ఒకనాడు ఓ కవి తన కవిత్వంతో భోజరాజును అమితంగా మెప్పించాడు. అతనికి తగిన వసతి కల్పించాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు భోజుడు. ‘మహాప్రభో, ఇప్పటికే ధారానగరం కవులతో నిండిపోయింది. వీరికి వసతి ఇవ్వడం కష్టం’ అన్నారు. ‘అయితే రాజధానిలో కవికానివాడెవడైనా ఉంటే అతని గృహం ఇతనికివ్వండి’ అన్నాడు రాజు.
భటులు ప్రతి ఇంటి తలుపు తడుతూ ‘మీరు కవులా?’ అని అడగటం మొదలుపెట్టారు. చివరకు కువిందుడు అనే చేనేతపనివాడు ‘కాదు’ అన్నాడు. ‘అయితే నీ గృహం కవిగారికి ఇస్తున్నాం’ అన్నారు భటులు. ‘ఇది అన్యాయం, నేను రాజుగారితో మాట్లాడతాను’ అన్నాడు కువిందుడు.
సభకు వచ్చిన కువిందుడిని ‘నీవు కవిత్వం వ్రాయగలవా?’ అని భోజుడు ప్రశ్నించగానే–
కావ్యం కరోమి నహిచారుతరం కరోమి
యత్నాత్ కరోమి యదిచారుతరం కరోమి
హేసాహసాంక! హేభూపాల మౌళి మణిరంజిత పాదపీఠ
కవయామి, వయామి, యామి
‘కావ్యం వ్రాయగలను కానీ అందంగా ఉంటుందో లేదో చెప్పలేను. ప్రయత్నిస్తే అందంగానూ కావ్యం చెప్పగలను. సాహసమే జెండాగా గల ఓ మహారాజా! రాజుల యొక్క మణికిరీట కాంతులచే ప్రకాశించే పాదపీఠంగల ఓ భోజరాజేంద్రా! కవిత్వం చెప్పగలను(కవయామి), నేతపనీ చేయగలను(వయామి), వెళ్లమంటే వెళ్లనూగలనూ(యామి)’ అని జవాబిచ్చాడు.
‘‘ఇంత గొప్ప శ్లోకం చెప్పిన నీవు కవివి కావనడం ఎలా? కావున నీవు ఎక్కడకూ వెళ్లనవసరం లేదు’ అని భరోసా ఇచ్చాడు భోజుడు. నూతనంగా వచ్చిన కవికి మరేదో వసతి చూపించారనుకోండి. అది వేరే సంగతి. ‘భోజుని ధారానగరంలో కవులు కాని వాళ్లే లేరు’ అని చెప్పడానికి అతిశయోక్తిగా కల్పించబడిన కథే అయినా కడురమ్యంగా ఉందీ కథ.
డి.వి.ఎం.సత్యనారాయణ
Published Mon, Sep 3 2018 12:31 AM | Last Updated on Mon, Sep 3 2018 12:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment