పూర్వం ‘విద్యానగరం’ అను పట్టణంలో కుబేర వర్మ అను గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపదనంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలనే కీర్తి కాంక్ష కలిగింది అతనికి. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన, కనక, వస్తు, వాహనాలను దానం చేస్తూ వచ్చాడు.
అంతేకాదు గుళ్ళు గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకున్నాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రయపడ్డాడు. అలా పూర్వీకుల ఆస్తిని దానం చేసి అతను కోరుకున్నట్టుగానే అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. అది దేవలోకానికీ చేరింది. ఈ విషయంలో దేవలోకం కుబేర వర్మను పరీక్షించాలనుకుంది.
ఒకసారి ఒక సన్యాసి కుబేర వర్మ వద్దకు వచ్చి ‘నాకు ఆకలిగా ఉంది. మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి’ అని అడిగాడు. అందుకు కుబేర వర్మ నవ్వి ‘అన్నదానం ఏముంది.. ఎవరైనా చేస్తారు. మీకు వెండి.. బంగారం.. డబ్బు.. ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి నా ప్రతిష్ఠ తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికి వెళ్ళండి’ అని చెప్పాడు.
సన్యాసి ‘నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ? భోజనం లేదంటే వెళ్ళిపోతాను’ అంటూ అక్కడి నుండి కదిలాడు. పక్క వీథిలోని దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ సన్యాసి. దేవదత్తుడు సామాన్య కుటుంబీకుడు. గొప్ప దయా గుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతేకాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు.
తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించలేదు. అలాంటి దేవదత్తుడి ఇంటికి వచ్చిన సన్యాసి తనకు ఆకలిగా ఉందని.. భోజనం పెట్టించమని కోరాడు. దేవదత్తుడు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సన్యాసి. కొంతకాలం తర్వాత వయసు మీద పడి దేవదత్తుడు చనిపోయాడు.
ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో.. చాలామందితో పాటు తనకంటే ముందుగానే చనిపోయిన దేవదత్తుడూ ఉన్నాడు. ప్రథమస్థానంలో ప్రత్యేక ఆసనంపై కూర్చొని. కుబేర వర్మకు పదకొండవ స్థానం లభించింది. అది సహించలేని కుబేర వర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు.. ‘నా ముందు దేవదత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన,కనక, వస్తు, వాహనాలు దానం చేశాను.
అలాంటి నాకంటే పట్టెడన్నం పెట్టిన దేవదత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?’ అంటూ. అందుకు దేవదూతలు ‘అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి,దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారిలో.. ఆసుపత్రులను కట్టించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించినవారు కొందరు.
వికలాంగులను ఆదరించి పోషించిన వారు మరికొందరు. ఇంకా కొందరు చెరువులు తవ్వించి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. వాటన్నిటినీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశారు. కాబట్టే నీకంటే ముందున్నారు. ఇక నువ్వు కీర్తి కోసం స్వార్థంతో మీ పూర్వీకుల సంపదనంతా అపాత్రదానం చేశావు. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి. కాని నువ్వు అలా చేయలేదు’ అని చెప్పారు. అంతా విన్నాక కుబేర వర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా కీర్తి కాంక్షతో దుర్వినియోగం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు.
(చదవండి: ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా! ఎక్కడుందంటే..)
Comments
Please login to add a commentAdd a comment