ఆజానుబాహుబలి
హ్యూమర్ ఫ్లస్
ఆయన పేరు ఆజానుబాహుబలి. ఒకరోజు షవర్ కింద స్నానం చేస్తూ వుండగా ‘‘నేనెవర్ని?’’ అని అనుమానమొచ్చింది. నడుంకి టవల్ బిగించి బయటికొచ్చి ‘‘నేనెవర్ని?’’ అని అరిచాడు.‘‘ఇంట్లో కుక్‌వి, గెస్ట్‌లొస్తే చెఫ్‌వి. స్టయిల్‌గా చెప్పాలంటే బట్లర్‌వి, మోటుగా వంటాడివి’’ అని విడమరిచి చెప్పింది భార్య. ‘‘ఇంతకీ నేను ఇంటోడినా? వంటోడినా?’’
‘‘అదంతా చెప్పాలంటే మీ నాన్న అమరేంద్ర నరబలి దగ్గరుంచి మొదలుపెట్టాలి. చాలా పెద్ద కథ. రెండు పార్టులుగా చెప్పాల్సి వుంటుంది. వెళ్లి బట్టలేసుకురా. లేదంటే ఆవేశంలో నరాలు పొంగి తువ్వాలు ఊడిపోవచ్చు.’’ కథ మొదలైంది.
‘‘ఎవరి పేరు చెబితే జనం కకావికలమవుతారో, ఎవరి వంట తింటే కంట కన్నీరు ఒలుకుతుందో ఆయనే అమరేంద్ర. ఆయన వండితే సగంమంది పైకి, మిగిలిన సగం ఆస్పత్రికి వెళ్ళేవాళ్ళు. దాంతో అందరూ అమరేంద్ర నరబలి అని పిలిచేవాళ్ళు. నిజానికి వంట ఆయన ఇంటావంటా లేదు. మీ అమ్మని చేసుకున్న తరువాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన వంట తిన్న మీ అమ్మ జడుసుకుని భర్త వండింది తినకుండా ఉండడానికి సేఫ్టీకోసం తనను తాను గొలుసులతో బంధించుకుంది.
ఇదిలావుండగా అకాలకేయుడు అనే ఆటవిక నాయకుడికి మీ నాన్న విషయం తెలిసింది. మనుషుల్ని సింగిల్ సింగిల్‌గా చంపడంకంటే ఒక మెస్సు పెట్టి మాస్‌గా చంపాలని పథకమేసి సైన్యంతో సహా వచ్చాడు. మీ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి ‘క్కిట్టమ్మప్ప, బ్రాష్కో, ట్టగ్గర్ర’ అని ప్రతి పదానికి ఒత్తునిచ్చే భాషలో మాట్లాడి లొట్టలేశాడు. మీ నాన్న ఒత్తులు, కత్తులకి లొంగేవాడు కాదు. వాడి భాష అర్థం కాకపోయినా లొట్టలేసింది తన వంటకోసమేనని అపార్థం చేసుకుని వండి వడ్డించాడు.
సైన్యం అప్పుడే పోగా, అకాలకేయుడు డయేరియాతో వాడి పాపాన వాడే పోయాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా నువ్వు పుట్టావు. నీ క్షేమం కోసం మీ నాయనమ్మ చంటి బిడ్డతో నదిని దాటాలనుకుంది. అయితే నదిలో నీళ్ళు లేవు. ఖర్మగాలి కాళ్ళు కాలాయి. నిన్నో గూడెం వాళ్ళకి ఇచ్చి నీడకోసం ఆమె ఎక్కడికో పారిపోయి మళ్ళీ రాలేదు’’ అని ఆమె కథ ముగించింది.
‘‘అయితే ఇప్పుడు మా నాన్న ఎక్కడ?’’
‘‘లేడు. వెళ్ళిపోయాడు పైకి’’
‘‘కత్తికి లొంగడన్నావు. బల్లెం భయపెట్టదన్నావు.’’
‘‘కత్తిపోటు, బల్లెంపోటు కంటే సాపాటు ప్రమాదకరమైంది. నేనే నా చేతులతో పళ్ళెంలో వడ్డించాను.’’
‘‘ఎందుకని?’’ తల విదిలించి ఆవేశంగా అరిచాడు ఆజానుబాహుబలి.
‘‘నాకు మాత్రమేం తెలుసు? సెకెండ్ పార్ట్‌లో చెబుతా.’’
- జి.ఆర్. మహర్షి