
మనసుని స్పృశించే మృదు కెరటాలు
పాతబియ్యం
తెలుగు కథాప్రపంచంలో పరిచయమక్కరలేని రచయిత భమిడిపాటి జగన్నాథరావు. 1960 దశాబ్దం నుండి సుమారు 25 కథలు రాశారు. ‘మువ్వలు’, ‘అడుగు జాడలు’ పేర్లతో యీ మధ్యనే అచ్చువేశారు. ఈ కథలు జీవితంలోని వివిధ పార్శ్వాలను సున్నితంగా స్పృశిస్తాయి. మనసు అట్టడుగు లోతుల చెమ్మను పైకితీస్తాయి. దైనందిన యాంత్రికతలో లోపిస్తున్న జీవితాన్ని గుర్తుచేస్తాయి. జీవితమంటే బతకటం కాదు, రసవంతంగా, ఫలవంతంగా అనుభూతుల్ని అనుభవాలుగా మలుచుకోవడం అని బోధిస్తాయి.
సమాజంలో మేధావిగా గుర్తించబడ్డ వ్యక్తి కుటుంబంలోని వారినీ, తోటివారినీ ఎలా ప్రేమించలేకపోయాడో చెబుతారు ‘చూపు’ కథలో. ఆ దృష్టిని మార్చుకుని, జ్ఞానాన్ని మేధస్సుతోకాక హృదయంతో స్వీకరిస్తే, ఇతరులు ప్రేమగా దగ్గరకు రాగలుగుతారని, అదే అసలైన చూపు అనీ అంటారు భజరా.
జీవిత భాగస్వామిని కోల్పోయి, జీవితం శూన్యంగా మారిన సందర్భంలో మరో భాగస్వామితో ఆ శూన్యాన్ని భర్తీ చేసే ప్రయత్నం కంటే, తన చుట్టూ వున్న సమాజానికి తాను చేయగలిగే సేవ చేస్తూ, మనిషి తనను తాను నింపుకోవచ్చు అని చెబుతుంది ‘బొంగరం’ కథ.
‘చిత్రనళీయం’లో జీవితాన్ని ఆస్వాదించడానికి కావలసింది లక్షలూ కోట్లూ కాదు, కేవలం కాసింత స్వచ్ఛమైన చిరునవ్వు... అలా నవ్వగలిగే మానసిక స్థితి అంటారు. ఒక పెదవి వంపు నుండీ, చిన్న బుగ్గసొట్ట నుండీ, మట్టెల సవ్వడి నుండీ కూడా ఆనందాన్ని అనుభవించవచ్చంటారు.
ఆయన కథల్లో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన కథ ‘సముద్రం’. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా, ఒకరిని ఒకరు మలుచుకొని జీవిస్తున్న జంటల మధ్య అనురాగమూ అవగాహనా తప్ప అసూయా అనుమానాలకు తావుండదని చాటుతుందీ కథ. దంపతుల మధ్య ఉండవలసిన స్వచ్ఛమైన, స్వేచ్ఛాపూరితమైన, అరమరికలు లేని, పరస్పర ఆరాధనతో నిండిన ప్రేమను చలంను మరిపించే స్థాయిలో ఆవిష్కరిస్తారు భమిడిపాటి.
పొద్దు వాలిపోతున్న జీవనసంధ్యను ఎలా అర్థవంతంగా మలచుకోవచ్చో ‘మంటల్లో జాబిల్లి’ చెబుతుంది. బిడ్డల అనాదరణకు గురై, బలవంతంగా వృద్ధాశ్రమాల్లో చేరవలసి వస్తే బాధ తప్ప, పట్టణాల్లో ఊపిరాడని ఉరుకులు పరుగుల్లో కొట్టుకుపోతున్న పిల్లలతోవుండి ఇబ్బందిపడేకంటే, ప్రశాంత వాతావరణంలో నెలకొల్పిన వృద్ధాశ్రమాల్లో జీవించాలని నిర్ణయం తీసుకుంటే అది ఆనందించదగిన విషయమే అంటారాయన.
నైతిక విలువల పేరుతో సమాజపు ఇరుసులో నలిగిపోయిన బతుకుల ఆక్రోశం, కుహనా సంస్కర్తలూ, హృదయపు లోతుల ప్రేమలూ, ఆదర్శాలూ, ఆవేశాలూ, సర్దుబాట్లూ... ఎన్ని ఉన్నా ‘జీవితం జీవించడానికే’ అనే సందేశాన్ని చిన్న చిన్న పదాలతో సరళంగా అందించిన సహజ కథకుడు; రాసినవి కొన్నే అయినా, తెలుగు పాఠకుల హృదయ సౌకుమార్యాన్ని స్పృశించి, తెలుగు కథాస్రవంతిలో మృదు కెరటమై నిలిచిపోయిన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు. (ఫోన్: 0712-2548766)
పెద్దిభొట్ల సుబ్బరామయ్య 9849550924