
మాజీ ప్రపంచ సుందరి, బాలీవూడ్ అగ్రశ్రేణి నటి ప్రియాంక చోప్రా.. రిషి కపూర్, ట్వింకిల్ ఖన్నా, నసీరుద్దీన్ షాల సరసన చేరారు. ఈ బాలీవుడ్ దిగ్గజాల దారిలోనే కలం చేత పట్టి ప్రియాంక తన ఆత్మకథ రాశారు. ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్’ ప్రచురిస్తున్న ఈ పుస్తకానికి ‘అన్‌ఫినిష్ఢ్’గా నామకరణం చేశారు. 2019లో మార్కెట్‌లోకి రాబోతున్న ఈ ఆత్మకథలో ప్రియాంక సేకరించిన వ్యాసాలు, కథలు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, పరిశీలించిన సంఘటనలను వివరించారు. ఈ పుస్తకాన్ని ఎంతో నిజాయితీగా, సరదాగా, ముక్కు సూటిగా, ఎవరినీ విమర్శించకుండా రాశానన్నారు ప్రియాంక. గతంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటకి చెప్పలేదని, కానీ ఈ పుస్తకంలో వివరించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు.
పుస్తకం గురించి వివరిస్తూ..
పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్ సంస్థ కు చెందిన మానసి సుబ్రమణ్యం, ప్రియాంక రాసిన ఆత్మకథ గురించి వివరిస్తూ.. ‘ఈ పుస్తకం ప్రియాంక ఆత్మకథకు మాత్రమే కాదు.. మహిళల మేనిఫెస్టో’గా అభివర్ణించారు. అన్‌ఫినిష్డ్ పుస్తకం చదివాక మహిళలు ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడుతుందని, ఎవరినైన ప్రభావితం చేయగలిగే శక్తి ప్రియంకకు ఉందని సుబ్రమణ్యం తెలిపారు.