శివరాజ్‌ | Funday horror story of the week 13-01-2019 | Sakshi
Sakshi News home page

శివరాజ్‌

Published Sat, Jan 12 2019 10:11 PM | Last Updated on Sun, Jan 13 2019 12:16 AM

Funday horror story of the week 13-01-2019 - Sakshi

‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’  చివరి వాక్యం రాసి వేళ్లు విరుచుకున్నాడు శ్రీధన్‌ శివరాజ్‌. డెబ్భై ఏళ్లు ఉంటాయి అతడికి. పొడవుగా, బక్క పలుచగా ఉంటాడు. కళ్లు లోతుగా ఉంటాయి. ఆ లోతుల వెనుకాల పూర్వజన్మల్లోంచి చూస్తున్నట్లుగా సూక్ష్మంగా, నిశితంగా ఉంటుంది శివరాజ్‌ చూపు. ఎంతటి మనిషినైనా పట్టేస్తాడు.  దెయ్యాల్ని పట్టేయడం గొప్పగానీ, మనుషుల్ని పట్టేయడం ఏం గొప్ప అన్నారు ఎవరో ఎప్పుడో. అప్పుడు పెద్దగా నవ్వాడు శివరాజ్‌. నవ్వాడు అంతే. ఏమీ అనలేదు.  శివరాజ్‌ ఎవరికీ అంతుపట్టడు. అంతుపట్టకపోవడానికి ఒక కారణం అతడు పెద్దగా మాట్లాడడు. భార్య పోయినప్పుడు, పిల్లలు వెళ్లిపోతున్నప్పుడూ అతడు మౌనంగానే ఉన్నాడు. ‘‘ఉండు పార్వతీ’’ అని మాత్రం తన అరవై ఏళ్ల వయసులో భార్య చేతిని పట్టుకుని అడిగాడు. వెళ్లిపోయాక ఎక్కడి నుంచి వస్తుంది పార్వతి?  పార్వతి అనే ఆత్మ వెళ్లిపోయాక, శివరాజ్‌ అనే దేహం ఒక్కటే మిగిలింది భూమి మీద. ఎప్పుడూ ఆత్మలో ఉండే ఈ దేహానికి ఏకాంతాన్ని కల్పించాలని అనుకున్నారేమో పిల్లలు.\ ఊళ్లోనే ఉన్నా, విదేశాల్లో ఉన్నట్లుగా వేరే ఇంటికి మారిపోయారు.  ఇల్లు, ఆ ఇంట్లో శివరాజ్‌.. ఇద్దరే మిగిలారు. పార్వతి ఫొటో ఉన్న గదిలో కూర్చుంటాడు రోజంతా అతడు. పార్వతి బతికి ఉన్నప్పుడు కూడా అతడు ఆమెతో మాట్లాడిందీ, ఆమెను చూస్తూ కూర్చున్నదీ లేదు. పార్వతితో మాట్లాడ్డం అంటే శివరాజ్‌కు తనతో తను మాట్లాడుకోవడమే. ఎవరైనా తమతో తాము  మాట్లాడుకుంటారా? శివరాజ్‌ ఎవరికీ అంతుబట్టకపోవడానికి ఇంకో కారణం అతడు రచయిత. దెయ్యాల రచయిత. ఎప్పుడూ ఆ ఆలోచనల్లో ఉంటాడు. నలభై ఏళ్లుగా అతడు పత్రికలకు దెయ్యాల కథలు రాస్తున్నాడు. పరభాషల్లోకి కూడా అవి తరచూ అనువాదం అవుతుంటాయి. శివరాజ్‌ రాసేవి పేరుకు దెయ్యాల కథలే కానీ.. దెయ్యాలు ఉన్నాయనీ, దెయ్యాలు లేవనీ చెప్పే కథలు కావు. ‘‘మరెందుకు రాస్తున్నట్లు?’’ అని ఓసారెప్పుడో ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినవాళ్లు అడిగారు. నవ్వాడు శివరాజ్‌. ‘‘దెయ్యాలు ఉన్నాయనుకునే వాళ్ల కోసం, దెయ్యాలు లేవనుకునేవాళ్ల కోసం రాస్తున్నాను’’ అన్నాడు.  ‘‘మీరేం చెప్పదలచుకున్నారు. దెయ్యాలు లేవనా? దెయ్యాలు ఉన్నాయనా?’’.. అడిగారు ఇంటర్వ్యూ వాళ్లు.‘‘నేను చెప్పదలచుకున్నదే కదా రాస్తున్నాను’’ అన్నాడు శివరాజ్‌.  ‘‘మీ ఉద్దేశం ఏంటి? దెయ్యాలు ఉన్నాయనా? లేవనా?’’  ‘‘తెలీదు. కానీ దెయ్యాల మీద నాకు రెస్పెక్ట్‌ ఉంది’’‘‘రెస్పెక్ట్‌ ఎందుకు?’’‘‘మీలా అవి ప్రశ్నలు వేయవు కాబట్టి..’’ఇలాగే ఉంటుంది శివరాజ్‌ మాట్లాడ్డం. శివరాజ్‌తో మాట్లాడ్డం. 

‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’చివరి వాక్యం రాశాక.. ఫొటోలో పార్వతివైపు చూశాడు శివరాజ్‌. నవ్వు ముఖం. మనసు నిండా ప్రశాంతతను నింపే ముఖం. ఫొటోని చేతుల్లోకి తీసుకుని మెత్తటి గుడ్డతో తుడిచి, మళ్లీ గోడకు పెట్టేశాడు. పెరట్లోని తాజా పూలతో తానే గుచ్చిన దండను పార్వతి ఫొటోకి తగిలించాడు.అతడు రాసిన చివరి వాక్యం తను రాస్తుండే దెయ్యం కథల్లోని ముగింపు వాక్యం కాదు. తన బయోగ్రఫీలోని ‘ది ఎండ్‌’ సెంటెన్స్‌. అతడి జీవిత చరిత్రను సీరియల్‌గా వేసుకుంటామని పెద్ద పెద్ద పత్రికలు, పెద్ద పెద్ద పారితోషికాలతో ముందుకు వచ్చాయి. ఆసక్తి లేదన్నాడు. ఒకేసారి రిలీజ్‌ చేస్తానన్నాడు. పబ్లిషర్స్‌ వచ్చారు. ఇవ్వలేనన్నాడు. ప్రచురణ హక్కులు తన భార్యకు ఇచ్చేశానన్నాడు! పార్వతీ పబ్లికేషన్స్‌ పేరు మీద పుస్తకం వస్తుందన్నాడు. పార్వతే పుస్తకాన్ని ఆవిష్కరిస్తుందని కూడా చెప్పాడు! శివరాజ్‌ భార్య ఎప్పుడో చనిపోయింది కదా, ఆవిడ ఆవిష్కరించడం ఏంటని కొందరికి సందేహం వచ్చింది. శివరాజ్‌కి మతి భ్రమించినట్లుందని కొందరనుకున్నారు. 

‘‘పూర్తయింది పార్వతీ’’ అన్నాడు శివరాజ్‌ పార్వతి ఫొటో వైపు చూస్తూ. ఫొటోలోని పార్వతి నిశ్చలంగా, కోనేటి పువ్వులా ఉంది. దేవుడి చెట్టు మీది నుంచి రాలిపడినట్టు. ‘‘పూర్తయింది’’ అని పత్రికల ఎడిటర్‌లకు ఫోన్‌ చేసి చెప్పాడు! ‘‘ఆల్రెడీ ఇచ్చేశారు కదా శివరాజ్‌ గారూ.. నెక్స్‌ట్‌ వీక్‌ కదా మీరు ఇవ్వాల్సింది ’’ అన్నారు వాళ్లు. ‘‘పూర్తయింది’’ చెప్పేశాడు శివరాజ్‌. అరగంటకు టీవీలో స్క్రోలింగ్‌ మొదలైంది! ప్రముఖ దెయ్యాల కథా రచయిత శ్రీధన్‌ శివరాజ్‌ (70) ‘కథాధర్మం’.మొదటి కథ çఫలానా సంవత్సరంలో. చివరి కథ ఫలానా పేరుతో.. అంటూ ఇంకా వివరాలేవో స్క్రోల్‌ అవుతున్నాయి. నవ్వుకున్నాడు శివరాజ్‌. వెళ్లి టీవీ కట్టేశాడు. రిమోట్‌ పనిచేయడం ఎప్పుడో మానేసింది. పార్వతికి టీవీలో ఆ డబడబలు ఇష్టం ఉండదు. ఆమె చనిపోయినప్పట్నుంచీ టీవీని మ్యూట్‌లోనే చూస్తున్నాడు శివరాజ్‌. టీవీ కట్టేశాక, పార్వతి ఫొటో వైపు ఒకసారి చూసి, గది తలుపులు వేసుకున్నాడు శివరాజ్‌. 

శివరాజ్‌ కథలు రాయడం మానేశారనే అర్థంలో ‘కథాధర్మం’ అని మొదటి బ్రేకింగ్‌ న్యూస్‌ ఇచ్చిన చానల్‌ను చూసి, తక్కిన చానళ్లు కొన్ని.. ‘శివరాజ్‌ కాలధర్మం’ అని టెలికాస్ట్‌ చేసేశాయి! శివరాజ్‌ పోయారనే వార్త తెలిసి ఆయన అభిమానులు నివ్వెరపోయారు. ఆయనకు డెబ్భై ఏళ్లా అని కొందరు ఆశ్చర్యపోయారు.  అందరికంటే ముందుండే టీవీ చానల్‌ వ్యాన్‌ ఒకటి లైవ్‌ టెలికాస్ట్‌ కోసం శివరాజ్‌ ఇంటి ముందు ఆగింది. ‘కథాధర్మం’ అని క్రియేటివ్‌ బ్రేక్‌ ఇచ్చింది ఆ చానలే. శివరాజ్‌ ఇంటి బయటి గేటు తెరిచే ఉంది. లోపలికి వెళుతూ, తన పక్కనే ఉన్న కెమెరామన్‌ని అడిగింది ఆ చానల్‌ నుంచి వచ్చిన రిపోర్టర్‌.. ‘దేవాలయాలు ఎక్కడైనా పాడుబడతాయా?’ అని. తెలియదన్నాడు కెమెరామన్‌. ‘మేము వెళ్లేటప్పటికి పాడుబడిన దేవాలయంలా ఉంది శివరాజ్‌ ఉంటున్న ఇల్లు’ అని మొదలు పెడితే బాగుంటుందని అనిపించినట్లుంది ఆ రిపోర్టర్‌కి. హాల్లోకి, అక్కడి నుంచి శివరాజ్‌ గది దగ్గరికి వెళ్లి తలుపుల్ని మెల్లిగా నెట్టారు ఆ రిపోర్టర్, కెమెరామన్‌. లోపల.. మంచం మీద పడుకుని ఉన్నాడు శివరాజ్‌. అతడి పక్కనే కుర్చీ ఉంది. ఆ కుర్చీలో అతడి బయోగ్రఫీ స్క్రిప్ట్‌ కాగితాలు ఒక బొత్తిగా తాడుతో కట్టి ఉన్నాయి. ఆ కాగితాల బొత్తికి ఆన్చి శివరాజ్‌ భార్య ఫొటో ఉంది. ఆమె ఫొటోకి ఉండాల్సిన తాజా పూల దండ, శివరాజ్‌ స్క్రిప్టు పేపర్స్‌కి వేసి ఉంది!‘‘సార్‌..’’ అని దగ్గరికి వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు చానల్‌ వాళ్లు. కళ్లు తెరవలేదు శివరాజ్‌. స్క్రిప్టులోని చివరి కాగితం.. బొత్తి నుంచి వేరుగా ఉంది. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి’ అనే వాక్యం ఉన్న కాగితం అంది. రెండో రోజు న్యూస్‌ పేపర్‌లలో ఆ వాక్యాన్ని చూసి.. శివరాజ్‌ని గతంలో అనేకసార్లు ఇంటర్వ్యూ చేసినవారు అనుకున్నారు:‘దెయ్యాలు లేవని అబద్ధం చెప్పారా? దెయ్యాలు ఉన్నాయనే నిజాన్ని దాచిపెట్టారా?’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement