ఉగాది వ్యాఖ్యాత | Ugadi commentator | Sakshi
Sakshi News home page

ఉగాది వ్యాఖ్యాత

Published Fri, Mar 20 2015 10:27 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

ఉగాది వ్యాఖ్యాత - Sakshi

ఉగాది వ్యాఖ్యాత

  హాస్యం

ఉగాదికి కోయిల గొంతు సవరించుకున్నట్టు కవులు కూడా యాక్టివేట్ అవుతారు. కొత్తబట్టలు, వేపపూత పచ్చడి, పంచాంగ శ్రవణాలతో పాటు మనకు తగులుతారు.  ఒక ఉగాది రోజున ఒక కవిమిత్రుడు బలంగా డీకొని, కవి సమ్మేళనానికి రమ్మని పిలిచాడు. నాకు కవిత్వం రాదని చెప్పాను. అదే అసలైన అర్హతని అన్నాడు. కవిత్వం వస్తుందని చెప్పేవాడికి ఏమీ రాదని, రాదని చెప్పేవాడే అసలు సిసలు కవని వాదించాడు. నేను కుయ్యోమొర్రోమని అరిచినా వినకుండా శాలువాలు అనవసరంగా మిగిలిపోతాయని లాక్కెళ్లాడు.
 అక్కడ కవులంతా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ఉన్నారు. ఒకాయన చేతికి కంకణాలు, వేలికి ఉంగరాలు ధరించి నడిచే నగల దుకాణంలా ఉన్నాడు. ‘అతడెవరు’ అని అడిగాను? ‘మనం చదివే కవిత్వానికి వ్యాఖ్యాత’ అన్నాడు.  ‘అంటే’ అన్నాను.

 ‘మనం చదివేది మనం చదువుతాం ఆయనకు అర్థమయ్యింది ఆయన చెబుతాడు’ అన్నాడు. అందరూ కాగితాలు సర్దుకున్నారు.
 యాంకర్‌లాగా ఉన్న ఒకావిడ వచ్చి ‘ఇంతమంది కవులను చూస్తుంటే నాక్కూడా కవిత్వమొచ్చేస్తా ఉంది’ అని- ‘వారానికొకటే ఆదివారం సాంబా ఏడాదికి ఒకటే ఉగాది సాంబా’ కవిత చదివింది. ‘ఈ సాంబా ఎవరు మధ్యన’ అని కవిమిత్రుణ్ణి అడిగాను.
 ‘వేమన పద్యాలు వినుర వేమతో ముగిసినట్టు ఈమె ఏం మాట్లాడినా సాంబాతో ముగుస్తుంది. ఆయనెవరో తెలుసుకోడానికి ఒక యూనివర్సిటీలో పరిశోధన కూడా జరుగుతోంది’ అని చెప్పాడు. ‘ఈమెనే అడిగితే చెబుతుందిగా. మళ్లీ పరిశోధన ఎందుకు?’ ‘సులభంగా తెలిసేవాటిని కష్టంగా తెలుసుకోవడమే రీసెర్చి’ ఇంతలో ఒక కవి లేచి ‘తీపి తిన్నవాడు పాపి, ముక్కోపి చేతిలో తుపాకీ’...  అంటూ ఏదో మొదలెట్టాడు. నాకేం అర్థం కాక కవిమిత్రుణ్ణి గిల్లాను. ‘కవిత్వాన్ని అనుభూతించాలి. అర్థాలు వెతక్కూడదు’ అన్నాడు.
 ఇంకొకాయన లేచి ‘నీ నిరీక్షణలో క్షణమొక యుగం మీనాక్షీ... నువ్వుంటే ప్రతిరోజూ ఉగాదే మీనాక్షీ’ అని అందుకున్నాడు. ‘మీనాక్షిని ఈయన ప్రేమించాడు. కానీ ఆమె ప్రేమించలేకపోయింది. ఇదీ కథ’ అడగకుండానే చెప్పాడు మిత్రుడు. ‘ఇప్పుడామె ఎక్కడుంది?’ అని అడిగాను. ‘ఈయన్ని ప్రేమించకపోవడం వల్ల ఇంకా జీవించే ఉంది’ అన్నాడు. ఆ తర్వాత నాకేం వినబడలేదు. ఎందుకంటే నా వంతు వచ్చేస్తుందేమోనని భయం పట్టుకుని కాళ్లు వణుకుతున్నాయి. ఎట్నుంచి నరుక్కొచ్చినా మన వంతు రాక తప్పదు కదా. ఏడుపు మొహంతో మిత్రుణ్ణి చూశాను.

 ‘నీ నోటికొచ్చింది చదువు’ అన్నాడు. మైక్ దగ్గరికెళ్లి ‘ఉదయాన్నే మా ఆవిడ నిద్రలేపింది’ అన్నాను.
 వ్యాఖ్యాత అందుకున్నాడు. ‘ఆహా... ఎంత అద్భుత కవితా వాక్యం. ఆడవాళ్లు తాము జాగృతం కావడమే గాక మగవాళ్లని కూడా తన్ని మరీ జాగృతం చేస్తున్నారు. ఇది కదా స్త్రీ చైతన్యానికి ప్రతీక’ అన్నాడు.అందరూ చప్పట్లు కొట్టారు. నాక్కొంచెం కిక్కెక్కింది.
 ‘మొహం కడుక్కుని అంగడికెళ్లాను’... ‘మొహం కడుక్కోవడం అంటే ఏంటంటే అర్థం... మనం రోజువారీ జీవిక కోసం రకరకాల వేషాలేస్తున్నాం. రంగులద్దుకుంటున్నాం. అందువల్ల ఉదయాన్నే పాతరంగులు తుడుచుకుని కొత్తరంగులు వేసుకోవడమే ఫేస్‌వాష్. ఇక అంగడి అంటే ఈ ప్రపంచమే ఒక అంగడిగా మారిపోయింది. అందరూ అన్నీ అమ్మేస్తున్నారు. కొనేస్తున్నారు. మనల్ని మనం అమ్ముకుని మళ్లీ కొత్తగా కొనుక్కోవడమే జీవితం. ఇది కవి హృదయం’ నా మాటలకి ఇంత అర్థముందని తెలిసి ఉబ్బితబ్బిబ్బయ్యాను. ‘అక్కడ సరుకులు కొన్నాను’ అని కంటిన్యూ చేశాను. ‘సరుకు అంటే ప్రపంచీకరణ. ప్రతి సరుకుకి విలువున్నట్టే అన్ని విలువలు సరుకులుగా మారిపోయాయి’ ‘ఇంటికొచ్చి ఉగాది పచ్చడి తిన్నాను’ ‘ఇక్కడ ఇల్లు అంటే గమ్యం. మనం ఎట్నుంచి ఎటుపోయినా చివరికి ఇంటికే వస్తాం. అంటే గమ్యం చేరుతామన్న మాట. ఈ గమ్యం చేరడంలో కష్టనష్టాలు ఎదుర్కొంటాం. తీపి చేదులకు ప్రతీక ఉగాది పచ్చడి’ ఈసారి చప్పట్లు మోగిపోయాయి. శాలువా కప్పారు. కరెంట్ పోయింది. ఉక్కపోసింది. కవిత్వమొక తీరని ఉక్కబోత.
 - జి.ఆర్.మహర్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement