగా సర్దే పని చేయడానికి నిశ్చయించుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా ముంబై అంధేరిలోని ఒక ఇంట్లో పనికి కుదిరింది. ఆమె పనితీరుకు ముచ్చట పడిన మిగతా ఇళ్లవాళ్లు కూడా ఆమెను పిలిపించుకుని ఇల్లు సర్దించుకునేవారు. ప్రతిఫలం కూడా  వేలల్లోనే దక్కేది. అలా కొద్దికొద్దిగా డబ్బు సమకూరుతూ ఉండడంతో అక్కడికి దగ్గరలోని ఒక స్లమ్‌ ఏరియాలో చిన్న గది అద్దెకు తీసుకుంది సుగంధ. ఆ వెంటనే దీపక్‌ను స్కూల్‌లో చేర్పించింది. ఏళ్లు గడుస్తున్నాయి. దీపక్‌ పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసి, ఇంజనీరింగ్‌లో చేరాడు. కొద్ది కొద్దిగా డబ్బు పోగు చేసి, చిన్న ఇల్లు కొనుక్కోగలిగింది. ఇంతలోనే మరో ఘటన. అయితే అది ఆమె మంచికే జరిగింది. తను నివసిస్తున్న స్లమ్‌ ఏరియాను ఒక బిల్డర్‌ కొనేశాడు. పరిహారంగా స్లమ్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద, అక్కడ చిన్న హౌసింగ్‌ కాంప్లెక్స్‌ కట్టి సుగంధకు, ఇంకా కొందరికి ఆ కాంప్లెక్స్‌లో సొంత ఇంటిని కేటాయించాడు.

గతమే సుగంధ వర్తమానం
ఇప్పుడు సుగంధకు ఒక ఇల్లు ఉంది, చేతికి అంది వచ్చిన కుమారుడున్నాడు. అతడు ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేయవలసిన అవసరం లేదు. కాని ఆమె తన పని మానలేదు. ‘‘ఇళ్లను సర్దేపని నా జీవితాన్నీ చక్కగా సర్దింది. ఈ పనితోనే ఈ రోజు నేను ఈ స్థితికి వచ్చాను. ఈ పని కూడా రాకుండా ఉంటే, నా జీవితం ఎలా ఉండేదో! నా గతాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే నా గతమే నా వర్తమానం’’ అంటుంది సుగంధ. జీవిత ఆరంభంలో బెరుకుగా, పిరికిగా ఉన్న సుగంధ ఈ రోజు ఆత్మస్థైర్యంతో, ఆనందంతో ఉంది. మహిళలకు ఒక ఆదర్శంగానూ నిలిచింది.  (సుగంధ విజయగాథను పాలక్‌ కపాడియా అనే కాలమిస్ట్‌ మూడు రోజుల క్రితమే  ‘షీరోస్‌’లో పొందుపరిచారు)
– రోహిణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement