ఒక తలపు రెండు తలుపులు | An Ancient King Story In Sakshi Sahityam | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 12:18 AM | Last Updated on Mon, Sep 3 2018 12:18 AM

An Ancient King Story In Sakshi Sahityam

పాతకాలంలో ఒక అర్ధ అనాగరిక రాజు ఉండేవాడు. ఆయన ఆలోచనలు పొరుగు లాటిన్‌ దేశాల ప్రభావంతో ప్రగతిశీల మెరుగు అద్దుకున్నప్పటికీ చాలావరకు అనాగరికంగానే ఉండేవి. ఆయన ఎంతటి అతిశయంతో కూడిన అధికారాన్ని అనుభవించేవాడంటే తలుచుకున్నది తలుచుకున్నట్టే జరిగిపొయ్యేది. వ్యతిరేకించినవారిని చక్కబెట్టడానికి మించిన ఆనందం ఆయనకు ఎందులోనూ లేదు.ఆయన మొరటు ఆలోచనలన్నీ పోతపోసినట్టుగా కనబడే ప్రదేశం ఏదైనా ఉందంటే అది రంగభూమి. ఈ వేదికను ఖడ్గధారుల కరవాల ధ్వనులు వినడానికో, భిన్న మతాల మధ్య తలెత్తే వాదోపవాదాలను గ్రహించడానికో ఏర్పాటు చేయలేదు. జనాల మానసిక శక్తులను విస్తృతపరిచే కేళీ విలాసాలు చోటుచేసుకుంటాయిక్కడ.

మార్మికమైన చీకటిగుహలతో, ఎవరికీ అంతుపట్టని లోపలి దారులతో చుట్టూ గుండ్రంగా ప్రేక్షకులు కూర్చుండేలా నిర్మించిన ఈ విశాలమైన రంగభూమిలో లేశమాత్రం స్వపర భేదం లేని, అవినీతికి ఆస్కారం లేని కవితాన్యాయం జరుగుతుంది. నేరం శిక్షించబడుతుంది, ధర్మం ప్రతిఫలం పొందుతుంది. ఎవరైనా నేరారోపణ ఎదుర్కొన్నట్టయితే, ఆ నేరం రాజుకు ఆసక్తి కలిగించేంతటిదైతే దాని గురించి తెలియపరుస్తూ ప్రజలకు దండోరా వేస్తారు. నిర్దేశిత రోజున ప్రజా వేదిక మీద అణువణువూ రాజసం నింపుకున్న రాజుగారి సమక్షంలో నిందితుడి విధిరాత నిర్ణయమవుతుంది.

ప్రజలందరూ గుమికూడాక, వేదిక ఒకవైపున రాజు తన మంత్రివర్గాన్ని కొలువుతీర్చుకుని అత్యున్నత పీఠం మీద కూర్చుంటాడు. సంజ్ఞ చేయగానే ఆయన కిందివైపు ఉన్న ద్వారం తెరుచుకుంటుంది. నిందితుడు రంగభూమి మీద అడుగుపెడతాడు. రాజుకు సరిగ్గా వ్యతిరేక దిశలో ఒకేలా కనబడే రెండు ద్వారాలు పక్కపక్కనే ఉంటాయి. నిందితుడు తనకు ఒసగబడిన విశేషాధికారంతో ఈ రెండు ద్వారాల వైపు నడుచుకుంటూ వెళ్లి ఒక తలుపు తెరవాలి. ఏది సమ్మతమో అదే తెరవొచ్చు. ఏ ప్రభావం ఉండదు, ఏ మార్గదర్శనం లభించదు. ముందు చెప్పుకున్న అవినీతికి తావులేని, స్వపరభేదం లేని న్యాయం జరిగే చోటిది. అతడు గనక ఒక ద్వారం తెరిస్తే అందులోంచి ఒక ఆకలిగొన్న పులి బయటకు వస్తుంది. నేరానికి శిక్షగా అతి క్రూరంగా నిందితుడి శరీరాన్ని ఖండఖండాలుగా చీల్చేయవచ్చు. తిరిగి ఇనుప ఊచలు మూసిన చప్పుడు వినబడగానే, నిందితుడికి పట్టిన గతిని తలుచుకుంటూ ప్రేక్షకులు భారంగా నిష్క్రమిస్తారు.

ఒకవేళ నిందితుడు మరో తలుపు తెరిస్తే, అందులోంచి ఓ యువతి బయటకు వస్తుంది. రాజు తన దగ్గరున్న పడుచుల్లోంచి నిందితుడి వయసుకు తగినట్టుగా ఎంపిక చేసిన ఈ వధువును ఇచ్చి తక్షణమే కల్యాణం జరిపిస్తాడు. ఒకవేళ అదివరకే వివాహం జరిగిందా, అతడి మనసు ఇంకెవరిమీదైనా ఉందా లాంటి చిల్లర విషయాలను రాజు లక్ష్యపెట్టడు. రాజు మరో ద్వారం తెరవగానే పూజారి, వాయిద్యగాళ్లు వచ్చి మేళతాళాలతో వేడుకను జరిపించగానే, ప్రజలు హర్షధ్వానాలతో నూతన వధూవరుల మీద పూలు జల్లి సంతోషంగా ఇళ్లకు వెళ్లిపోతారు.

ఇది రాజుగారి అర్ధ అనాగరిక న్యాయ విధానం. ఇందులో తరతమ భేదం లేదనేది నిశ్చయం. మరు క్షణంలో పాశవికంగా హత్యకు గురవుతాడా, కేరింతల నడుమ వివాహం చేసుకుంటాడా అన్న చిన్నపాటి సూచన కూడా నిందితుడికి అందదనేది ఖాయం. తనకు న్యాయం చేసుకునే పూర్తి హక్కును రాజు నిందితుడికే వదిలిపెట్టాడనే అంశాన్నీ విస్మరించకూడదు. కొన్ని సందర్భాల్లో పులి ఇటువైపు ద్వారం నుంచి బయటకు వస్తే, కొన్నిసార్లు అటువైపు నుంచి రావొచ్చు.

ఈ అర్ధ అనాగరిక రాజుకు ఒక చక్కటి కూతురు ఉంది. ఆమె కూడా రాజు అంతటి దర్పం గలది. భూమ్మీద ఏ మనిషినీ రాజు తన కూతురంత ప్రేమించడు. రాజు ఆస్థానంలో ఒక యువకుడు పనిచేస్తున్నాడు. అతడి రక్తం కులీన వంశీయుడిదైనా స్థానం మాత్రం రాచకన్యలను ప్రేమించే అతి సాధారణ శృంగార నాయకుల కోవలోనిది. రాచబిడ్డ కూడా ప్రేమికుడి పట్ల సంతుష్టిగానే ఉంది. అతడు అందగాడు, రాజ్యం మొత్తంలో అతడి ధైర్యానికి సరితూగేవాళ్లు తక్కువ. యువరాణి ప్రేమలో కూడా మోటుదనానికి సరిపోయేంత తీవ్రత ఉంది. ఈ ప్రేమకలాపం కొన్ని మాసాల పాటు సంతోషంగా సాగింది, చివరికి రాజు ఈ వ్యవహారాన్ని కనిపెట్టేదాకా. అంతఃపురంలో జరిగిన దీని పట్ల రాజు తన బాధ్యత నుంచి వెనక్కిపోలేదు. యువకుడిని తక్షణం కారాగారంలో బంధింపజేసి, నిర్దేశిత రోజున ప్రజావేదిక మీద న్యాయం కోసం పిలుపునిచ్చాడు. రాజు, ప్రజలు కూడా ఎంతో ఉత్సుకతతో తీర్పు రోజు కోసం ఎదురుచూడసాగారు. గతంలో ఏ యువకుడూ రాజుకూతురినే ప్రేమించే సాహసం చేయలేదు. తర్వాతి కాలంలో ఇట్లాంటివి సాధారణమైతే అవొచ్చుగాక కానీ ఆ కాలానికి అది విపరీతమైన సంగతే.

రాజ్యంలో ఉన్న అత్యంత క్రూరమైన పులిని అన్వేషించి తెచ్చారు. రాజ్యాన్ని మొత్తం గాలించి  సుందరమైన కన్యను వెతికి పట్టుకున్నారు, ఒకవేళ విధి గనక యువకుడికి మరో రాత రాస్తే సరిపోయేలా. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు, యువకుడు యువరాణిని ప్రేమించిన సంగతి. దీన్ని యువరాణిగానీ యువకుడుగానీ నిరాకరించడం లేదు. కానీ రాజు దీన్ని వ్యవహారం మధ్యలోకి తేవడానికి ఇష్టపడలేదు. 

తీర్పు దినం రానేవచ్చింది. రాజ్యపు దూరదూరాల నుంచి వచ్చిన జనం రంగభూమి మీద కూర్చున్నారు. చోటు చాలనివాళ్లు గోడలకు నిలదొక్కుకున్నారు. విధిని నిర్ణయించే ఆ ఏకరూప ద్వారాలకు సరిగ్గా ఎదురుగా వేసిన ఉన్నతాసనం మీద రాజు ఆసీనుడయ్యాడు. మంత్రివర్గం తమ తమ స్థానాల్లో వేచిచూస్తోంది. అంతా సిద్ధం. సంకేతం ఇచ్చారు. కిందున్న ద్వారం తెరుచుకోగానే యువరాణి ప్రేమికుడు నడుచుకుంటూ వేదిక పైకి వచ్చాడు. పొడుగ్గా, తెల్లగా, అందంగా ఉన్న ఆ యువకుడిని చూడగానే జనంలో ఒక ఆరాధన చోటు చేసుకుంది. ప్రేక్షకుల్లో సగమందికి ఇంతటి సొగసుకాడు తమ మధ్యనే నివసిస్తున్నట్టు తెలియదు. మరి యువరాణి ప్రేమించిందంటే ఆశ్చర్యం ఏముంది!

యువకుడు వేదిక మధ్యకు వచ్చాడు. రాజుకు వంగి అభివాదం చేయడం సంప్రదాయం.  అదేమీ పట్టించుకోకుండా యువరాణి వైపు కళ్లు నిలిపాడు. ఆమె సరిగ్గా తండ్రికి కుడివైపున కూర్చుంది. ఎంతో కొంత క్రూరత్వపు ఉత్సుకత ఆమె స్వభావంలో ఉండబట్టిగానీ లేదంటే ఆమె అక్కడ కూర్చోవలసినదే కాదు. తన ప్రియుడిని బంధించిన క్షణం నుంచీ రాత్రీపగలూ ఆమె ఈ వ్యవహారంతో ముడిపడిన విషయాల గూర్చే ఆలోచించింది. తనకున్న అధికారం, తను చూపగల ప్రభావం రీత్యా ఈ వ్యాజ్యం మీద గొప్ప ఆసక్తిని నిలబెట్టుకుంది. పైగా ఇంతవరకూ రాజ్యంలో ఏ వ్యక్తీ చేయలేని పని చేసింది– ఆ ద్వారాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించింది. ఆ చిన్నగదుల్లో ఎందులో పులిబోను ఉందో, ఎందులో యువతి ఉందో తెలుసుకుంది. తోలుతో నింపివున్న ఆ చిన్నగదుల్లోంచి గడియ తీయబోయే నిందితుడికి ఏ శబ్దమూ వినిపించదు, ఏ సూచనా అందే వీలుండదు. స్త్రీకి ఉండే సంకల్పమూ, బంగారమూ ఆ రహస్యం యువరాణికి అందడానికి కారణమైనాయి.

ఏ తలుపు వెనుక సిగ్గులమొగ్గ లాంటి యువతి వేచివుందో తెలియడంతోపాటు ఆ యువతి ఎవరో కూడా యువరాణికి తెలుసు. రాజాస్థానంలోని చక్కటి చుక్కను యువకుడి కోసం ఎంపిక చేశారు. ఆ యువతి అంటే యువరాణికి గిట్టదు. చాలాసందర్భాల్లో యువరాణి చూసింది లేదా అనుకున్నది ఏమంటే, ఈ యువతి తన ప్రేమికుడి మీద ఆరాధన కనబరిచింది. ఆ వలపుచూపులను యువకుడు అందుకోవడమే కాదు, వాటికి బదులిచ్చివుంటాడని కూడా యువరాణి భావన. పైగా అమ్మాయి అందంగా ఉంది, తన ప్రేమికుడి వైపే కన్నెత్తి చూడటానికి సాహసించింది. పూర్వీకుల నుంచి యువరాణిలో ప్రవహిస్తున్న అనాగరిక రక్తం ఆ ద్వారం వెనకాల చెంపల ఎరుపుతో నిల్చునివున్న యువతిని ద్వేషించేలా చేసింది.

ఎప్పుడైతే ఆమె ప్రేమికుడు ఆమెవైపు చూశాడో, కుతూహలంతో చూస్తున్న జనసంద్రం మధ్యలో, ఆత్మలు ఏకమైన వాళ్లకే పరిమితమైన సంజ్ఞభాషలో వాళ్ల కళ్లు వేగంగా కలుసుకున్నాయి. ఏ ద్వారం వెనుక పులి నక్కివుందో, ఏ ద్వారం వెనుక అమ్మాయి నిలబడివుందో ఆమెకు తెలుసనీ, ఆ గుట్టు చిక్కించుకోకుండా ఆమె నిద్రపొయ్యేరకం కాదనీ యువకుడి నమ్మకం. 
ఎప్పుడైతే ఆమె కళ్లవైపు చూశాడో ఆమెకు అంతు చిక్కిందని అర్థమైంది. అంతే వేగంగా కంటిచూపుతో ‘ఏది?’ అని ప్రశ్నించాడు. అంత జనం మధ్యలో గొంతెత్తి అరిచినంత స్పష్టంగా ఆ ప్రశ్న ఆమెకు అర్థమైంది. కంటిరెప్పపాటులో అడిగిన ఈ ప్రశ్నకు అదే కంటిరెప్పపాటులో జవాబివ్వాలి.

ఆమె కుడిచేయి సింహాసనపు మెత్తటి చేయి మీద ఆన్చివుంది. చేతిని లేపి, చిన్నగా వేగంగా సంజ్ఞ చేసింది. యువకుడు తప్ప దాన్ని ఎవరూ చూడలేదు. అందరి కళ్లూ ఆ యువకుడి మీదే లగ్నమైవున్నాయి. అతడు తిరిగి, స్థిరమైన అడుగుల వేగంతో తలుపుల వైపు నడిచాడు. ప్రతి ఒక్కరి గుండె కొట్టుకోవడం ఆగింది, శ్వాస నిలిచింది, రెప్పలు వేయడం మరిచారు. ఏమాత్రం సంశయం లేకుండా, అతడు కుడివైపు ఉన్న గది దగ్గరకు వెళ్లి గడియ తీశాడు. ఇప్పుడు కథలోని కీలకాంశం ఏమిటంటే, అందులోంచి పులి బయటకు వచ్చిందా, యువతా?
దీని గురించి ఎంత ఆలోచిస్తే, జవాబు దొరకడం అంత కష్టం అవుతుంది. ఉడుకు రక్తం పరుగెడుతున్న అర్ధ అనాగరిక యువరాణిని దృష్టిలో ఉంచుకుని దీనికి సమాధానం అన్వేషించాలి. ఆమెలో ఒకవైపు అసూయ, మరోవైపు నిరాశ. ఆమె ఎటూ ప్రేమికుడిని కోల్పోయింది. కానీ ఎవరు పొందాలి? తన సఖుడు తలుపు తీయగానే పులి తన వాడి పంజాతో చీల్చే దృశ్యాన్ని తలుచుకుని తన కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది! అదే సమయంలో తరుచుగా ఆమె మరో ద్వారం ముందు తన ప్రియుడు ఉండటాన్ని ఊహించుకుంది! హృదయం మరిగి, పళ్లు పటపట కొరికింది. జీవితాన్ని పూర్తిగా పొందిన సంతోషంలో జనాల తుళ్లింతల మధ్య వాళ్లిద్దరూ ఆలుమగలుగా నిర్ణయింపబడితే! 

అతడు ఒక్కసారిగా చచ్చిపోవడం మంచిది కాదా, తనకోసం మరుజన్మలో ఎదురుచూస్తూ? మళ్లీ ఆ ఘోరమైన పులి, దాని గాండ్రిపు, ఆ రక్తం! ఆమె రెప్పపాటులో తన సైగ చేసివుండవచ్చు. కానీ దాని వెనుక రోజుల తరబడి సాగించిన అంతర్మథనం ఉంది. తనను అడుగుతాడని నిశ్చయంగా తెలుసు, ఏం జవాబివ్వాలో నిర్ణయించుకుని, సంశయం లేకుండా కుడివైపు చేతిని కదిల్చింది. ప్రియ పాఠకులారా, ఇక ఇది పూరించుకోవాల్సింది మీరే. యువకుడు తలుపు తీయగానే పులి వచ్చిందా, యువతా?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement